ᐅఅహంకారం




అహంకారం 

మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. మోతాదుకు మించిన 'నేను' అన్న స్వరం అహంకారం. అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే. దీనికి ఎంతటి సాధనా సంపత్తి కావాలి! మానవ మస్తిష్కంలో జరిగే మంచి చెడుల పోరాటం- దేవదానవుల సంగ్రామం వంటిది. మంచి దేవతా స్వరూపమైతే, చెడు రాక్షస స్వభావం. ఈ రెంటి ఘర్షణలో జయాపజయాలు కలుగుతాయి. వాటిననుసరించే అహంకారం జనించడంకానీ, నాశనం కావడంకానీ జరుగుతుంది.
సీతామహాసాధ్విని అపహరించడం తప్పు అని తెలీనివాడు కాదు రావణబ్రహ్మ. అతడు నిత్య శివపూజాతత్పరుడు. పండితుడు. పరాక్రమవంతుడు. రావణాసురుడు సీతావ్యామోహితుడు కాదు. మరెందుకు- శ్రీరాముడు లేని సమయంలో అపహరించి తీసుకుపోయి అశోకవనంలో ఉంచాడు? ఈ చర్యలో అహంకారం ఉంది. గొప్పవాడైనా, జ్ఞానే అయినా అహంకారాన్ని వదిలిపెట్టలేకపోయాడు రావణుడంతటివాడు.

మనం నిత్య పారాయణం చేసుకునే పురాణపాత్రలన్నీ ఏకస్వరూపమైన పరమాత్మ జనకాలే. దుష్టశిక్షణ ఎప్పటికైనా, ఏ తీరుగానైనా తప్పదన్న సత్యాన్ని లోకంలో ప్రతిష్టాపన చేసేందుకు పరమాత్మ తన అంశను వేరొక రూపంలోనూ సృష్టిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడు, యోగమాయ ఒకేసారి జన్మించారు. యోగమాయ దుర్గ, శ్రీకృష్ణుల అంశ ఒక్కటే. 'దేవీ జననం' చైత్రశుద్ధ నవమి మధ్యాహ్నంనాడు సంభవించిందని దేవీ భాగవతం చెబుతుంది. అదేరోజున ఒకే అంశలో శ్రీరామజననమూ చోటు చేసుకుందంటారు.

సీత, శంకరుడు ఒకే అంశ. రావణుడు అలవిమాలిన అహంకారంతో పరమేశ్వరుణ్ని తన అశోక వనానికి తీసుకెళ్ళాలని కైలాసగిరికి వెళ్తాడు. ఈ అహంకార భావన జగన్మాతకు నచ్చదు. నందీశ్వరుణ్ని అవమానిస్తాడు రావణుడు. ఆ నందీశ్వరుడి అంశే అయిన ఆంజనేయుడు రావణుడికంటే ఉన్నతాసనం తన వాలంతో ఏర్పరచుకొని సభలో లంకేశుని అధిగమిస్తాడు. నీతులు బోధిస్తాడు. అహంకారం వదులుకోకుంటే పతనం తప్పదని హెచ్చరిస్తాడు. ఇదీ రావణుడు గ్రహించలేకపోలేదు.

ఇక పార్వతీపరమేశ్వరులు వేరువేరు రూపాలు కాదు. ప్రకృతి పురుషుల ఏకత్వం. శంకరుని అంశ సీత.

సీతను అపహరిస్తే శంకరుని అపహరించినట్లే. తాను సృష్టికర్త అంతటివాడినన్న అహం రావణుడిది.

కైలాసంలో జగన్మాత తన కోర్కెను సఫలీకృతం గావించలేదు. కాబట్టి సీతను అపహరించి తన అశోకవనంలో ఉంచాడు. కామోన్మత్తత అనేది ఒక మిష. లోకాలను మభ్యపెట్టాడు రావణుడు.

శ్రీరాముడిది, పార్వతీదేవిది ఒకే అంశ. శ్రీరాముడు రావణ అహంకారాన్ని నాశనం గావించాడు. శివశక్తుల స్వరూపమైన సీతాసాధ్విని చెర విడిపించాడు. పాత్రల అంతరార్థం ఎలా ఉన్నా- సామ్రాజ్యాధీశుడికైనా అహంకారం అనేది అనర్థాన్నే కొనితెస్తుందన్న విషయం గమనించాలి.

ఒక్కొక్కసారి విజయమూ అహంకారాన్ని పెంచుతుంది. దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు యుద్ధంలో. విజయగర్వం తలకెక్కి ఆత్మస్తుతికి, పరనిందకు పూనుకొంటారు దేవతలు. తామే శక్తిమంతులమన్న మిడిసిపాటు రాజ్యమేలుతుండగా- ఓ బ్రహ్మాండమైన వెలుగు ప్రత్యక్షమవుతుంది. ఆ వెలుగుకేసి చూడలేకపోతారు దేవతలు. ఆ వెలుగేమిటో తెలుసుకొని రమ్మని ఇంద్రుడు అగ్నిని పంపుతాడు.

సమీపించిన అగ్నిని నీవెవరని అడుగుతుంది ఆ వెలుగు. 'నేను జాతవేదుడిని... దేన్నైనా దహించగలను' అంటూ అహంకారం ప్రదర్శిస్తాడు. 'ఏదీ! అయితే ఈ తృణాన్ని దహించు' అంటూ గడ్డిపోచను అతని ముందుంచగా దహించలేక విఫలుడవుతాడు అగ్ని.

'నేను మాతలిని... ప్రచండ జంఝామారుతాలను సృష్టించగలను. సర్వప్రాణికోటికి ఆధారభూతుణ్ని. ఎంతటి వస్తువుకైనా స్థానభ్రంశం చేయగలను అంటూ అహంకరిస్తూ వచ్చిన వాయువూ విఫలమవుతాడు.

ఇంద్రాది దేవతలు ఆ మహా వెలుగుకు శిరసువంచి నమస్కరించి, ప్రార్థించి- 'నీవెవరివి' అంటూ అడగ్గా, పరాశక్తి ప్రత్యక్షమై వారి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అహంకారాన్ని చిదిమేస్తుంది.

పురాణపాత్రలు, ఇతిహాస గాథలు మానవాళికి మార్గనిర్దేశనంగావించే పవిత్ర శాసనాలు.

మనలోని అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆ దిశగా సాధన చెయ్యాలి. ఆ సాధన మానవుణ్ని మహనీయునిగా చేస్తుంది.

- దానం శివప్రసాదరావు