ᐅఇవ్వడంలోనే ఆత్మానందం
అతి సామాన్యుడు మొదలుకొని సామ్రాజ్యాధీశుడి వరకు ఎందరిలోనో సహజంగా ఉండే మహాజాడ్యం- పొందడంలోనే తృప్తి ఉందన్న భావన. కోర్కెలు తీరుతూ ఉంటే కొండంతగా సంబరపడిపోవడం కద్దు. మరి ఆ సంబరం, సంతోషం శాశ్వతంగా ఉండిపోవే. అనంతంగా సాగిపోయే కోర్కెల కోరల్లో అలా కనిపించి ఇలా మాయమైపోతాయి- తృప్తి, సంతోషం.
'పొందడం, అనుభవించడం' ఈ రెండే జీవిత పరమార్థమనుకుంటే, కాలగమనంలో అసంతృప్తికి సోపానాలు నిర్మించుకున్నట్లే. దేనికైనా ఇరు పార్శ్వాలుంటాయి.
మనం గౌరవం పొందాలనుకున్నప్పుడు ఎదుటివారిని గౌరవించాలి. ముందుగా ఇవ్వడం ప్రారంభమైతేనే పొందడం సాధ్యపడుతుంది. అప్పుడే తృప్తి అన్నది నిలకడగా మనోమందిరంలో ఉంటుంది. అలా కాకుండా పొందడమే నా ధ్యేయం అంటూ సాగితే- కొంతకాలానికి ఆ పొందినవీ వెగటుగా తోస్తాయి. ఇదేనా జీవితం, ఇందుకేనా జీవనం- అన్న ఆలోచన రాకమానదు ఎవ్వరికైనా.
తల్లిది దైవానికన్నా ప్రథమస్థానం. బిడ్డలకు ఇవ్వడమే తెలుసు తల్లికి. ప్రేమానురాగాలే కాదు, ప్రాణం ధారపోయటానికీ ఆమె వెనకాడదు.
ఎదిగిన బిడ్డ తనను పట్టించుకోకున్నా 'అయ్యో! బిడ్డకు ఏం కష్టమొచ్చిందో, నేనేం చెయ్యలేకపోతున్నానే, ఇవ్వలేకపోతున్నానే!' అంటూ మథనపడిపోతుంది. బిడ్డనుంచి ఏమీ ఆశించదు.
ఈ ఉన్నతమైన భావనే తల్లిని అత్యున్నత స్థానంలో నిలిపింది. 'ఇవ్వడం' అనే భావన ఉన్నతమైంది.
'అతనో యాచకుడు. రహదారుల వెంట తిరుగుతూ కనపడినవారినల్లా యాచిస్తుంటాడు. కొన్ని నాణేలు లభించాయి. స్థావరానికి తిరిగి వెళ్తుండగా... రహదారి పక్కన చెత్తకుండీ వద్ద మసిబారిన దేహంతో- తనకన్నా దుర్భర స్థితిలో ఉన్న మరో యాచకుణ్ని చూశాడు. యాచన చేయడమూ తెలీదల్లే ఉంది. తలొంచుకుని చెల్లాచెదురుగా పడిఉన్న దుర్గంధభూయిష్ఠమైన వ్యర్థ పదార్థాల మధ్య తనదైన ప్రపంచంలో ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి 'ఏమైనా తిన్నావా?' అన్నాడు.
బదులు చెప్ప కుండా అలానే అతని ముఖంలోకి చూస్తుండిపోయాడు. యాచన ద్వారా లభించిన నాణేలను అతని చేతుల్లో పోసి, వెళ్ళిపోయాడు ఆ యాచకుడు. తానే ఓ యాచకుడు. మరొకరి పాలిట దాత అయ్యాడు. అది దానంగా భావించలేదు. తన ధర్మంగా భావించాడు. తృప్తిగా సాగిపోయాడు తన స్థావరానికి.
ఇవ్వడంలో తృప్తి మాత్రమే కాకుండా ఆత్మానందమూ ఉంటుంది. మనోజనితమైన సుభావన ఎదుటివారి ఆర్తిని, అవసరాన్ని గుర్తిస్తుంది.
త్యాగయ్య- మహారాజు పంపిన సంబారాలను తోటి అగ్రహారీక బీదలకు మరు నిమిషంలోనే పంచి దివ్యానందం పొందాడు.
మహాభారతంలో కర్ణుడు మహాదాత. ఓ బంగారు గిన్నెలో సుగంధభరితమైన లేపనాన్ని ఎడమచేతిలో ఉంచుకొని, కుడిచేత్తో పూసుకుంటుండగా శ్రీకృష్ణుడు అటుగా వచ్చి- బంగారుగిన్నె ఎంత చూడ ముచ్చటగా ఉంది?' అనగా- కర్ణుడు నవ్వుతూ 'ఇంద! కృష్ణా... తీసుకో' అన్నాడు.
'అదేమిటి ఎడమచేత్తో ఇస్తున్నావు కర్ణా!' అనేసరికి- అంగరాజు చిరునవ్వుతో 'కుడిచేతికి మారేసరికి నా బుద్ధి మారిపోవచ్చు కృష్ణా! గ్రహించు' అంటాడు.
నిజానికి పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడికి బంగారపు గిన్నెపై కోర్కె ఉంటుందా? సకలసృష్టీ ఆయనదే కదా.
'ఇవ్వదలచుకున్న ఉత్తర క్షణంలోనే ఇచ్చివేసే గుణం దొడ్డది' అన్న సందేశం మానవాళికి అందాలన్నదే అందులో ఉద్దేశం.
'భవతి భిక్షాందేహి'
అనుష్టానమాచరిస్తున్న గృహస్తు గుమ్మం దగ్గరకు వచ్చి చూశాడు.
భిక్షను యాచిస్తున్న వ్యక్తిపై మొలకు చింకిపాత తప్ప మరొకటి లేదు. మంచు కురుస్తోంది. గృహస్తు తన భుజంపై ఉన్న వస్త్రాన్ని వెంటనే ఆ వ్యక్తి భుజంపై కప్పాడు.
ఈ ఉదాహరణలు- ఇవ్వడం అనే దృక్పథంలో మరో ఆలోచనకుగానీ, ఆలస్యానికిగానీ తావుండరాదన్న సత్యాన్ని తెలుపుతున్నాయి.
తాను సముపార్జించిన జ్ఞానాన్ని సమాజం కోసమే వినియోగిస్తాడు జ్ఞాని. సదాచారపరుడైన స్థితిపరుడు దానగుణంతో అమితానందాన్ని పొందుతాడు. భావితరాల ఆనందానికి, ఆరోగ్యానికి, అభ్యుదయానికి, విరామమెరుగక శ్రమిస్తారు మహనీయులు. ఏదో ఒకటి గొప్పగా పొందాలన్న తహతహతో కాదు, ఏమివ్వాలన్న దానిపైనే దృష్టి ఉంటుంది. ఇది దైవీగుణం.
అంతా నాదే, నాకే చెందాలి అనేది అసురగుణం. అనంతమైన ప్రకృతి నేర్పే పాఠమూ ఇదే. జగాలు మారినా, యుగాలు మారినా ప్రకృతికి ఇవ్వడమే తప్ప మరొకటి తెలియదు.
'ప్రకృతి'నుంచి ప్రభవించిన మనం కూడా 'పొందడం' అన్న ఆలోచనే ధ్యేయం కాకుండా 'ఇవ్వడం'లోనే తృప్తి, సంతృప్తి ఉంటాయని గ్రహించా!
- దానం శివప్రసాదరావు