ᐅమహాకాళి జాతర



మహాకాళి జాతర 

దైవారాధన పరంపరలో ప్రకృతిని, శక్తిని పూజించుకోవడం అనాదిగా కొనసాగుతోంది. ప్రాంతీయ ఆచార వ్యవహారాలనుబట్టి ఆరాధనారీతులు మారుతుంటాయి. దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడి ఆగమనంతో ప్రకృతి పులకరిస్తుంది. ఈ తరుణాన ఆషాఢ మాసంలో- శ్రమశక్తిని నమ్ముకున్న కర్షకులు, శ్రామికులు అమ్మతల్లి అనుగ్రహం కోసం పలు ఉత్సవాలు నిర్వహించుకుంటారు. బోనాల వేడుక పేరిట మహాశక్తిని విభిన్న గ్రామదేవతలుగా కొలుచుకుంటారు. తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపడుతూ విలసిల్లే ఈ ఉత్సవాల్లో సామూహిక భక్తిచైతన్యం ఉత్తుంగ తరంగమై ప్రకటితమవుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బోనాల సంబరం ఉత్సాహభరితంగా వెల్లివిరుస్తుంది. సికింద్రాబాద్‌లో నెలకొన్న ఉజ్జయినీ మహంకాళి జాతరతో ఈ సంబరం అంబరాన్ని తాకుతుంది.
భాగ్యనగరంలో బోనాల సందడికీ, ఉజ్జయినీ మహంకాళి సన్నిధికీ సంబంధం ఉంది. 18వ శతాబ్దంలో సికింద్రాబాద్ వాసి అయిన సురిటి అప్పయ్య సైనికాధికారిగా ఉజ్జయినిలో బాధ్యతలు నిర్వహిస్తుండేవాడు. అక్కడ ఓ సందర్భంలో కలరా వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి తగ్గుముఖం పడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్‌లో అమ్మవారికి ఆలయాన్ని నిర్మింపజేస్తానని ఉజ్జయినీ మహాకాళిని ప్రార్థించాడు. ఆ వ్యాధి తగ్గడంతో ఉజ్జయినీ ఆలయం నమూనాలోనే ఆ భక్తుడు సికింద్రాబాద్‌లో 1815లో అమ్మవారికి గుడి కట్టించాడని చెబుతారు. 1864లో ఆలయ ప్రాంగణంలోని ఓ బావికి మరమ్మతు చేస్తున్నప్పుడు తవ్వకాల్లో మాణిక్యాలదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహంతోపాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న ఉజ్జయినీ మహాకాళి స్థానంలో కూడా ఓ రాతి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఈ కోవెలలో మహాకాళి, ఆమెకు కుడివైపున మాణిక్యాలదేవి శిలామూర్తులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళి కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎన్నో దశాబ్దాలుగా భక్తులు బోనాల్ని సమర్పిస్తూ, అమ్మవారికి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆషాఢ జాతర ఘటోత్సవం అని వ్యవహరించే ఎదురుకోలుతో ప్రారంభమవుతుంది. ఓ ఘటం(కలశం)లోకి అమ్మవార్ని ఆవాహన చేసి, ఆ ఘటాన్ని పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగిస్తారు. ఘటోత్సవ అనంతరం మహాకాళికి బోనాలు(ప్రసాదాలు) సమర్పిస్తారు. అమ్మవారికి ప్రియమైన వంటకాల్ని సిద్ధం చేసి- పసుపు, కుంకుమలు అలంకరించిన ప్రత్యేకమైన పాత్రలో బోనాల్ని నింపుకొని ఆలయానికి తరలివస్తారు. 'సాకబెట్టుట' అనే వేడుక ద్వారా తమ లోగిళ్లను చల్లగా చూడమని భక్తులు అమ్మవార్ని వేడుకుంటారు. సాక అంటే శాఖ. శాఖ అంటే చెట్టుకొమ్మ. వేపచెట్టునుంచి కోసిన వేపమండను పసుపునీటిలో ఉంచి, అమ్మవారికి సమర్పించడమే సాకబెట్టుట. ఫలహారపు బండ్లు, గావుపట్టు, రంగం-వేడుక వంటి ఘట్టాలతో, పోతురాజుల విన్యాసాలతో మహాకాళి జాతర మహత్తరంగా వర్ధిల్లుతుంది. 'సాగనంపు' అంశంతో సుసంపన్నమయ్యే ఈ జాతర ఆసాంతం జానపదుల కళావైభవాన్ని, వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రాభవాన్ని ప్రతిఫలిస్తుంది. సృష్టి, స్థితి, లయం అనే జగన్మాత శక్తితత్వం ఈ జాతరలో వ్యక్తమవుతుంది. కలశవాహనం(సృష్టి), ఊరేగింపు(స్థితి), సాగనంపు (లయం) ప్రక్రియల్లో ఆదిశక్తి అవతార రహస్యం స్పష్టంగా గోచరమవుతుంది.

- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్