ᐅవ్యాసం వందే జగద్గురుం
జ్ఞానాన్వేషణలో గడిపే భక్తుణ్ని, సాధకుణ్ని భగవంతుని సాన్నిధ్యానికి ఉద్ధరించేవాడే నిజమైన గురువు. వేదాలు, శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించిన గురువులెందరో ఉన్నారు. విశ్వ, కాలాతీతమైన మహాసత్య సాక్షాత్కారం పొందిన గురువు బహు అరుదుగా లభిస్తాడు. ఆత్మ కాకుండా ఇతరత్రా సమస్తాన్ని ఇవ్వగలిగిన గురువులెందరో ఉన్నారు. ఆత్మను వెలుగులోకి తెచ్చే గురువు ఎంతో అరుదు.
గురువు అమృత స్పర్శతో మనసులో ఆనంద ప్రవాహాలు పరవళ్లు తొక్కాలి. అటువంటి గురువును జ్ఞాని అయిన భక్తుడు ఎన్నుకోవాలి. శిష్యుణ్ని భగవత్ ప్రేమ విద్యుద్వలయంలో ఉంచగలిగినవాడే అసలు గురువు. శిష్యుణ్ని తనగుండెలో ఉంచుకోగలగాలి. గురువు సన్నిధిలో పరాత్పరుని జ్ఞానం పరిఢవిల్లుతుంది. దుఃఖం దానంతటదే రాలిపోతుంది. ఏ కారణం లేకుండా నిరుపమాన ఆనందం పెల్లుబుకుతుంది. లేమి ఉండదు. ప్రజ్ఞాప్రాభవదీప్తి జీవితమంతా నిండిపోతుంది.
ఐహిక అంధకారాన్ని తొలగించి, పారమార్థిక ప్రకాశాన్ని అందించేవారికే గురువు అనే పదం వర్తిస్తుంది. గురుపౌర్ణమినాడు మానవ విజ్ఞాన పరిపూర్ణత్వానికి మనం పునరంకితులం కావాలి. వేదాంతాన్ని జీర్ణించుకొని ఆ వెలుగుల్ని భవిష్యత్ తరాలకు అందివ్వగలగాలి. వేదాధ్యయనం మనల్ని రాజరుషులుగా మార్చుతుంది. బాహ్యానికి రారాజులం. లోలోపల మంత్ర ద్రష్టలం కావాలి.
బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మవిదుడు అయిన గురువు లేకుండా ఆధ్యాత్మిక వికాసం రాదు. గురువుకు పరిపూర్ణ సమర్పణ చేసుకోవడంకన్నా మించిన అర్హత లేదు.
అంతులేకుండా ఉన్న వేదాలను వ్యాసమహర్షి క్రోడీకరించారు. ఆధ్యాత్మిక, వేద విద్యలను బోధించే వేదికను వ్యాసపీఠం అని అంటుంటారు. వేదాంతజ్ఞానాన్ని ప్రతిపాదించిన వ్యాసునికి ప్రపంచం ఇచ్చిన స్వర్ణపీఠం అది. ఆ పీఠాన్ని అలంకరించే వారంతా వ్యాసుడే ప్రథమ గురువు అని ఆరాధిస్తారు. వాస్తవానికి, గురుశిష్య పరంపర అంతకుముందే ప్రారంభమైనదిగా చెబుతారు.
వ్యాసుని తండ్రి పరాశరుడు. తల్లి సత్యవతి. తండ్రి వివేకతేజస్ఫూర్తికి, తల్లి ఆచరణాత్మక ప్రతిభకు ద్రష్టరూపం వ్యాసుడు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి రెండూ అవసరమే. ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు వ్యాసుడు అవతరించాడు. పూర్ణిమ అంటే జ్యోతిద్వికాసం. వ్యాసపౌర్ణమి అంటే ఆధ్యాత్మిక ప్రకాశం. 'పూర్ణచంద్రోదయం వంటిది నిర్మల విద్య' అని వ్యాసుడు కుమారుడైన శుకునితో అంటాడు (భారతం). భారతీయులు అనాదికాలం నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని 'గురుపౌర్ణమి'గా మహోత్సవాలు జరుపుతూ వస్తున్నారు. దీన్నే వ్యాసపౌర్ణమిగా పరిగణించి, వ్యాస భగవానుడి జన్మదినం మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా జరుపుకొంటున్నారు.
ప్రపంచంలోనే అతి బృహత్తరమైన మహేతిహాసం మహాభారతాన్ని అందించిన కవి-ద్రష్ట వ్యాసుడు. అందులో కళాత్మక, కవితాత్మక విలువలే కాదు- తరతరాలుగా మానవాళిని ఉత్తేజితం చేసే ధర్మాలు, సత్యాలు, నీతులు ఎన్నో మణిమయ నిక్షేపాలుగా పొదిగి ఉన్నాయి. వాటిని మించిన చిరంతన సందేశం 'భగవద్గీత' రత్నమకుటంగా శోభిల్లుతోంది. విశ్వ, వేద విజ్ఞానమంతా వ్యాసునిగా మూర్తీభవించింది. అటువంటి వ్యాసుడికి కోటి కోటి అక్షర కుసుమాంజలి!
- కె. యజ్ఞన్న