ᐅఈ వేదన కమనీయం



ఈ వేదన కమనీయం 

సాధన... ఒక శోధనే కాదు. ఒక వేదన కూడా. ఔను. నిజమే. సాధన.... ఒక సత్య శోధన. ఇది నిజం. కానీ వేదనేంటి? ఇదీ నిజమే. తల్లి బిడ్డను కంటుంది. బిడ్డ కావాలంటే ముందు ప్రాణాంతకమైన ప్రసవ వేదన భరించి తీరాలి. అయినా భరిస్తుంది. అంత బాధనూ అలవోకగా భరించగలంత ఆనందం ఉంది మరి మాతృత్వంలో. విచిత్రం ఏమిటంటే- ఆ బాధలోనూ ఒక మాధుర్యం ఉంది! భరించలేనంత బాధను భరించగలంత మాధుర్యం. సాధనా అంతే. భగవత్ సన్నిధానమనే అమృత ధామం లభించే సాధన.... సాధన. ఆ సాధన చేస్తున్నంతకాలం ఒక ఆతృత. ఒక ఆవేశం. ఒక ఆవేదన. అయినా ఆశ. ఆనందం. 'సాధన ఫలిస్తుందా, నా సాధన సత్యమైందేనా, తగినంతగా ఉందా, ఇంకా ఏమైనా చేయాలా?' ఎన్నో ఎన్నో అనుమానాలు. ముఖ్యంగా ప్రారంభ సాధకుల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంటుంది. దేవుడంటే కొత్తగా ఏర్పడిన భక్తి- నిలిచి నీళ్లు తాగనివ్వదు. ఎవరెవరో ఏమేమో చేసేస్తున్నారు. నేను వెనకబడిపోతున్నాను (నిజానికి ప్రారంభమే అయి ఉండదు). ఏదో చేయాలి. వెంటవెంటనే చేసేయాలి. ఏం చేయాలి? కొత్త బిచ్చగాడిలాంటి తొందర తరుముతుంది. తల్లడిల్లజేస్తుంది. లోపలినుంచి భగవంతుడంటే అంకురించిన ప్రేమ, కొమ్మలు లేకుండానే ఆకులు మొలిచినట్లు, రెమ్మలు లేకుండానే పూలు పూచినట్లు- హృదయం నిండి పొర్లిపోయిన పూలసజ్జలా ప్రేమావేశాలను బయటికి ఎగజిమ్ముతూ ఉంటుంది. భగవంతుడక్కడే ఎక్కడో దోబూచులాడుతున్నట్లు ఒళ్లంతా వేయి కళ్లుగా అన్నిపూజలు, అందరి అర్చనలు, ఆరాధనా విధులు ఆత్రుతగా పరిశీలిస్తూ అవన్నీ తానొక్కసారిగా ఆచరించాలనే అతి తొందరలో తడబాటులో ఉంటాడు. అనుభవ రాహిత్యం, వెంటనే పొందేయాలనే ఆత్రం- ఏం చేయగలను, ఏమీ చేయలేననే భయం... ప్రారంభ ప్రేమికుణ్ని విచిత్రమైన వేదనకు గురిచేస్తాయి. ఇదే తీయని వేదన. మధురమైన వేదన. భగవంతుడి గురించి ప్రతి ఆలోచనా.... అది ఎలాంటిదైనా... భక్తుడికి అమందానందాన్నే ఇస్తుంది- భయంతో కూడినదైనా, భక్తితో కూడినదైనా. లోకంలో దేనికీ లేని భరోసా భక్తికి ఉంది. భగవంతుని ప్రేమించడంలో ఉంది. ముందుగా నూతన సాధకులు ఇది తెలుసుకోవాలి. ఆయన పట్ల మన ప్రేమ, అర్చించిన హృదయం, చేసే సాధన.... ఇవన్నీ బ్యాంకులో దాచుకున్న ధనంలాంటివి. కనులు మూసినా, కనులార్చినా, కన్నీరు కార్చినా ప్రతి కదలికా, ప్రతి పరమాణుమాత్ర స్పందనా ఆ బ్యాంకులో ధరావతు అయిపోతుంది. లెక్కల్లో అణుమాత్రం తేడా ఉండదు. ప్రాపంచిక బ్యాంకుల్లోనూ ఈ ధనం ఏ దొంగలూ దోచుకోలేనిది. ఏ నష్టానికీ లోనుకానిది.
కాబట్టి... భగవంతుని ప్రేమిద్దాం. ప్రశాంతంగా సాధన చేద్దాం... తొందరపడితే తొట్రుపాటవుతుంది. తేనెటీగలు ఎంత ఓర్పుగా తేనె సేకరించి పట్టుకు చేరుస్తాయి! పక్షులు ఎంత సహనంతో పుల్లా పీచూ ఏరుకొచ్చి గూడును పేరుస్తాయి! మనకామాత్రం సమయం లేదా? లేకపోతే ఎలా? భగవత్ సన్నిధి అనేది లోకాతీతమైన పెన్నిధి. అద్భుతమైన విషయం ఏమిటంటే- దాన్ని దాదాపు అందరం ప్రేమిస్తాం. కోరుకుంటాం. అది సహజం. కానీ దాన్ని అందుకునే అవకాశం అందరికీ ఉండటం! అది చాలు. గమ్యం చేరుకునే అవకాశం ఉందని తెలుసు. గమనంలోని ప్రతి చిన్న, అతి చిన్న ప్రయత్నం మన గమ్య హర్మ్య శిఖరానికి ఇటుకగా పేరుతుందనీ తెలుసు. ఇంకేం కావాలి? ఇంతకంటే హామీ ఏం కావాలి? ఇక వేదన... వేద వేద్యుని కొరకై కాబట్టి...మధురాతి మధురం. అనుభవిద్దాం. అనుభూతి పొందుదాం. ఆస్వాదిద్దాం. ఆనందిద్దాం!

- చక్కిలం విజయలక్ష్మి