ᐅమణిమంజూష





మణిమంజూష 

లోకంలో ప్రతి మనిషికీ, ప్రతి పనికీ ఒక మార్గనిర్దేశక సూత్రం ఉండాలి. గుహ్యమైన ఆత్మజ్ఞానంనుంచి గగనవిహారం వరకు, గహనమైన యుద్ధతంత్రం నుంచి గచ్చకాయలాటవరకూ! ఆ సూత్రావళినే 'శాస్త్రం' అన్నారు. వినడానికి ప్రాచీనపదంలా ఉన్నా, అది నిత్యనూతనం. సదా అనుసరణీయం.
ఏ పని చేయాలన్నా ఒక ఆచరణాత్మక విధానం ఉండాలి. పూర్వాపరాలు, మెలకువలు తెలిసి ఉండాలి. అనుభవజ్ఞుల సూచనలు, వారు పొందిన లాభనష్టాలు, పరిణామాల సమాచారం మనకందాలి. అప్పుడే ఆ కార్యం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందాన సులభంగా, త్వరితగతిన పూర్తవుతుంది. శాస్త్ర సహాయం లేని కార్యాచరణ... తెలియని కొత్తప్రదేశంలో, ముళ్లదారిలో వెళ్లటంలా ఉంటుంది. గమ్యం తెలిసినంత మాత్రాన సరిపోదు. సురక్షితమైన, దగ్గరదారి తెలిసి ఉండాలి. వెళ్లినంతమాత్రాన సరిపోదు. కార్యం సానుకూలపడుతుందా లేదా అన్న నిశ్చయం ఉండాలి. దొంగలు, క్రూరమృగాల భయం ఉందా? ఎవరితో వెళ్లవచ్చు? ఎంతమందితో వెళ్లవలసి ఉంది? లాంటి భద్రతా విషయాల అవగాహన ఉండాలి. ఆ మార్గాన ఇదివరకు వెళ్లివచ్చిన అనుభవజ్ఞులెవరు? వాళ్లు మనకెంతవరకు విషయసూచనలివ్వగలరు? తీసుకువెళ్లవలసిన సరంజామా...! ఈ పద్ధతే ప్రతి కార్యంలోనూ మనకు అవసరమవుతుంది. శాస్త్రం మనకు ఈ శిక్షణ, రక్షణ ఇస్తుంది. వివరణ, సవరణ చూస్తుంది.

మానవ జీవితం అల్పమైనది. ప్రతి విషయజ్ఞానాన్నీ స్వానుభవంతో పొందాలంటే అసాధ్యం, అసంభవం కూడా. మనకీ పని శాస్త్రం చేసిపెడుతుంది. రుషులు, శేముషీ దురంధరుల అనుభవసారమే శాస్త్రం. కార్యం తాలూకు పూర్వాపరాలు, పరిణామాల సమాచారమే శాస్త్రం. అమ్మలా ప్రేమగా, అయ్యలా బాధ్యతగా చేయిపట్టి నడిపిస్తుంది. వడ్డించిన మృష్టాన్న భోజనంలా శాస్త్రం మనకు అందుబాటులో ఉన్నప్పుడు అందుకునే ఓపికా మనకు లేకపోవటం శోచనీయం. నిజానికి చాలామందికి ఏ విషయానికైనా శాస్త్రం అనేదొకటుందనే విషయమూ తెలీదు. ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి లేదు. శాస్త్రాలు, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, రామాయణ మహాభారతాలు, భాగవతం, ప్రస్థానత్రయం (భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు)... జ్ఞానభండారం భారతీయ వాఞ్మయం. భారతీయ రుషులు, విజ్ఞులు, అనుభవజ్ఞులు భవిష్య భారతానికై తమ మేధస్సును, తపస్సును రంగరించి, మధించి, వచ్చిన జ్ఞాన నవనీతాన్ని మణిమంజూషలో భద్రపరచి, వ్యాసపీఠం మీద ఉంచి మరీ మనకందించారు. ఇంత అవకాశం, ఇంత అదృష్టం మరే దేశవాసులకూ లేదు. నిజానికి వారు పెట్టిన ఈ జ్ఞానప్రసాదాన్ని ఏ దేశవాసులైనా 'జ్ఞాన జిజ్ఞాస' అనే భిక్షాపాత్రను చేతబూని కావలసినంత భిక్షను స్వీకరించవచ్చు. జ్ఞానప్రసాదానికి, జ్ఞానప్రసారానికి మన భారతీయ విశ్వమానవ ప్రేమ, సర్వమానవ సౌభ్రాతృత్వం పరిధులు, పరిమితులు విధించుకోలేదు.

ఆరోగ్య, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, రాజకీయ, న్యాయ రంగాల్లో... అది ఇదీ అని లేకుండా మానవ జీవితంలోని అన్ని దశల్లో, అన్ని స్థితుల్లో, అన్ని కోణాల్లో మనకు మార్గదర్శకత్వం వహించడానికి కాగడా పట్టుకుని ముందు నిలిచి ఉన్న మన సనాతన, జ్ఞానపూర్ణ, వాఞ్మయరూప జ్ఞానాన్ని గర్వంగా, అపురూపంగా అందిపుచ్చుకొని జీవితాలను ప్రకాశవంతం చేసుకుందాం!


- చక్కిలం విజయలక్ష్మి