ᐅసాధన
జీవితంలో పురోగతి సాధించాలంటే ప్రతి విషయంలోనూ అంకిత భావంతో కృషి చేయాలి. క్రమశిక్షణతో, కఠోర పరిశ్రమతో ముందుకు సాగాలి. ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే కష్టించి, అందులోని మెలకువలు తెలుసుకోవలసిందే! ఆ దిశగా సాధన కొనసాగించవలసిందే! అంతేకాదు, ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినది మొదలు, అది సఫలమయ్యే వరకు విశ్రమించరాదు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం.
సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత సులభంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. 'నా లక్ష్యం సాధించటానికి అవాంతరాలు ఎదురవుతాయేమో... నేను ముందుకు సాగగలనో లేనో!' అన్న మీమాంసలో ఉంటే- సత్ఫలితాలు సాధించటం చాలా కష్టం.
ఏటికి ఎదురీది లక్ష్యాన్ని చేరుకున్నవాళ్లు మనకు చరిత్రలో చాలామంది తారసపడతారు. ఏకలవ్యుడి చరితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఏకలవ్యుడికి విలువిద్య అంటే అమితమైన ఇష్టం. తానొక గొప్ప విలుకాడిగా పేరు తెచ్చుకోవాలని అస్త్రవిద్యలో గురువైన ద్రోణాచార్యుని వద్ద శిష్యునిగా చేరాలని భావించి, ఆయనను విలువిద్య నేర్పవలసిందిగా అర్థిస్తాడు. ఏకలవ్యుని అభ్యర్థనను తిరస్కరిస్తాడు ద్రోణాచార్యుడు. అంతమాత్రాన ఏకలవ్యుడు కుంగిపోలేదు. అమేయమైన సంకల్పబలం తనను వెన్నంటి ఉండగా ముందుకే సాగాలని నిర్ణయించుకున్నాడు. ద్రోణాచార్యుడి ప్రతిమను పక్కనే ఉంచుకొని, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిరంతర సాధనతో గొప్ప విలుకాడిగా పేరు తెచ్చుకున్నాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.
'అభ్యాసం కూసువిద్య' అన్న ఆర్యోక్తి మనమందరం విన్నదే. సాధన అనేది నిరంతరాయంగా జరుగుతూనే ఉండాలి. ఈ సాధన చేసేటప్పుడు ఆయా రంగాల్లో నిష్ణాతులైనవారి ఉత్తమ లక్షణాలను గ్రహించి, మనదైన సొంత శైలిలో ముందుకు సాగాలి. పూర్తిగా వారినే అనుసరిస్తే, అనుకరణే మిగులుతుంది. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న చక్కని మాట అందరికీ ఆచరణ యోగ్యమే!
భరతజాతి యువతకు మరొక స్ఫూర్తిదాయక ఉదాహరణ స్వామి వివేకానంద జీవితం! రామకృష్ణ పరమహంస శిష్యరికంలో- సాధారణ బాలుడిలా కనిపించే నరేంద్రుడు రాటుతేలాడు. భారతీయ సంస్కృతిమీద, సాంఘిక, ఆధ్యాత్మిక విలువల మీద సాధికారికంగా మాట్లాడగలిగే ఉన్నత స్థితికి ఎదిగాడు. విదేశాల్లో సైతం భారతదేశ 'వాణి'ని వినిపింపజేసి తన ప్రత్యేకత నిలుపుకొన్నాడు. వివేకానందుడి విజయం వెనక నిరంతర సాధన, పరిశ్రమ ఉన్నాయి. గురుదేవులైన రామకృష్ణులు విసుగు చెందినా, తనకు వచ్చే, ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకునేవారు వివేకానంద. తద్వారా అత్యంత ప్రాచీనమైన హైందవ సాంస్కృతిక విషయాలపట్ల, వైవిధ్యభరితమైన, ఆధ్యాత్మిక సంగతులపైనా ఆయనకు సమగ్ర అవగాహన ఏర్పడింది.
నిరంతర సాధనతో సాధ్యం కానిది ఈ విశ్వంలో లేదు. సంకల్పబలంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి విజయం చేజిక్కించుకున్న ఉదాహరణలెన్నో మనకు చరిత్రలో దర్శనమిస్తాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడమే మనం చేయవలసిన పని!
- వెంకట్ గరికపాటి