ᐅసర్వదేవ నమస్కారం





సర్వదేవ నమస్కారం... 

భగవంతుడంటే ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? సాకారుడా, నిరాకారుడా, అందరికీ అందుబాటులోనివాడేనా? నిరాకారుడే అయితే నిరాకారాన్ని ఆరాధించటం అంత సులువైన సంగతేనా? దేవుడంటేనే అర్థం కాని దశలో ఈ నిరాకారపు గందరగోళం భక్తుణ్ని బెంబేలెత్తిస్తుంది. సాకారుడే అయితే ఆయనను చర్మచక్షువుల ఎదుట సాకారం చేసుకోవటం సాధ్యమయ్యే పనేనా? ఈ మీమాంసతోనే సతమతమయ్యే ప్రారంభ భక్తుడు ఆయన ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఏం చూపెట్టినా విశ్వసించని, విశ్వసించాలో లేదో అర్థంకాని అయోమయంలో ఉంటాడు. నిజమే. పరబ్రహ్మ ఒక్కడే. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన అంశలుగా, ఆయన ప్రతినిధులుగా అనేకం మన కళ్లముందే ఉన్నాయి. ఉన్నారు. అత్యంత గహనమూ, గుహ్యమూ అయిన తన తత్వాన్ని తెలుసుకోవటమూ, సాకారంగా దర్శించటమూ అందరికీ సాధ్యంకాదు కాబట్టే- అపార కరుణతో ఆయన తన అంశలను మనకు అందుబాటులోకి తెచ్చాడు. భక్తులు ఏమాత్రం ప్రగతిలేని తమ భక్తిసాధనల పట్ల మరీ నిరాశ చెంది భగవత్తత్వంపట్ల పూర్తి విముఖం కాకుండా- తన విభూతులున్న అనేక వస్తు, జీవజాలాల్ని తన ప్రతినిధులుగా భగవంతుడు లోకానికి వరంగా అందజేశాడు.
భగవంతుడు భావనామాత్ర సంతుష్టుడు. భక్తుడికి ఒక ఆలంబననిచ్చి, అతనికి దానిమీద భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగితే- దాన్ని ఆధారం చేసుకుని సాధనలు చేస్తే, భగవంతుడిగా భావిస్తే... ఆ ప్రేమను, తపనను, ఆర్తిని 'తనకై' అన్నట్లుగానే స్వీకరిస్తాడు. ఆనందిస్తాడు. ఆశీర్వదిస్తాడు. మనం గుర్తించగలగాలిగానీ ఎల్లెడలా ఈశ్వరుని ఐశ్వర్యం, విభూతులు, ప్రతినిధులు మనను తరింపజేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఎందరో సుపుత్రులు తల్లిదండ్రుల్ని సేవించి తరించారు. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టిన ఫలం పొంది తమ్ముడి మీద గెలుపొందాడు. అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి సేవించిన శ్రవణకుమారుడి కథ అందరెరిగినదే. సాక్షాత్ శ్రీకృష్ణుడే బయటికి రమ్మని పిలిచినా తల్లిదండ్రుల సేవ ముగించాకే వస్తాననీ, అంతవరకు ఆగమనీ విశ్రమించేందుకు ఇటుకను చూపిన పాండురంగని కథా మనకు తెలియనిది కాదు. అలాగే తులసిని పూజించి పూజించి పునీతురాలైపోయిన రుక్మిణీదేవి ఆ తులసిదళంతోనే శ్రీకృష్ణుని తూచుకుని భక్తిస్వాధీనం చేసుకుంది. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. సూర్యనమస్కారాల ప్రాశస్త్యం తెలియని భారతీయుడుండడు. గతి తప్పని బాధ్యతా నిర్వహణనూ, అలుపెరుగని గమనసామర్థ్యానికీ సూర్యుడి తరవాతే ఎవరైనా. శ్రీరాముడంతటివానికే సూర్యస్తుతి 'ఆదిత్య హృదయ స్తోత్రం' విజయాన్ని సాధించిపెట్టిన ఘనత సాధించింది. జీవపోషకుడూ, కాలనిర్ణాయకుడూ భాస్కరుడు. ఆయన రానిరోజు ప్రపంచమే అంధకారబంధురమైపోతుంది. స్వయం ప్రకాశమానుడైన ఆదిత్యుడు మానవాళికి ప్రత్యక్ష దైవం. ఆరోగ్యప్రదాత. విజయకారకుడు. అలాగే గురువులు, జ్ఞానులు, నదులు, పర్వతాలు, వృక్షాలు, వల్మీకాలు, గోమాత... ఇవన్నీ, వీరందరూ దేవుని ప్రతిరూపాలు. దైవాంశలూ విభూతులూ ఐశ్వర్యాలు. ఈ దైవ విభూతుల్ని విశ్వసిద్దాం. పూజిద్దాం. తరిద్దాం. భగవంతుడు తన ప్రతిరూపాల ద్వారా, విభూతుల ద్వారా అందించిన ఈ ప్రత్యక్ష దైవాలను నిర్లక్ష్యం చేయవద్దు. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి.'


- చక్కిలం విజయలక్ష్మి