ᐅఅద్వైత తేజోరాశి




అద్వైత తేజోరాశి 

అనంత ప్రజ్ఞా ప్రాభవం మానవ రూపంలో ఎనిమిదో శతాబ్దంలో (క్రీ.శ. 788) కేరళలోని కాలడిలో ప్రభవించింది. ప్రపంచ తాత్విక శిఖరాన ప్రకాశించిన 'వివేక చూడామణి' ఆయన. ఆయన అందించిన ప్రజ్ఞాన మహస్సు 'సౌందర్యలహరి'గా నిరంతరం ప్రవహిస్తూ మానవ జీవనాన్ని ఆధ్యాత్మికంగా సస్యశ్యామలం చేస్తూనే ఉంది. ఆయన పసివయసులోనే వేదాలను ఔపోసన పట్టారు. ప్రస్థాన త్రయం (గీత, బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు) అర్థం కావడమే గహనం. అంతటి మహనీయ దర్శనాలకు విపుల వ్యాఖ్యానాలు రాశారు. మానవ ప్రస్థానపథాన్ని వెలిగించే మణిదీపాలు అవి. శంకరుల జీవిత పుస్తకంలోని ప్రతి పుట విజ్ఞాన కిరణాలతో, తాత్విక దీప్తితో మెరిసిపోతుంటుంది. పిన్న వయసులోనే ప్రపంచాన్ని పరిత్యజించిన పరివ్రాజకుడు. పరమేశ్వర సాక్షాత్కారం కోసం జీవితాన్ని ధారపోసిన ద్రష్ట.
పదహారు సంవత్సరాలకే శంకరులు తాను రాయవలసినదంతా రాశారు. వాటిని ఈనాటికీ అద్భుతాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశానికి తిరిగి వేదయుగంనాటి ఆధ్యాత్మిక మహత్తును, నైర్మల్యాన్ని తీసుకొని రావాలని తహతహలాడిన క్రాంతదర్శి. కొద్ది సంవత్సరాల కాలంలోనే విజయ శిఖరాలు అధిరోహిస్తూ భారతీయుల వేదవిహిత ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పునఃప్రదీప్తం చేశారు. ఆదిశంకరులు లేకపోతే హిందూమతం ఇప్పుడున్న రూపంలో మనకు దక్కేది కాదు. జగన్మాతపైన, భగవంతునిపైన ఆయన రాసిన శ్లోకపరంపర ఇప్పటికీ వాడవాడలా మారుమ్రోగుతున్నాయి. అవి మానవాళికి ఆయన వదిలివెళ్లిన జ్ఞాన నిధులు, సంగీత సుధలు.

శంకరులు జీవించిన కాలంలో ఎన్నో దుష్ట మతాలు సమాజాన్ని విషపూరితం చేశాయి. క్షుద్ర, తాంత్రిక శక్తుల్ని, జంతుబలుల్ని ప్రోత్సహించే అనైతిక పూజారుల చేతుల్లో ఆలయాలు చిక్కుకున్నాయి. వేదాల్లోని ఉదాత్త ధార్మిక సూత్రాల ఆధారంగా ఆ దుర్మతాలను సంస్కరించారు శంకరులు. వాటన్నింటినీ ఆత్మోపలబ్ధి వైపు తరలించారు. గణపతి, సూర్యుడు, శక్తి వంటి దేవతల ఆరాధనకు వేదాంత అధ్యయనంలో ఉన్నత స్థానం ఉంది. పరిపూర్ణత్వాన్ని దివ్యత్వాన్ని సాధించి పరమాత్మ జ్యోతిర్మయ తీరాలు చేరడమే ఈ దేవతారాధన పరమ లక్ష్యం. అదొక నిరంతర సాధనగా మారింది. నిర్గుణ బ్రహ్మను తెలుసుకున్న జ్ఞాని సగుణ బ్రహ్మను పూజించవచ్చునని మనకు తెలిసింది.

జీవితంలో క్షణికమైన కోరికలు, సుఖాలు, భ్రమలు, భ్రాంతులు, వైఫల్యాలు, నైరాశ్యాల వెనక ఒక మహాసత్యం భాసిస్తోంది. ఈ ప్రపంచంతోపాటు కోరికలు మనకు సర్వకాలాల్లో నిజాలుగా, సర్వస్వంగా, శాశ్వతమైనవిగా కనిపిస్తాయి. లౌకిక విషయాలు, విషయవాంఛల వెంట పరుగులెత్తే మన పరిమిత ఇంద్రియాలు వాటి వెనక ఉన్న శాశ్వత సత్యాన్ని చూడలేవు. ఇంద్రియాలు చూసే ప్రపంచం అసలు ప్రపంచం కాదు. అంతఃస్ఫూర్తి నేత్రం మనలో తెరుచుకుంటే సత్యం కనిపిస్తుంది. శంకరుడు ఆ సత్యాన్ని దర్శించాడు. అంతేకాదు జీవుడే ఆ నిత్య సత్యం అని చాటి చెప్పాడు. భగవంతుడు మనలోనే ఉన్నాడని, భగవంతుడే మన ఆత్మ అని ప్రపంచంలో ఒక్క భారతదేశమే చెప్పగలిగింది. అద్వైత తేజోరాశిని శంకరాచార్యుల మహా తపస్సుతో ప్రజ్వరిల్లిన మంత్రం 'అహం బ్రహ్మాస్మి' అనుభవం రాకపోయినా- భారతదేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యం అది.

ఈ ప్రపంచానికి వ్యతిరేకమైన మరో ప్రపంచం, మరో పదార్థం ఉన్నాయని శాస్త్రవేత్తలే చెబుతున్నప్పుడు- ఈ ప్రపంచానికి పూర్తిగా విరుద్ధమైన మరో సత్య ప్రపంచం ఎందుకు ఉండకూడదు? శంకరుడు ఆ ప్రపంచాన్ని దర్శించి ఉండవచ్చుకదా? ఆధ్యాత్మిక సిద్ధులకు శాస్త్రీయమైన రుజువులు ఉండవు. హేతువుకు అందని ఔన్నత్యాలు అవి. తర్కానికి దొరకని కాంతి ప్రవాహాలు.

'నాకు మంత్రాలు రావు, స్త్రోత్రాలు తెలియవు. నిన్ను ఎలా ఆవాహన చేయాలో తెలియదు. సాధన లేదు. ధ్యానం లేదు. నీ గురించి, నీ మహిమ గురించి కథలు ఎరుగను. ముద్రలు తెలియవు. ఏమీ తెలియదని ఎలా దుఃఖించాలో కూడా తెలియదు. ఓ జగన్మాతా! నా ఆవేదనను నిర్మూలించు' అని శంకరులు ఒక అజ్ఞాని స్థాయికి వచ్చి ఎలా ప్రార్థించాలో చెప్పారు. అది ఆయన కారుణ్యం. బంగారు ఉసిరికాయల్ని నిరుపేద ఇంటిలో కురిపించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అదే దివ్యశక్తితో తానెందుకు ఆ బంగారాన్ని సంపాదించలేదనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యామోహాలకు అతీతుడు కాబట్టే లక్ష్మీదేవి సైతం శంకరుని ప్రార్థనకు కరిగిపోయి 'కనకధార'గా కురిసిందని చెబుతారు.

శంకరాచార్యులు హిందూ ధర్మ పునరుద్ధరణకు వచ్చిన అవతార కిరణం. ఎప్పటికీ అస్తమించని తేజోపుంజం.

- కె. యజ్ఞన్న