ᐅబతుకు తీపి
'బతికుంటే బలుసాకు తినవచ్చు' అని సామెత. ఈ సూక్తి మనిషికి బతుకంటే ఎంత తీపో తెలియజేస్తుంది. కేవలం మనిషికే కాదు, సమస్త ప్రాణికోటికీ బతకాలనే వాంఛ ప్రగాఢంగా ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానడనీ, ఈ జీవితం అశాశ్వతమనీ ఎన్ని వేదాంతాలు చెప్పినా, అది తనదాకా వచ్చినప్పుడు మాత్రం ప్రతి మనిషీ తాను ఇంకా జీవించాలనీ, తనను నమ్ముకొని బతికి ఉన్నవాళ్లకు ఇంకా ఏదో చేయాలనీ కోరుకుంటాడు. తాను అనుభవించవలసిన సుఖాలను ఇంకా పూర్తిగా అనుభవించలేకపోయానని తపిస్తుంటాడు. శరీరం శిథిలమై, రోగాల బారిన పడి, మృత్యుముఖంలో ఉన్నవాడైనా సరే, తాను బతికి బట్ట కడతాననే ఆశిస్తాడు. కానీ, జీవితాన్ని చాలించాలని అనుకోడు. అది మానవనైజం. కేవలం సామాన్య మానవులే కాదు, అవతార పురుషులైన మాన్యులూ జీవించడమే మేలని పలికిన సంఘటనలు ప్రాచీన కథల్లో కనబడతాయి.
వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు వెళ్లి, అక్కడ సీత కనపడక చింతిస్తాడు. 'సీతను చూడకుండానే నేను తిరిగి వెళ్లిపోతే హతాశుడై రాముడు మరణిస్తాడు... అతణ్ని అనుసరించి అతని సోదరులూ, వానరులూ, ఆత్మీయులూ అంతా ప్రాణత్యాగం చేస్తారు... అందువల్ల అంతమంది మరణానికి కారణభూతుణ్ని అయ్యేబదులు, నేనే జీవితాన్ని చాలిస్తే సరిపోతుంది' అని తలపోస్తాడు. అలా అనుకొని కూడా, ఆ ప్రయత్నాన్ని మానుకొని- మరణంవల్ల ఎన్నో దోషాలు ఏర్పడతాయి. జీవించి ఉంటే ఎన్నో శుభాల్ని చవిచూడవచ్చు అని సమాధానపడతాడు. ఈ హనుమంతుని మాటలవల్ల బతకడంవల్లనే ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుసుకోవచ్చు.
సకల ప్రాణులకూ బతుకుతీపి కంటె ఇష్టమైన పదార్థం మరొకటి లేదనీ, అష్టకష్టాలు పడుతున్నప్పటికీ ఏ మనిషికీ జీవితంపై విరక్తి కలగదనీ బాణమహాకవి అంటాడు. ఆయన రచించిన 'కాదంబరి'లోని ఒక ఘట్టం 'బతుకుతీపి'కి పరాకాష్ఠగా నిలుస్తుంది.
పూర్వం శూద్రకుడనే రాజుకు ఒక శబరుడు వింతైన చిలుకను బహుమానంగా ఇస్తాడు. సర్వశాస్త్రాలనూ తెలిసి, చక్కగా సంభాషించగల ఆ చిలుకను చూసిన రాజుకు ముచ్చటవేసి, నీ గతచరిత్ర ఏమిటని చిలుకను ప్రశ్నిస్తాడు. అప్పుడా చిలుక తన దీనగాథను వివరిస్తూ, తన బతుకుతీపి కథను ఇలా వివరిస్తుంది- 'రాజా! గతంలో నేను దండకారణ్యంలోని ఒక బూరుగు చెట్టుమీద నా ముసలితండ్రితో కలిసి జీవిస్తుండేదాన్ని. నా తల్లి నా చిన్ననాటనే చనిపోయింది. ముసలితనంతో ఎంతో కష్టంగా బతుకునీడుస్తూ కూడా నా తండ్రి నన్ను పోషించేవాడు. ఒకనాడు వేటగాళ్లగుంపు ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు తొర్రలో వణుకుతూ ఉన్న నా తండ్రి వాళ్లను చూసి భయపడి, పుత్రప్రేమతో నన్ను తన కాళ్లసందుల్లో ఇరికించుకొని, రెక్కలతో నన్ను కప్పి ఉంచి, కాపాడుతున్నాడు. ఇంతలో ఏది జరగకూడదో అదే జరిగింది. ఒక వేటగాడు చెట్టుపైకి ఎక్కి తొర్రలోకి చేయి దూర్చి నా తండ్రిని పట్టుకొని నేలపైకి విసిరికొట్టాడు. ఆ దెబ్బతో నా తండ్రి తలపగిలి చనిపోయాడు. నేను ఎండుటాకులపై పడిన కారణంగా బతికిపోయాను. కొంతసేపటికి తేరుకొన్న నేను వేటగాడు చెట్టుపైనుంచి కిందికి దిగివచ్చే లోగానే నా ప్రాణాలను కాపాడుకోవాలనుకొని బతుకు తీపితో- చచ్చిపడివున్న నా తండ్రిని కూడా చూడకుండా, ఎండుటాకుల చాటున మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేశాను... అలా బతికినందువల్లే మీ సన్నిధికి రాగలిగాను'- అందువల్ల బతుకుతీపి మానవులకే కాదు, పశుపక్ష్యాదులకూ సహజమే. ప్రాణాలను నిలుపుకోవడం కోసం ఏ ఉపాయాన్నైనా అనుసరించవచ్చుననీ, ఆ ఉపాయం శుభమా, అశుభమా అని సందేహించరాదనీ పంచతంత్రం చెబుతోంది.
మృత్యువు ఆసన్నమైనప్పుడు ప్రాణరక్షణకోసం పక్షులు సైతం తమ శక్తికి మించి, స్పందిస్తాయనడానికి పంచతంత్రంలోని చిత్రగ్రీవుడనే పావురాల రాజు కథే ఉదాహరణ. పూర్వం మహిళారోప్యం అనే ఒక నగరం ఉండేది. దానికి సమీపంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. దానిపై ఎన్నో జాతుల పక్షులు నివసిస్తున్నాయి. ఇది గమనించిన వేటగాడొకడు ఆ పక్షులను పట్టుకోవాలనే తపనతో వల తీసికొనివచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన 'లఘుపతనకం' అనే కాకి, వెంటనే చెట్టుమీద ఉన్న పక్షుల్ని జాగ్రత్తగా ఉండమనీ, వల ఉన్నచోట ధాన్యం గింజల్ని తినడానికి ప్రయత్నించవద్దనీ హెచ్చరించింది. పక్షులన్నీ దాని మాటను పాటించాయి. అనుకోకుండా ఆకాశంలో ఎగిరివస్తున్న చిత్రగ్రీవుడనే పావురాల రాజు తోటి పావురాలతో కలిసి వల దగ్గర ఉన్న ధాన్యం గింజలకోసం వాలి, ఆ వలలో చిక్కుకొన్నాడు. ఇంతలో వేటగాడు వల దగ్గరికి రాబోతుండగా ప్రాప్తకాలజ్ఞుడైన చిత్రగ్రీవుడు ఎలాగైనా బతికి బయటపడాలనే తపనతో ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరవలసిందిగా తన పరివారంలోని పావురాలను ఆదేశిస్తాడు. తమ నాయకుని మాటల్ని అనుసరించిన ఆ పావురాలు 'బతుకు జీవుడా!' అంటూ గాలిలోకి ఎగసిపోయి, ప్రాణాల్ని రక్షించుకుంటాయి. అందువల్ల బతుకుతీపి ఎంతటి సాహసాన్నైనా చేయిస్తుంది.
బతుకు తీపి వల్లనే మనిషి ధర్మాన్ని ఆచరిస్తాడు. కృషి చేస్తాడు. స్నేహ సంబంధాలనూ, బంధుత్వాలనూ పెంచుకుంటాడు. ఎన్నో ఉద్యమాలు చేస్తాడు. బతుకుతీపి అనేది లేకుంటే ఏ ప్రాణికీ ఏదీ చేయవలసిన అవసరమే ఉండదు. కనుక, 'లోకయాత్ర' నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటే బతుకుతీపి అందరికీ అవసరమే!
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ