ᐅఅమరనాథ్ యాత్ర





అమరనాథ్ యాత్ర 



సకలసృష్టి శివాంశతో నిండి ఉందని; శివతత్వం మహాసాగరాన్ని మించినంతటి సువిశాలమైంది, హిమశిఖరానికన్నా సమున్నతమైందని చెబుతారు. అనంత కాలగమనంలో అంచనాలకు అందని అమేయ స్వరూపుడు ఆది దేవుడు. అమృతత్వ సిద్ధి, అమరత్వ లబ్ధి చేకూర్చే శివుడు ప్రళయకాల సందర్భంలో లింగస్వరూపునిగా అవతరించాడని పురాణాలు చాటుతున్నాయి. సకల సృష్టిలో అణువణువునా దాగి ఉన్న శివపరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేదే లింగాకృతి. ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగి, ప్రకృతే తానైన పరమేశ్వరుడు హిమాలయ సీమల్లో గుహాంతర్భాగంలో హిమలింగంగా అమరనాథుడి పేరిట వ్యక్తమయ్యే కాలమిది. మహిమాలయం హిమాలయ సుందర దివ్యధామంలో దివ్యలింగంగా ప్రస్ఫుటమయ్యే అమరనాథుణ్ని దర్శించుకోవడం ఓ కమనీయ అనుభూతి. అలా స్వచ్ఛ స్ఫటిక, సహజసిద్ధ హిమలింగంగా గోచరం కావడం కాలస్వరూపుడైన విశ్వేశ్వరుని విభూతి.
అమరనాథ్ యాత్ర ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడినది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో, పహల్‌గావ్‌నుంచి 48 కిలోమీటర్ల చేరువలో, సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో అమరనాథుడు కొలువుతీరిన గుహ విరాజిల్లుతోంది. ఈ యాత్రను చేయాలనుకునే భక్తులు ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వ పర్యాటక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. మంచుకొండల్లో ప్రయాణం కాబట్టి అందుకు తగిన శారీరక పరిస్థితులున్నట్లు వైద్యుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. చందన్‌వాడీనుంచి అమర్‌నాథ్‌కు సాగే ప్రయాణం కీలకమైంది. పిస్సూటాప్, జోజిబాల్, నాగకోటి, శేష్‌నాగ్ వంటి ప్రదేశాల మీదుగా పయనం సాగుతుంది. కేవలం మూడున్నర అడుగుల వెడల్పు మాత్రమే ఉండే కాలిబాటలో వడివడిగా ముందుకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రకృతి శోభను చూస్తే మనసు రసానందభరితమవుతుంది. ఇంతటి మహా సౌందర్యమైన సన్నిధి కాబట్టే నీలకంఠుడు తన నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడనిపిస్తుంది. చంద్రమౌళి చల్లని చూపులు ఎక్కడెక్కడ ప్రసరించాయో అక్కడ మంచుకొండలు ప్రభవించాయనే భావన కలుగుతుంది. ఓ గుహాలయంలో హిమలింగమూర్తిగా అమరనాథేశ్వరుడు భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. గుహలో అయిదు అడుగుల ఎత్త్తెన శంఖువు ఆకృతిలో స్వామి విలసిల్లుతాడని భక్తులు విశ్వసిస్తారు. చంద్రుని వృద్ధి క్షయాల్ని అనుసరిస్తూ ఈ మంచులింగం పెరుగుతూ తరుగుతూ ఉండటం విశేషం.

అమర్‌నాథ్ దివ్య క్షేత్రావిర్భానికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. సృష్టి రహస్యాన్ని వివరించమని పార్వతీదేవి మహేశ్వరుణ్ని కోరింది. ఆ అమర రహస్యాన్ని ఏ ప్రాణికీ వినిపించని ప్రదేశంలో రహస్యంగా చెబుతానన్నాడు శివుడు. గౌరీ శంకరులు జనసంచారం లేని హిమాలయాల్లో ఓ గుహ ప్రాంతానికి చేరుకున్నారు. సృష్టి మర్మాన్ని శివుడు చెబుతుండగా గుహపైన ఉన్న పావురాల జంట ఆ వివరాల్ని విన్నాయంటారు. దాంతో అవి మృత్యురాహిత్యాన్ని పొందాయి. ఆ కపోతాలు ఇప్పటికీ అమరనాథ్ గుహ ప్రాంతంలో సంచరిస్తాయంటారు. అమరనాథుడిపట్ల చెరగని భక్తి, ఆ భక్తి అందించే చెక్కు చెదరని ధైర్యాలతో భక్తులు ఈ యాత్ర చేపడతారు. ప్రకృతి సౌందర్యం, భక్తి పారవశ్యాల సమ్మేళనం... అమరనాథుడి దివ్య దర్శనం.


- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్