ᐅఆశ - నిరాశ
ఎక్కువగా ఆశపడటం దుఃఖానికి మూలమనీ, నిరాశ మాత్రమే పరమ సుఖానికి ఆలవాలమనీ వేదాంతులు అంటారు. వైరాగ్యాన్ని ఒంటబట్టించుకున్న విరాగుల మాటలు పక్కనపెడితే, లౌకికుల విషయంలో మాత్రం- ఆశ ఒక్కటే జీవితానికి ఆలంబం. నిరాశ ఎన్నో చింతలకు మూలం. ఈ రెండు కోణాల్లో ఏది సమంజసమైంది? ఆయా సందర్భాలనుబట్టి రెండూ సరైనవే అనిపిస్తుంది.
లోకంలో సంసారికీ, సన్యాసికీ ఎంతో తేడా ఉంది. ఇష్టమైనా, కాకున్నా భోగాలకు సంబంధించిన లంపటాలమధ్య జీవించవలసిన అగత్యం సంసారిది. ఎట్టి పరిస్థితుల్లోనూ భోగాలకు అంటకుండా ఉండాలనేది సన్యాసి నైజం. ఈ రెండు ప్రవృత్తులకు మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత దూరం ఉంది. నిజంగా చెప్పాలంటే- మనిషి తన జీవితంలో అనుక్షణమూ ఆశానిరాశల నడుమ కొట్టుమిట్టాడుతుంటాడు. సంసారిగా ఉంటూ సన్యాసివలె వైరాగ్యాన్ని కలిగి ఉన్నవాళ్లూ, సన్యాసిగా ఉంటూ అనుక్షణం ఆశపడే సంసారిలా ఉన్నవాళ్లూ లోకంలో కోకొల్లలు. కనుక ఆశానిరాశలు మనిషికి మనోధర్మాలేకానీ మరొకటికావనీ, ఈ రెండూ అతని స్వాధీనంలో ఉండవనీ స్పష్టమవుతుంది.
ఆశానిరాశల మధ్య వ్యవధి కనురెప్ప వాల్చినంత కాలమే ఉంటుందని పెద్దలమాట. సంకల్పించడం ఆశ అయితే, వికల్పించడం నిరాశ. ఈ రెండూ మనిషి మనసులో ఒక్క త్రుటికాలంలో జరిగేవే. అందుకే మనసు సంకల్పవికల్పాత్మకం. అంటే, పాదరసంతో సమానం. ఎటు జారిపోతుందో తెలియదు. ఈ మనసుతో అనుక్షణం అనుసంధానమై ఉండేవే ఆశానిరాశలు. అందుకే పెద్దలు మనసును నిర్మలంగా ఉంచుకోవాలంటారు. మనసు ఎంత చెడ్డదంటే- దానిలోకి ప్రవేశించిన చిన్న ధూళికణమైనా బ్రహ్మాండమంత పెద్దగా మారిపోతుంది. పరీక్షాసమయంలో అర్థంకాని ఒక చిన్న ప్రశ్న, మనసును తొలిచేస్తూ అశాంతికి దారితీసి, అర్థమైన ఇతర ప్రశ్నలను కూడా మరిచిపోయేట్లు చేసేవిధంగా నిరాశకు గురిచేస్తుంది. కాలాన్ని హరించివేస్తుంది. గుర్తుకు వచ్చిన వెంటనే అన్నీ బాగా తెలుస్తాయి. అందుకే ఆశానిరాశలు వెలుగునీడలవంటివి. వెలుగు ఉంటే నీడ ఉండదు. నీడ ఉంటే వెలుగు కనబడదు. అవి రెండూ మనిషిని వెంటాడుతూనే ఉంటాయి.
ఆశతో ఉన్నప్పుడు ప్రాణాలు అహమహమికతో ఎదురుచూస్తుంటాయి కనుక గుండె వేగంగా పనిచేస్తుంటుంది. నిరాశలో ఆసక్తి ఉండదు కనుక, ప్రాణాలు ఉసూరుమన్నట్లు ఉండడంతో గుండె వేగం తగ్గుతుంది. గుండె బాగా కొట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కనుక మనిషి ఎప్పుడూ ఆశతో ఉండాలనేది హితసూక్తి.
ఆశానిరాశలు సమపాళ్లలో ఉన్నప్పుడు శరీరం కూడా సమానంగా సహకరిస్తుంది. ఆశించడం మంచిదేకానీ, దురాశ పనికిరాదన్నది సత్యం. నిరాశ కూడా మంచిదే. కానీ, అది కూడా అవధిని దాటకూడదు.
న్యాయంగా లభించవలసింది నాకు లభించాలి అని కోరుకోవడం ఆశ. ఇది సరైనదే. అన్యాయంగానైనా నాకు అధికంగా రావాలనుకోవడం దురాశ. ఇది సరైనది కాదు. అలాగే- వస్తేరానీ, పోతేపోనీ అనుకోవడం నిరాశ. దీనివల్ల ఫలితం లభించనప్పుడు అశాంతి ఉండదు. కనుక నిరాశ మంచిదే.
మనసు ఉన్నంతకాలం మనిషికి ఆశానిరాశలు అనివార్యాలే. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే విజ్ఞత ఉంది.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ