ᐅబాధే సౌఖ్యం...
మనిషి సుఖలాలసుడు.
కొంతమంది ఏ చిన్న బాధనూ తట్టుకోలేరు. చివరకు కాల్లో ముల్లు గుచ్చుకున్నా భరించలేరు. అతి సుకుమారత్వానికి, ఆధ్యాత్మికతకు బద్ధవిరోధం. రెండూ సహజీవనం సాగించలేవు.
బాధానుభూతి తెలియని జీవితం జీవితమే కాదు.
ఎందుకంటే- సుఖం విలువ తెలియాలంటే, దాన్ని పొందడానికి ఎంత కష్టపడాలో తెలియాలి. కష్టంలోనే బాధ దాగి ఉంది. ఎలాంటి కష్టమూ లేకుండా కోట్లు గడించటం సులభం కాదు. కోట్లు గడించినవాళ్లంతా సుఖసంతోషాలతో ఉన్నారనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. ప్రపంచ ప్రవేశం చేశాక కష్టాలూ, బాధలూ అనుభవించక తప్పదు. సామాన్యులకైనా, అసామాన్యులకైనా, అవతార పురుషులకైనా, మహాత్ములకైనా ఈ సూత్రం వర్తిస్తుంది.
శ్రీరాముడు భార్యావియోగంతో పడరాని పాట్లు పడ్డాడు. చక్రవర్తి అయినా దుర్గమారణ్యాల్లో రాక్షసుల పీడల మధ్య జీవించాల్సి వచ్చింది. రాజ్యాధికారం చేపట్టినా నింద భరించలేక భార్యను అడవులపాలు చేయాల్సి వచ్చింది. ఇన్నీ చేసినా, అవి తన వంశమర్యాదకోసం చేశాననే తృప్తి రాముడిది. శ్రీకృష్ణుడు శ్యమంతకమణి రూపంలో నిందలు మోయాల్సి వచ్చింది. ధర్మయుద్ధంలో కౌరవుల్ని నాశనం చేశాక, గాంధారి శాపానికి దేవకీనందనుడు గురికావాల్సి వచ్చింది. అంతటి మహాత్ముడు బోయవాడి బాణానికి ప్రాణాలు వదలాల్సి వచ్చింది! భక్తుల కష్టాలు భగవంతుడు తనవిగానే భావిస్తాడని ప్రతీతి. అర్జునుడి మర్యాద కాపాడటం కోసం తాబేలు రూపంలో శరవారధిని వీపున మోయాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి. భక్తుడిని ఆదుకున్నాననే తృప్తి ఆయనది. ఆధ్యాత్మికతకు మూలకాండం అచంచల విశ్వాసం. దానికి ఆలంబనం అంతులేని సహనం. ఇవి రెండూ ఉన్నవారికి కైవల్యం తప్పక సిద్ధిస్తుందన్నది పెద్దల మాట.
ఆనందంగా ఉన్నవారిలో ఉద్వేగం ఉంటుంది. ఆ స్థితిలో ఒక ఆధిక్యతా భావన ఆవహించి ఉంటుంది. తమదే అదృష్టం, తామే ఘనులమనుకుంటారు. ఆనందం ఒక కెరటంలాంటిది. అలా వచ్చి ఇలా మాయమైపోతుంది. అటు తరవాత ఎంతోకొంత బాధ తప్పదు. నిజానికది భావనాత్మకం. బాధ అయినా ఆనందమైనా మనం అనుకోవటంలోనే ఉంటుంది. సుఖాల్లో పొంగక, కష్టాల్లో కుంగక సంయమనం పాటించాలన్నది ఆధ్యాత్మిక శిక్షణలోని ప్రథమ పాఠం. కష్టాల్లో కుంగనివాడే సుఖాల్లో పొంగడు. కాబట్టి మన కథ కష్టాల దగ్గరే ప్రారంభం కావాలి. 'సుఖాలు వస్తూపోతూ ఉంటాయి. కష్టాలు విడవకుండా ఉంటాయి' అంటారు వేదాంతులు. కష్టాలకు భయపడకపోవడంలోనే సుఖం!
అసలు దేన్నీ బాధగా అనుకోకుండా ఉండటానికి మన మనసును సిద్ధం చేసుకోవాలి. భగత్‌సింగ్ ఉరిశిక్షను ఆనందంగా ఆహ్వానించగలిగాడంటే ఎంత మానసిక పరిపక్వత పొందాడో మనం ఊహించుకోవాలి. ఆయనకు ప్రాణంకన్నా దేశ స్వాతంత్య్రం అధికమనిపించింది. విత్తనాలు మొలకెత్తి, మొక్కలై, పళ్లు ప్రపంచానికి అందించినప్పుడే వాటికి సార్థకత. పుచ్చిపోయిన విత్తనాలు పురిట్లోనే మరణించిన శిశువుల్లాంటివి. ప్రయోజన శూన్యమైనవి. బాధ అనివార్యమైనప్పుడు దాన్ని సంతోషంగా అనుభవించడమే ఉత్తమం. బాధను సౌఖ్యంగా భావించాక ఇక మనల్ని ఏదీ బాధించదు. బాధలేని జీవితం అనుభవానికి వస్తుంది. ఆధ్యాత్మికతకు అసలు ప్రయోజనం అదే!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్