ᐅధ్యానం... శిఖరాయమానం



ధ్యానం... శిఖరాయమానం 

ధ్యానం... ధ్యానం... ధ్యానం...! ప్రస్తుతం ధ్యానం అనే మాటకున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. నిజమే. అంతటి శక్తి యుతమైనదే. అంతటి ఉపయుక్తమైనదే. అంతటి యశో సంపన్నమైనదే. కానీ మహోన్నతమైన శిఖరాన్ని కేవలం ఎత్తు కొలతల కోసం ఉదాహరిస్తున్నట్లు నేడు ధ్యానాన్ని వాడుకుంటున్నారు! ఒక గొప్ప అంశం చిన్న ప్రయోజనం కోసం ఉపయోగపడినా... మంచిదే. కానీ దాని అసలు ప్రయోజనం వేరు. దాన్నించి పొందవలసిన అసలు ఫలితాలు వేరు. అమ్మ మీద ప్రేమతో అతి చనువుతో చాలాసార్లు చాలా తక్కువ స్థాయిలో ఆమెతో ప్రవర్తిస్తుంటాం. కానీ అమ్మ విలువ మనం తెలుసుకోవాలి. అమ్మ పవిత్రత మన అవగాహనలో ఉండాలి. అది ముఖ్యం.
ధ్యానం ఒక మహోన్నతమైన, మహోత్కృష్టమైన ప్రయోజనానికి రహదారి. దగ్గరి దారి. పూలదారి. దాదాపు అంతకు మినహా మరో దారి లేదు. అది, మానవుణ్ని అతని జన్మ సార్థకతా స్థానానికి తన రెక్కల మీద మోసుకువెళ్లే శ్వేత కపోతం. శాంతి కపోతం. ఒక సాధకుడు నిజమైన ధ్యానావశిష్ట స్థితికి వెళ్లాలంటే అంతకుముందే ఎన్నో ప్రాథమిక సాధనలు చేసి ఉండాలి. అష్టాంగ యోగంలోని మొదటి ఆరు యోగాలు అనుష్ఠించి ఉండాలి. సాధనా చతుష్టయ అవగాహనం ఉండాలి. సాకేత రాముణ్ని అణువణువునా స్థాపించుకుని ఉండాలి. అంటే- ధ్యానం చేస్తున్న ధ్యాని అనిర్వచనీయమైన, అమోఘమైన స్థితి స్థాపనలో ఉపవిష్ఠుడై ఉంటాడని అర్థం. చాలామందికి ఇది అర్థం కాదు. ధ్యాని అంటే, ధ్యానం అంటే కేవలం ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో, ప్రాపంచిక కార్యనైపుణ్యం కోసమో అనే భావనలో ఉంటారు. అది కొంతవరకు మాత్రమే నిజం. ధ్యానం అసలు స్వరూపం వేరు. అసలు ప్రయోజనం వేరు. ఆ ఉన్నతమైన ప్రయోజనం కోసం ధ్యానించేవాడే నిజమైన ధ్యాని. సాధకుడు. తపస్వి. అతడు చేసేది ఆషామాషీ ప్రక్రియ కాదు. అతడు చేసేది మహోత్కృష్టమైన ఆత్మైక యానం. అనంతయానం. యోగం. కేవలం ఆలోచనా రహిత స్థితి కాదు. కేవలం కాసేపటి మౌనదీక్ష కాదు. కేవలం కాసేపటి ప్రాపంచిక ఉపలబ్ధి ప్రయత్నం కాదు. ప్రతి గాలి తెమ్మెరా సమస్త లోక మలయమారుత హోమంలో ఎలా పవిత్ర సమిధ అయి, యావత్ ప్రపంచ సంచయ సంచార శీతల వాయు వీచిక అవుతుందో- అలాగే ఒక సాధకుడి ధ్యానం లోక కల్యాణ కారకం అవుతుంది.

అందరికీ ఆధ్యాత్మిక వాసన ఉండకపోవచ్చు. పరమార్థం పట్ల అభిలాష, ముక్తి కాంక్ష కలగకపోవచ్చు. అసలు ఆ అవగాహనే లేకపోవచ్చు. అలాంటివారు ప్రాపంచిక అవసరాల కోసం ధ్యానం చేయకూడదా? నిరభ్యంతరంగా చేయవచ్చు. కానీ గొప్ప ఫలితాలనిచ్చే వాటిని, ఉత్తమ ప్రయోజనాల్ని కూర్చేవాటిని అంత గొప్పగానూ ఉపయోగించుకుని, ఆ స్థాయి లబ్ధినే పొందాలి. అరచేతిలోని మణులతో గచ్చకాయలో, గోలీకాయలో ఆడుకోకూడదు కదా! తులసిని పూజకు వినియోగించాలి గానీ- గేదెలకు మేతగా వేయకూడదు. అమృతంతో కేవలం చేతులు కడుక్కునే పరిస్థితులు రావచ్చు. గంగాజలాన్ని చాలా అల్పమైన పనుల కోసం వాడుకునే అవసరాలు కలగవచ్చు. అవి అరుదైన సందర్భాలు. మనం గ్రహించవలసింది విషయ ప్రాధాన్యత. లేదా పవిత్రత. లేదా ఉత్కృష్టత. అప్పుడు దాన్ని సరియైన అవగాహనతో, భావనతో ఉపయోగించుకుంటాం. ప్రయోజనం పొందుతాం. ధ్యానం అలాంటిది. భౌతికావసరాల కోసం దాన్ని అనుసరించినా దాని అసలు ప్రయోజనం తెలుసుకుని, ఆ భావంతో ఆచరిస్తే మనం ఎలాంటి ఉన్నత స్థితులకు వెళ్తామో మనం ఊహించలేం. మనం కోరుకుంటున్న భౌతిక లాభాలు, ప్రయోజనాలు ఎప్పుడో సమకూరిపోతాయి. నిజానికి ధ్యానం ద్వారా అసలు ప్రయోజనం వైపు మనం ప్రయాణం చేసే కొలదీ మన చిన్న చిన్న కోరికలు పొట్టులా రాలిపోతాయి. అవి తీరినా తీరకపోయినా పెద్ద తేడా ఉండదు. అసలు పట్టింపే ఉండదు!

- చక్కిలం విజయలక్ష్మి