ᐅమనిషి - మనశ్శాంతి




మనిషి - మనశ్శాంతి 

మనిషికి మనసే ప్రధానం. మనసు లేనివాడు మనిషే కాదు. అలాంటి మనిషి జంతువుతో సమానం. మనసనేది రెండువైపులా పదును కలిగిన కత్తిలాంటిది. దాన్ని మచ్చిక చేసుకోగలిగితే మనిషి 'మనీషి' కాగలడు. అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోతే ఆ మనసే, మనిషి పతనానికి దారితీస్తుంది.
ప్రపంచంలో బాగా డబ్బున్నవాళ్లు, సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నవాళ్లు, తెలివైనవాళ్లు చాలామంది కనిపిస్తారు. 'ఆయనకేం? మహారాజు!' అని ఈర్ష్యపడేలా కనిపిస్తారు. కాని, లోలోపల అశాంతితో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఒక్కక్షణమైనా మనగలిగితే- అదే పదివేలు అలాంటివారికి. చంకలో బిడ్డను మరచిపోయి వూరంతా గాలించిన తల్లి చందంగా, మనశ్శాంతికోసం దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏ పుట్టలో ఏ పాముందో! ఎందుకైనా మంచిదని చెట్టుకు పుట్టకు సాగిలపడి మొక్కుతారు. శాంతి మంత్రం ప్రసాదించగల సిద్ధపురుషుల్ని, బుద్ధిజీవుల్ని వెతుకుతూ ఉంటారు. మనిషికి మనశ్శాంతి లేకపోవటానికి రెండు ముఖ్యమైన కారణాలు- ఒకటి, ఉన్నదానితో తృప్తిగా జీవించలేకపోవటం. రెండు- లేనిదానికోసం ఆరాటపడటం. ఈ రెంటికీ మూలకారణం అజ్ఞానం.

మనిషి ఈ భూమిమీద పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో, వెళ్లిపోయేటప్పుడూ అలాగే వెళ్లిపోక తప్పదు. ఇది జగమెరిగిన నిత్యసత్యం. ధర్మరాజు చెప్పినట్లు- తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు- రాత్రి అనక పగలనక నిరంతరం యమపురికి అతిథులుగా వెళ్తున్నా, తనజోలికి చావు రాకూడదనుకుంటాడు మనిషి. ప్రతి జీవీ కోరుకునేది ఇదే. అంతులేని కోరికలు, అవి తీర్చుకోవటానికి అనంతకోటి ఉపాయాలు- వీటితోనే మనిషి జీవితం తెల్లారిపోతుంది. అజ్ఞానానికి ఉదాహరణలు ఎన్నయినా చెప్పవచ్చు. దాని నిర్వచనం ఎన్నటికీ మారదు. తానేమిటో తెలుసుకున్న మనిషిని జ్ఞానవంతుడు అంటారు. అలాంటి మనిషి ధనవంతుడికన్నా, బలవంతుడికన్నా మిన్న.

ఈ ప్రపంచం, ఇందులో ఉన్న సరంజామా సర్వం పరమాత్మ అధీనం. ఆ పరమాత్మ అనుజ్ఞ లేకుండా పూచికపుల్ల కదలటానికి వీల్లేదు. ఇచ్చింది పుచ్చుకో, ఆనందంగా అనుభవించు... ఇతరులను గురించి ఈర్ష్య పడకు... నీది కానిదానికోసం అర్రులు చాచకు- అంటున్నది ఈశోపనిషత్తు.

ఈ కిటుకు మనిషికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు, ఆ క్షణమే అతను జ్ఞాని అవుతాడు. ఏ కోరికా లేనివాడికి సుఖం, దుఃఖం రెండూ సమానమే. అలాంటి పరిస్థితిలో మనిషికి మనశ్శాంతి కాక మరెలాంటి ఆస్తితోనూ పని ఉండదు.

- వి.రాఘవేంద్రరావు