ᐅతృప్తి - ఆనందం




తృప్తి - ఆనందం 

ఏమీ తెలియని పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆనందం, తృప్తి, ఆరోగ్యం ఉంటాయి. స్వచ్ఛమైన గంగాజలం లాంటి పవిత్రత, పారదర్శకత ఉంటాయి.
ఎదిగేకొద్దీ బుద్ధి, తెలివితేటలు పెరుగుతూ బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకునే వయసులో ఆనందానికి, ఆరోగ్యానికి, తృప్తికి దూరమవుతాడు మానవుడు. స్వచ్ఛమైన గంగాజల రాశిలోకి వరదనీరు వచ్చి చేరుతుంది. ఆ నీటితో మట్టి చెట్టూ చేమా కల్మషాలు వచ్చి చేరినట్లు మనసు మాలిన్యాలతో కకావికలమైపోతుంది.

ఆనందం ఎక్కడ, ఆరోగ్య జీవన విధానం ఏదంటూ అలమటిస్తాడు మానవుడు. పసిబిడ్డగా ఉన్నప్పుడే హాయి గదా అంటూ వైరాగ్య ధోరణులతో కునారిల్లుతూ ముక్తి, స్వర్గం అంటూ వృద్ధాప్యం వరకు ఆలోచనల్లో పడిపోతాడు.

నిజానికి ముక్తిపథం, స్వర్గలోకం ఉన్నాయా? ఒకవేళ ఉన్నా అక్కడా సుఖాలు అనుభవించేందుకేనా జన్మలు!

'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. ఎందుకని? ఆలోచన, జ్ఞానం సదాచరణ, ఏది మంచీ- ఏది చెడు అన్న విచక్షణ ఒక్క మానవునికే సొంతం అందుకే మానవుణ్ని బుద్ధిజీవిగా అభివర్ణిస్తారు.

పసిప్రాయం- ఏమీ తెలీని స్థితి. ఆ స్థితి నుంచి తెలుసుకునే స్థాయిలోకి వచ్చాక, పసిప్రాయం నాడు పొందిన ఆనందానికంటే ఎక్కువగా ఆనందాన్ని పొందగలగాలి కానీ జరుగుతున్నదేమిటి చూస్తూన్నదేమిటి?

బాధ్యతలు, బరువులు, సంసారం అనే సాగర జలాల్లో ఆనందంగా ఉండే స్థితికి దూరమవుతున్నాడు మనిషి. ఎదిగాక ఆశ్రమ ధర్మాలు సహజం. జీవన చక్రంలో ఆటుపోట్లు తప్పవు. సంపాదన, పోషణ, ఏడేడు తరాలకు సుఖసంతోషాలను అందించే మిషతో నిరంతర సమస్యలతో, శ్రమతో పోరాడటమే జీవితమవుతోంది. ఈ నేపథ్యమే ఆనందాన్ని దూరంచేస్తోంది. జీవన భ్రమణానికి ఇవి ఎంత అవసరమో, ఆనందంగా నూరేళ్ళు గడపడమూ అంతే అవసరం. ఇదిలేని బతుకు ఎడారి జీవితం లాంటిది. మోక్షపథం అంటే అగోచరమైన లోకం కాదు. నూరేళ్ళ జీవితం ధర్మాచరణ కలిగి తద్వారా పొందే ఆనందదాయకమైన స్థితి మాత్రమే.

సర్వ దుఃఖాలకు మూలం అదుపులేని కోర్కెల విజృంభణే. మిద్దెలో ఉండేవాడు మేడ కావాలంటాడు. మేడలోనికి చేరాక అద్దాల మహలు, ఆపై అంతరిక్ష విహారం చేయాలంటాడు. తృప్తి అన్న పదమే అతని నిఘంటువులో లేకుండాపోతుంది. తుకారామ్ పాండురంగని భక్తుడు. అభంగ రచనలతో భక్తి సామ్రాజ్యంలో తరించిన సాధుపుంగవుడు. చమరదశలో, భక్తి పరిపక్వత చెందాక పుష్పక విమానం వచ్చింది. భార్యను కూడా బయల్దేరమన్నాడు. సగం దూరం వచ్చాక తుకారామ్ ధర్మపత్ని 'అయ్యో! వంట గది తలుపు వేయడం మరిచిపోయానే! మీరు పదండి- తలుపువేసి వస్తాను. అంటూ వెనకకు మరలి, అలానే భువిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని చదువుకున్నాం.

ఇక్కడ మనం గ్రహించాల్సిందేమిటి? కోర్కెలను, మమకారాలను అదుపులో ఉంచుకున్నాడు తుకారామ్. జీవనోపాధికి గోవులను కాచినా, కుండలు చేర్చి విక్రయించినా, మనసును అధీనంలో ఉంచుకున్నాడు. నిరంతర భక్తిసాధనే జీవిత ధ్యేయంగా ఎంచుకుని జీవించినంతకాలం ఆనందంగా జీవించాడు. జీవనోపాధి కార్యమేదైనా తృప్తిగా నెరవేర్చుకున్నాడు. కోర్కెలు, మమకారాలు వదలలేక ఆయన ధర్మపత్ని చివరివరకు ఆశాపాశాల వలయాల్లోనే చిక్కుకొని పోయింది.

ప్రపంచ విజేతగా పేరుపొందాలనుకున్న అలెగ్జాండర్- తృప్తిలేని తత్వానికి, కోర్కెల పుట్టకు నిదర్శనం... చరిత్రలో.

చివర్లో జ్ఞానోదయమైంది. శవపేటిక పైన ఆకాశంవైపు తన హస్తాలు ఉంచమంటూ కోరకున్నాడు- సర్వం సహా సామ్రాజ్యాలు ఏవీ వెంటరావనే సందేశం ఇవ్వడానికి.

యోధుడే అయినా చక్రవర్తిగా జీవించినా ఆనందం తృప్తి లేకుండా నిరంతర క్షుభితుడిగా- నరకంలో బతికాడు.

కోరికల్ని జయించిన మహాపురుషులెందరో నిత్యానందులై బతుకు తీరాలను సుఖంగా దాటి ఈనాటికి, ఏనాటికీ ఆరాధ్యులుగా, ఆదర్శనీయులుగా నిలుస్తున్నారు. వారి జీవనయానమే మోక్షపథం.

- దానం శివప్రసాదరావు