ᐅసంగీతం- మోక్షసాధనం





సంగీతం- మోక్షసాధనం 

శిశువులు, పశువులు, సర్పాలు- సంగీతానికి పులకించని జీవి లేవు. సంగీతం మానవులకు మోక్షసాధనం కూడా! మోక్ష పథగామికి నాదోపాసన సులభతర పథమని వేద, శాస్త్రపురాణాలు చెబుతున్నాయి. సుప్రసిద్ధ పాశ్చాత్య విద్వాంసుడు 'మెమాహిన్' భారతీయ సంగీతాన్ని అధ్యయనం చేసి 'భారతీయ సంగీత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందడమే' అంటూ శ్లాఘించాడు. సామవేదానికి అనుబంధమైన గాంధర్వవేదం అనే ఉపవేదంనుంచి సంగీతకళ ఆవిర్భవించింది. గంధర్వులు దీన్ని మొదట అభ్యసించడంవల్ల దీనికి గంధర్వగానమని పేరు వచ్చిందంటారు. బ్రహ్మ మానసపుత్రుడు నారదమహర్షి. అష్టాక్షరి మంత్రజపియై నిరంతర భగవన్నామ గానం చేస్తూ ముక్కోటి దేవతలకు వందనీయుడయ్యాడు. ప్రపంచంలో సనాతనమూ, శాశ్వతమూ, సత్యమూ అయిన ప్రణవం సంగీతానికి ప్రతీక. అటువంటి సంగీత మాధుర్యాన్ని తన చేతిలోని 'మహతి' అనే వీణను మీటుతూ లోకాలను పరవశింపజేశాడు. అద్వైత సిద్ధికి, అమరత్వలబ్ధికి సోపానమైన గాన శాస్త్రాన్ని ఔపాసన పట్టినాడు ఆంజనేయుడు. నాదంనుంచే నవరసాలూ ఉద్భవించాయి. నాదాన్ని బ్రహ్మ- విష్ణు- శివాత్మకంగా సారంగదేవులు 'రత్నాకరం'లో పేర్కొన్నారు. ఇక మురళీ గానలోలుడు శ్రీకృష్ణుడు తన మధుర మురళీగానంతో అందరినీ రసాప్లావితం కావించడమేకాక మోక్షపథ ప్రదర్శనం చేశాడు. సంగీతత్రయంలో మొదటివాడైన ముత్తుస్వామి దీక్షితులవారు మధుర మీనాక్షి సన్నిధానంలో 'శ్రీ మీనాక్షీ మే ముదందేహి పాశమోచని' అని గాన రసాంబుధిలో తన్మయుడై ఆ జగజ్జననిలో ఐక్యం చెందినట్లు చెబుతారు. 'శంకరీ! శంకరు చంద్రముఖీ, అఖిలాండేశ్వరి శాంభవి' అని అమ్మవారిని కీర్తిస్తూ శ్యామశాస్త్రి ముక్తిఫలం అందుకున్నట్లు చదువుకున్నాం. త్యాగరాజస్వామి తొంబై ఆరుకోట్ల శ్రీరామతారక మంత్రజపం చేసి, ఇరవైనాలుగువేల కీర్తనలను రచించి, విభిన్న రాగాల్లో స్వరకల్పన చేసి, గానంచేసి చరితార్థుడయ్యాడు. 'ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు' అని తన వినయ విధేయతలను అభివ్యక్తం చేశాడు. 'సంగీత జ్ఞానము భక్తివినా' అంటూ ఆ రెంటికీగల అన్యోన్యాశ్రిత సంబంధాన్ని చక్కగా అభివర్ణించాడు. త్యాగయ్యవంటి వాగ్గేయకారుడు 'నభూతో నభవిష్యతి' అంటూ వాగ్గేయకారులే కొనియాడారు.
చతుర్విధ పురుషార్థ సాధనలో ధర్మమోక్ష సాధనలు రెంటినీ ప్రతిపాదించిన మాధ్యమం సంగీతమే. ఆళ్వారులెందరో జానపద గీతశైలిలో మధురగాన సుధను వసుధపైన ప్రవహింపజేశారు. భక్తతుకారాం, కబీర్‌దాసు భక్తిగానం చేసి తరించారు. రామదాసు పద్యగేయ రచన చేసి రాముని కైంకర్యంచేసి హృదయంగమంగా గానం చేసి చరితార్థుడైనాడు. విరహభక్త కవయిత్రి గోదాదేవి రచించిన తిరుప్పావై చిరస్మరణీయం. భక్తజయదేవుని అష్టపదులు శ్రీకృష్ణ తత్వాన్ని సాక్షాత్కరింపజేసిన అమృతరసగుళికలు. శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ప్రస్తుతిస్తూ 32వేల కీర్తనలు రాసి గానంచేసి అచ్చమైన తెలుగుభాషను ఆంధ్రులకు ప్రసాదించిన అమృతమూర్తి పదకవితాపితామహుడు అన్నమాచార్యుడు. అశ్వమేధ క్రతువులు నిర్వహించిన సందర్భాల్లో దేవతలను సంతృప్తిపరచేందుకు వీణావాదనం చేసినట్లు కాత్యాయన శ్రీతసూత్రం, శతపథ బ్రాహ్మణం పేర్కొన్నాయి. అపరాంతక, ఉల్లోప్య, మకరి ముద్రక మొదలైన పురాతన గీతమాలికలు మోక్షసాధనకు తగిన మూలికలుగా యాజ్ఞవల్క్య మహర్షి అభివర్ణించాడు. సదాశివ బ్రహ్మేంద్రస్వామి 'పిబరే రామరసం' అంటూ భక్తిరసగాన మహిమను వివరించాడు.

విభిన్నరాగాలుగా విభజితమైన భారతీయ సంగీతంలో ఎన్నో ఓషధీగుణాలున్నాయి. ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క సమయంలో ఆలాపించడంవల్ల వ్యాధుల నివారణ సుసాధ్యమని సంగీత విద్వన్మణులు తీవ్ర పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఈ కోణంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. శ్రుతిపక్వమైన సంగీతం వింటే శారీరక, మానసిక ఆరోగ్యం ఆనందం చేకూరి ఆయువు పెరుగుతుందని సంగీత శాస్త్రకోవిధులు నిరూపించారు. చక్కని సంగీతం వింటూంటే శ్రమ అలసట తొలగిపోయి ఆయుర్ వృద్ధి జరుగుతుందంటారు. రక్తపోటు తగ్గుతుందంటారు. మనసులో సంయమనాన్ని నింపి, అవికార స్థితిని కల్పించి పారలౌకిక దిశానిర్దేశం చెయ్యడమే భారతీయ సంగీత ప్రధానలక్ష్యం. రాగద్వేషాలను హరించి ఆనందదాయకమైన ఆధ్యాత్మిక వేదికపైన హృదయాలను సుప్రతిష్ఠితం చేయడమే సంగీతాశయం. ప్రపంచంలోని సంగీతాలన్నింటిలోనూ ఒక్క భారతీయ సంగీతమే మోక్షసాధనకు సంపూర్ణంగా సహకరించేదంటారు. భగవిజ్జిజ్ఞాసువులకు, ముముక్షువులకు సప్తస్వర కలశం ప్రధానమైన మాధ్యమం. సంగీతసుధ లలిత సంగీతం, సంకీర్తనం, భజన, హరికథ బుర్రకథ, యక్షగానం మొదలైన పాయలు పాయలుగా ప్రవహించి రసజ్ఞులను పునీతం చేస్తున్నది.


- చిమ్మపూడి శ్రీరామమూర్తి