ᐅప్రేమతత్వం
'లోకంలో రెండే జాతులున్నాయి... ఇవ్వాలని లేనివారు, ఇవ్వడానికి ఏమీ లేనివారు!' అని పెద్దలు చెబుతారు. ఇచ్చుటలో ఉన్న ఆనందం వేరెచ్చటనూ లేదన్నదీ తెలిసిందే. ఇవ్వడం, పొందడమే కదా జీవితమంటే. మనం ఏదైనా పొందామంటే, అది మరెవరో ఇచ్చిందే! ఇంతకీ మనం ఏం ఇవ్వాలి, ఏం తీసుకోవాలి? అదే ప్రేమ! ఇది అందరూ ఇవ్వగలరు. పేద, ధనిక, జాతి, మత, ప్రాంతాలకు అతీతమైనది. కేవలం కుటుంబ సభ్యులనూ, బంధువులనూ కాకుండా విశ్వవ్యాప్తంగా సర్వులనూ ప్రేమించగలగాలి. ఇతరుల్లోని చెడును విసర్జించి మంచిని మాత్రమే స్వీకరించాలి. 'ఒక మనిషిలోని లోపాలతో సహా ప్రేమించగలగడమే స్నేహం' అని షేక్స్‌పియర్ అంటాడు.
ఈ భూమ్మీద చెడు లక్షణం ఒక్కటీ లేని మనిషి ఉంటాడా? అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిలోని చెడును మాత్రమే విమర్శిస్తే ప్రయోజనం ఏముంటుంది? మన సమాజంలో ప్రతిరోజూ అనేక నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. ఆ నేరస్థులందరినీ క్షమించాలా, ప్రేమించాలా? అలా అనుకుంటే చట్టం, న్యాయం వంటివి వృథా. చట్టం చట్రంలో ప్రతి ఒక్కరూ పరిభ్రమించాల్సిందే... ప్రేమపునాది మీదే, అది జరగాలి.
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి భావాలూ వారి స్వరూపాల్లాగే ఒక్కలా ఉండవు. మరి ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు మరొకరికి ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరిలో సుగుణాలు, దుర్గుణాలు ఉంటాయి. అన్నో, కొన్నో అవలక్షణాలున్న నీవు మరొకరిలో చెడును వేలెత్తి చూపగలవా? అందుకే మనం అందరినీ ప్రేమించే గుణం అలవరచుకోవాలి. 'వారేం చేస్తున్నారో వారికి తెలియదు... వారిని క్షమించు ప్రభూ' సిలువపై ఏసుక్రీస్తు అన్నమాటలు మనకు ఆదర్శం కావాలి. 'ఒక చెంపమీద కొడితే వేరొక చెంప చూపించా'లన్న గాంధీజీ సూక్తి ఆచరణీయంగా భావించాలి. దీనికి ఆలవాలం ప్రేమ. ఆ ప్రేమతత్వం అందరికీ అనుసరణీయం!
- కిల్లాన మోహన్‌బాబు