ᐅనేనేమిటి?
జీవితం ఓ పాఠ్యపుస్తకమంటారు.
పాఠ్యపుస్తకం పేజీలు తిరగేయడానికి ఆసక్తికరంగా ఉండాలి. పొందుపరచిన అంశాలు సమగ్రంగా ఉండి అన్ని కోణాల్లోనూ విజ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి.
విషయపరిజ్ఞానం, నైతికత, సంస్కృతీ సంప్రదాయాలు, ఆదర్శం లాంటి మేలిమి అంశాలు బుద్ధిని, మేధను వికసింపజేయాలి. తద్వారా సంక్రమించే జీవన నైపుణ్యాలు విశ్వశ్రేయానికి దోహదపడాలి.
గర్విస్తూ గుర్తుంచుకునే మైలురాళ్ళు ఏవి?
ఏం విజయాలు సాధించాను?
ఈ ప్రపంచం, సమాజం నాకెన్నో ఇచ్చాయి. బదులుగా నేనేమైనా ఇవ్వగలిగానా?
సాధుసంతులను, అతిథి అభ్యాగతులను ఆదరించానా? పూజించానా? సద్గ్రంథపఠనాలు చేశానా? సత్సంగాలు చేశానా? పుణ్యకార్యాలు చేశానా?
నలుగురి ఉన్నతికై పాటుపడ్డానా?
మహనీయుల ప్రబోధాలను ఒక్కటైనా ఆచరణలో పెట్టగలిగానా?
అన్నదానాలు, వస్త్రదానాలు... శక్తిమేరకైనా చేయగలిగానా?
రాజులు, చక్రవర్తులు నిర్మించుకున్న మహాసామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ నేటికీ స్మరించుకునేటట్లుగా చేసింది వారందించిన సేవలే కదా! నా వంతుగా అందించిన సేవలు ఏమైనా ఉన్నాయా కనీసం నెమరేసుకునేందుకు!
విభిన్న జాతులకు చెందిన పూలు, ఫలాలు ఉంటేనే.. ఉద్యానవనానికి అందం. జీవితమూ అలాగే పలు అనుభూతులకు నెలవై ఉండాలి!
ఇది ఏ ఒక్కరి చిత్తప్రవృత్తో కాదు. చాలామందివి ఇలానే ఉంటాయి.
'నేను- నావరకే' అంటూ జీవితం సాగితే ముదిమి పైబడ్డాక వెనుతిరిగి చూసుకుంటే శూన్యమే కనిపిస్తుంది.
'నేనేమిటి?' అంటూ అనుదినం ప్రశ్నించుకోవడం విజ్ఞతకు సూచిక. ఈ ప్రశ్నించుకునే విధానం మనోవిప్లవానికి దారితీస్తుంది. అది- జీవితంలో విభిన్న రుచులను, అనుభూతులను కలిగిస్తుంది. అటువంటప్పుడు, వెనుతిరిగి చూసుకుంటే శూన్యత ఉండదు.
అతడికి వేటాడటం వృత్తి. దారిదోపిడిలకు పాల్పడ్డాడు. మృగజీవనమే గడిపాడు. నీవు చేసే పాపాల్లో మేమెలా భాగస్వాములవుతామన్నారు కుటుంబసభ్యులు. అవాక్కయ్యాడు. మనోవల్మీకాన్ని శోధించాడు. నేనేమిటి? అంతరంగ విశ్లేషణతో వాల్మీకి మహర్షిగా మారాడు. యుగాలను తరింపజేసి, మార్గదర్శకంగా ఉండే శ్రీమద్రామాయణాన్ని లోకానికి అందించాడు.
అంతఃపుర సౌఖ్యాలు జీవితం కాదు. లోకవాసుల దుఃఖాలను పోగొట్టాలన్న సంకల్పంతో బుద్ధుడు లోకారాధ్యుడయ్యాడు.
భక్తి సామ్రాజ్యాన్ని సంగీత, సాహిత్యాల మేళవింపుతో జాతిజనులకు అందించారు వాగ్గేయకారులు.
రాజ్యపాలన చేస్తూనే అష్టాంగమార్గాన్ని వ్యాప్తిగావించి చరిత్రలో నిలిచిపోయాడు కళింగ చక్రవర్తి.
యోగులు, సిద్ధులు, మహాపురుషులు- ధ్యానంతో ఆత్మానందాన్ని పొందారు.
జాతిజనుల స్వేచ్ఛకు, శ్రేయానికి జీవితాలనే ధారపోశారు మహానేతలు.
వారి జీవితాల్లో నిరాశ లేదు. నైరాశ్యంలేదు. తృప్తి ఉంది. అనేకమైన చైతన్యపూరిత శక్తులకు నిలయం మానవహృదయం. నిద్రాణస్థితిలో ఉండే హృదయశక్తులను మేల్కొలిపితే జీవితం శోభాయమానమవుతుంది. అనుభవాల అనుభూతులు సదా వెన్నంటి ఉంటాయి. కర్మాచరణే ధ్యేయంగా ఉంటుంది. నైరాశ్యానికి తావుండదు!
- దానం శివప్రసాదరావు