ᐅదైవకృప
మన ఆధ్యాత్మిక పరిణామంలో భగవంతుని కారుణ్యానికి విశిష్టమైన పాత్ర ఉంది. పరమాత్మ ఎంచుకున్నవానికే సత్యదర్శనం కలుగుతుందని ఉపనిషత్‌ద్రష్టలు ప్రవచించారు. భగవంతుడు అనుసరించే విధానాలు మనసుకు అందవు. ఎప్పుడూ ప్రకాశించే సూర్యుని వెలుగులో అన్ని మొగ్గలూ వికసించవు. కొన్ని మాత్రమే పువ్వులుగా మారతాయి. మొగ్గలు తమంత తాము వికసించలేవు అన్నది సత్యమేకాని, అవి వికసించకపోతే తప్పు సూర్యునిదని అనగలమా? ముక్తికి భగవంతుని కారుణ్యం ఉండి తీరాలి. భగవంతుని కృప ఎవరిపై వర్షిస్తుందో ఎవరూ చెప్పలేరు. అది పరమ నిగూఢం.
మనవైపు విశ్వాసం, ఆత్మ సమర్పణ తప్పనిసరి. అప్పుడే మనకు కారుణ్యం లభిస్తుంది. అది ధ్యానం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఆత్మశీలన కావచ్చు. అది వ్యక్తి నిర్ణయించుకునే మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. భగవంతుని కారుణ్యం మనం అనుకున్న పద్ధతిలోకాని, నిర్ణీత విధానంలో కానీ పని చేయదు. ఒక్కొక్కసారి ఎంతగా తపించినా, ఆక్రోశించినా కృప కలగదు. మనం ఎదురుచూడని క్షణంలో కృప మనపై ప్రసరిస్తుంది. భగవంతుడు కారుణ్యం చూపే క్షణాలు చాలా అరుదు. స్వర్గం పిలుపు అరుదు. దానికి ప్రతిస్పందించే మానవహృదయం మరీ అరుదు. సత్యాన్ని జీర్ణించుకుని పూర్ణ సాక్షాత్కారం సంభవించడానికి కృప తప్ప మరో మార్గాంతరం లేదు.
బలంగా గాలి వీచిన శబ్దం. మనకు వినిపిస్తుంది. కాని అది ఎక్కడినుంచి ప్రసరిస్తుందో ఎటు వెళ్తుందో ఎవరూ చెప్పలేరు. పరమాత్మ కృపా అంతే. ఎవరిపై వరాల సువర్ణ వర్షం కురుస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిపై (భక్తుడు లేదా సాధకుడు, లేదా సామాన్యుడు) జీవితమంతా భగవంతుని కృప ప్రసరిస్తూనే ఉంటుంది. ఇది మరీ ఆశ్చర్యం! యుద్ధంలో యుద్ధఖైదీలు కొందరు మరణం తప్పదనుకున్న సమయంలో బతికి బట్టకట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సర్వ విజ్ఞానమయ శక్తి చేసే అద్భుతాలు, పనిచేసే తీరుతెన్నులు మనసుకు దుర్గ్రాహ్యాలు!
ఆత్మసిద్ధిని మనసు ప్రయత్నించలేదు. మనసుకు అర్థం కాదు. పరమాత్మ వెలుగుపై ఆధారపడిన బుద్ధి మొత్తం సృష్టి విలాసాన్ని, ఆత్మ వికాసాన్ని అర్థం చేసుకోవడం అసంభవం. సృష్టిలో బుద్ధి ఒక భాగమే! అది ఒక కొవ్వొత్తితో సూర్యకాంతి ఆవిర్భావ స్థానాన్ని కొలవడం వంటిది. అటువంటి బుద్ధికి పరిమితం కాకుండా, మనకు మించిన శక్తి ఉన్నదని భావించి- భక్తిమార్గాన్ని కాని, అంతరంగ శోధనపథాన్ని కాని అనుసరించడం ఉత్తమం. అదే ఆఖరి వివేకం. భగవంతుడి అమేయశక్తి సంపదకు కృతజ్ఞత చెప్పుకొని, భక్తిప్రపత్తులతో ఈ సృష్టి అద్భుతంపట్ల మనసు వినమ్రమై మోకరిల్లినప్పుడు- ఆయన కారుణ్య ద్వారాలు వాటంతటవే తెరచుకొంటాయి.
భగవంతుని కృపాకటాక్షాలు లేవని బాధపడటం అవివేకం. మనకు ఎన్నో బహుమతులు భగవంతుడు అడగకుండానే ఇచ్చాడు. ఈ జీవితం భగవంతుని కానుక కాదా? మనం మానవ చైతన్యంతో జన్మించాం. అది మొదటి కానుక. మనం ఈ క్షుద్ర, భయానక లోకంలో కొన్ని క్షణాలైనా ఆనందంగా ఊపిరి తీస్తున్నాం. అది కృప కాదా? జీవితం నిరాశామయంగా, నిరాసక్తంగా ఉందని అనిపిస్తే దానికి కారణం మనలో కృతజ్ఞత లోపించిందని అనుకోవాలి. ఈ కృతజ్ఞత ఉంటే జీవితం ప్రతిక్షణం ఉజ్జ్వలంగా, ఉద్వేగభరితంగా ఉంటుంది. కృతజ్ఞత ఎల్లప్పుడూ ఉంటే, బాహ్య సంఘటనలు ఏవైనా, జీవితం తియ్యగా ఉంటుంది. ప్రతి అల్పమైన వస్తువును భగవంతుని కృపవల్ల లభించిన కానుకగా పరిగణించాలి. ఏ సందేహాలు, ఏ వివాదాలు, ఏ న్యాయ నిర్ణయాలూ వద్దు. భగవంతుని పట్ల కృతజ్ఞత మన నరనరాల్లో ప్రవహించాలి. సృష్టి అప్పుడు ఒక మహాద్భుతంలాగ, ఆనంద అమృతధామంగా కనిపిస్తుంది! అంతకు మించిన కృప ఏముంది?
- కె.యజ్ఞన్న