ᐅఏరువాక పున్నమి





ఏరువాక పున్నమి 

'ధారుణీపతి పాలన దండమెపుడు నీ హలంబుకన్నను ప్రార్థనీయమగునె' అంటారు దువ్వూరి రామిరెడ్డి కర్షకుని ప్రశంసిస్తూ. దేశసౌభాగ్యంలో కృషీవలుల పాత్ర విస్మరింపరానిది. కర్షకులు ఆహారాన్ని ఇచ్చే పంటపొలాల్లోను, తమతోపాటు క్షేత్రంలో శ్రమించే పశువుల్లోను, వ్యవసాయ ఉపకరణాల్లోను దైవాన్ని చూసుకుంటారు. సామాజిక స్వరూపాన్ని నిర్ణయించేది ఆ ప్రజలకు భగవంతునిపై ఉన్న దృక్పథం. ఆదిమానవుడికి దేవుడు ప్రాకృతిక శక్తి. వ్యవసాయ నాగరికతదాకా అదే సాగుతూ వచ్చింది. గణజీవితంలోని ప్రాకృతిక పూజలన్నీ ఆర్యుల చేతిలో సంస్కృతీకరణం చెందుతూ వచ్చాయి.
వర్షరుతువు ఆరంభంలో కృషీవలులు క్షేత్రపాలుని ఉద్దేశించి మంత్రాలు చదువుతూండేవారని రుగ్వేదం చెబుతూంది. వర్షరుతువు ఆరంభ సమయంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను కర్షకులు 'ఏరువాక పున్నమి'గా జరుపుకోవడంలో ఈ దృష్టి ఉంది. ఇది వైదికోత్సవం కాదు. కాని, పండితులు దీన్ని 'కృషి పౌర్ణమి'గా పేర్కొన్నారు. జైమిని న్యాయమాల ఉద-వృషభయజ్ఞంగా ప్రస్తావించింది. ఆంధ్రుల ఏరువాక పండుగలా, ఉత్తరభారతంలో ఈ యజ్ఞం చేసే సంప్రదాయం ఉండేది. ఆరోజు ఎడ్లను పూజించి పరుగెత్తించేవారట.

విష్ణుపురాణంలో 'సీతాయజ్ఞం' ప్రస్తావన ఉంది. 'సీత' అనే మాటకు 'నాగేటి' చాలు అని అర్థం. భాగవతంలో శ్రీకృష్ణుడు గోపవృద్ధునితో 'బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం. కర్షకులు సీతాయజ్ఞం చేస్తారు. గోపాలురు గిరియజ్ఞం చేయాలి' అంటాడు. గౌతమబుద్ధుని తండ్రి శుద్ధోధన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు ఆరంభంలో కర్షక ప్రముఖునికి లాంఛనంగా బంగారు నాగలిని అందజేసేవాడని 'లలితవిస్తరం' అనే బౌద్ధ గ్రంథం పేర్కొంది. శాతవాహనరాజు హాలుని 'గాథాసప్తశతి'లో 'ఏరువాక పున్నమి' ప్రస్తావన ఉంది. 'ఏరు' అంటే దున్నడానికి సిద్ధంచేసిన నాగలి అని, 'ఏరువాక' అంటే దున్నడానికి ఆరంభమని అర్థం. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఉదయమే ఎడ్లను కడిగి, కొమ్ములకు రంగులు పూసి, గజ్జెలు, గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టే కాడిని ధూపదీపనైవేద్యాలతో పూజించడం పరిపాటి. ఎడ్లకు పొంగలి పెడతారు. గ్రామంలో రైతులంతా సాయంత్రం మంగళవాయిద్యాలతో పొలాల్లోకి వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. యూరప్ దేశాల్లో 'మేపోవ్' ఇటువంటి పండుగే.


- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు