ᐅచేతన శక్తి ఆత్మ
వేదాంత పరిభాషలో ఆత్మ మనిషిలోని చేతనశక్తే. బ్రహ్మమంటే సర్వశక్తి సంపన్నమైన పరమాత్మ. సమస్త జీవరాశిలోనూ వ్యక్తమయ్యే చైతన్యాన్ని వేదాంతులు 'బ్రహ్మ' మంటారు. ఆత్మచేతన బ్రహ్మచేతనతో ఐక్యత అనుభవించడమే అమరత్వం పొందడం. దేహ సంబంధమైన అహంకారం ఆత్మను పరమాత్మనుంచి వేరుచేసి దేహం తాననే భావన కలిగిస్తుంది. ఈ అహంకారం విడిచిపెట్టగలిగినప్పుడే పరబ్రహ్మంతో ఐక్యతను అనుభవించగలరు.
ఆత్మాన్వేషణకు, అమరత్వ సాధనకు అవలంబించవలసిన మార్గాన్ని కేశోపనిషత్తు వివరించింది. చెవులు వినగలగడం, మనసు గ్రహించగలగడం, కన్నులు చూడగలగడం, ప్రాణశక్తి పనిచేయగలగడం- ఇవన్నీ వాటి వెనక ఉన్న ఆత్మశక్తి వల్లనే. ఆత్మశక్తే అన్ని ఇంద్రియాలకు శక్తిని ఇచ్చి పని చేయిస్తోంది. దేన్ని ఇంద్రియాలు, మనసు గ్రహించలేవో, దేని శక్తివల్ల ఇంద్రియాలు, మనసు పని చేయగలుగుతున్నాయో- అదే ఆత్మ. ఆత్మ మనకు తెలిసినవాటికన్నా, తెలియదు అనుకునేవాటికన్నా భిన్నమైనది. అదే తన నిజతత్వం అని గ్రహించిన మానవుడు అమృతత్వం పొందగలడు.
ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవడాన్ని జీవశక్తి అంటారు. యోగులు ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ ఆత్మతత్వాన్ని దర్శిస్తూ... తన దేహాభిమానాన్ని, ఇంద్రియ ప్రవృత్తిని అతిక్రమించిన బుద్ధిశాలి- ఈ జీవితంలోనే పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటూ అమృతత్వం పొందగలుగుతాడని చెబుతారు.
దేవదానవ యుద్ధంలో పరబ్రహ్మ కృపవల్ల దేవతలు విజయం పొందారు. అహంకార, అజ్ఞానాలవల్ల దేవతలు ఈ విజయం తమ స్వయంశక్తితో సాధించిందని గర్వించారు. దేవతలకు గుణపాఠం చెప్పడానికి యక్షుని రూపంలో పరబ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని తెలుసుకోవడానికి దేవతలంతా యత్నించారు. మొదట అగ్ని వెళ్లి తెలుసుకోలేక వెనుదిరిగాడు. తరవాత వాయుదేవుడు కూడా విఫలుడవుతాడు. ఇంద్రుడు యక్షుని నిజస్వరూపం తెలుసుకోవడానికి స్వయంగా వెళ్లగా- యక్షుడు అదృశ్యమవుతాడు. ఇంద్రుడు నిరాశతో వెనుదిరగబోగా, అక్కడ ఉమాదేవి ప్రత్యక్షమై- యక్షుడే పరబ్రహ్మమని, మీ యుద్ధ విజయం అతడి సంకల్పమని చెబుతుంది.
ఈ గాథలోని విషయాలను ఆధ్యాత్మికంగా సమన్వయించుకోవాలి. మన ఇంద్రియ విజయాలకు భగవత్ కృపే కారణం. కానీ, ఇంద్రియాలు భగవంతుని దర్శించలేవు. పరిశుద్ధమైన మనసుకే బ్రహ్మ సాక్షాత్కారం కాగలదు. మనిషిలో ప్రేమ, క్షమ, దాతృత్వం, ధైర్యం వంటి దైవీగుణాలు, కామం, క్రోధం, అహం, మాత్సర్యం వంటి రాక్షస గుణాలు మిశ్రితమై ఉంటాయి. వీటి ఘర్షణే యుద్ధం.
ఈ ఘర్షణలో దైవగుణాలు విజయం పొంది అసుర గుణాలు నశించాలంటే- పరమాత్మ తోడ్పాటు కావాలి. అహం వదిలితేగాని అది జరగదు. పైన చెప్పిన గాథలో అగ్ని, వాయువులు పరబ్రహ్మను గుర్తించలేకపోయారు. ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు- అంటే మనసు మొదట విఫలమై తరవాత దీక్షతో నిజం తెలుసుకున్నాడు.
ఇంద్రియ నిగ్రహం పొందిన మనసు కూడా పరమాత్మను సులభంగా దర్శించలేదు. మానసిక ప్రవృత్తులన్నీ పరబ్రహ్మ ప్రబోధమే. బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికి నైతిక జీవనం, ధర్మనిష్ఠ, ఇంద్రియ నిగ్రహం అవసరం. ఎవరు పరమాత్మతో తాదాత్మ్యం అనుభవించగలుగుతారో- వారే శాశ్వతానందాన్ని సాధించి అమరత్వం పొందగలరన్నది ఆధ్యాత్మిక సత్యం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు