ᐅప్రపంచం... ఓ సాధనోపకరణం




ప్రపంచం... ఓ సాధనోపకరణం 

చాలామంది భావన... ఈ ప్రపంచంలో ఈ అనవసర కష్టాలే లేకపోతే, ఈ పాకులాటలు, మమకారాల మాయాతెరలు, ఆర్థిక వనరుల కోసం ఆరాటాలు పీడించకపోతే... సాధన మరింత బాగా జరిగేది కదా! మరెంతో సమయాన్ని భగవంతుని కోసం వెచ్చించేవారం కదా అని. ఇంతకంటే అమాయకమైన ఆలోచన మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ ప్రపంచం మన సాధనకు అడ్డం అనుకుంటే- మరి మనం ఎవరమన్నట్లు? మనతో కలిసే ప్రపంచం కదా?! మరి మనం మనకు అడ్డమా? మనకే మనం ఆటంకమా? మనను మనం సంస్కరించుకుంటే ప్రపంచాన్ని మొత్తం సంస్కరించినట్లే. మన సాధనకు, మన ప్రగతికి మనను మనం (నేనును) అడ్డు తొలగించుకుంటే- ప్రాపంచిక ఆటంకాలను అడ్డు తొలగించుకున్నట్లే. ఏ రకంగానైనా సరే, ప్రపంచాన్ని మనం నిందిస్తే మనను మనం నిందించుకున్నట్లే. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మశోధన చేసుకోవాలి. ఆత్మలోకి మునిగిపోవాలి. ఆత్మగా మిగిలిపోవాలి.
నిజానికి ఈ ప్రపంచం పరమాద్భుతమైన సాధనోపకరణం. అందులో ఈ జీవనం ఓ సాధనాక్రతువు. సాధనా రుతువు. అరిషడ్వర్గాల ఒత్తిళ్లు, మమతానురాగాల మాయా తెరలు, షడ్రుచులు, బులిపించే జిహ్వచాపల్యాలు, అందమైన సర్పాల్లా ఆకర్షించే ప్రాపంచిక సుఖాలు, చివరి క్షణం వరకు వెంటాడే మరణభయం... వీటన్నింటినీ అధిగమించి పరమాత్మపథం చేరాలనే నిర్విరామ ప్రయత్నం. ఇవన్నీ మన వైరాగ్యాన్ని, నిత్యానిత్య వస్తువివేకాన్ని, భగవంతునిపట్ల నిజభక్తిని, పరమ ప్రేమను పరీక్షించే 'సహజవనరులు.' ఎంత అద్భుతం! చాలామంది వ్యాయామ ప్రియులు దేహదారుఢ్యం కోసం కావాలని ఇసుక బస్తాలను వీపున వేసుకుని మెట్లు ఎక్కడం, కండరాల మీద సహాయకులతో బాదించుకోవటం లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలా శారీరక ప్రయోజనం కోసమే కావాలని శ్రమను, కష్టాన్ని నెత్తికెత్తుకుంటున్నప్పుడు-ఆధ్యాత్మిక ప్రయోజనసిద్ధికి ఇంకెంతగా శ్రమపడాలి? పరమాత్మ అనే పరమపద సోపాన పటంలో ఆర్తులు, ఆకర్షణలు, ఆవేదనలు, ఆరాటాలు... వాటికవే సహజంగా పాములై మింగివేయాలని మనమీదకు ఎగసి దుముకుతూ ఉంటే చాకచక్యంగా తప్పించుకుంటూ, సాధనలనే నిచ్చెనలను దొరకబుచ్చుకుని ఎక్కుతుండాలి. కొన్ని గాయాలు చాలా హాయిగా ఉంటాయి. భగవంతుడి అన్వేషణలో అయ్యే ప్రాపంచిక సంవేదనల గాయాలూ అంతే. భవరోగాలు మానుతున్న గాయాలు. అర్థం చేసుకుంటే అరకొర సుఖాలు. కాఫీ తాగుతూంటే నాలుక కాలుతుంది. అయినా తాగుతాం. కాకరకాయ చేదుగా ఉంటుంది. అయినా తింటాం. ఈ ప్రపంచమూ అంతే. ఈ మాయా అంతే. మనం చేరాలనుకున్న గమ్యం తాలూకు మహదానందం ముందు ఈ ప్రాపంచిక సంవేదనలు లెక్కలోకి రానివి. కాఫీలోని వేడిలా, కాకరలోని చేదులా అవీ ఒకింత ఆనందమే. అలలు లేకపోతే ఈతలో ఆనందమే లేదు. కష్టపడి మెట్లు ఎక్కే ఆయాసంలోనూ ఆనందమే ఉంది. ఆ ఆయాసమే లేకపోతే ఆ ఆరోహణలో అందమే లేదు. ఆనందమే లేదు.

బిడ్డకు తల్లి జీవితకాల రక్షణ ఇస్తుందంటే, ఇవ్వాలంటే, తనకన్నా బిడ్డను అత్యధికంగా ప్రేమించాలంటే... ఎంత వెలలేని ప్రేమ ఉండాలి! అంత ప్రేమను తల్లిలో పాదుగొల్పాలంటే? ఏమిటి ఆ ప్రేరణ? ఎలాంటిదా అద్భుత ఆయత్తత? గర్భాన్ని మోశాక భయంకరమైన ప్రసవవేదన భరించాక... ఒడిలోకి వచ్చే బిడ్డ ఎంత అపురూపమో తెలియజెప్పాడు భగవంతుడు. భరించలేని బాధానంతరం లభించిన ఆ శిశువు, ఆ అమృత బిందువు, ఆ ప్రేమ నిధులు ఎంత అపురూపమంటే- ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే. ఆ మాతృప్రేమను, ఆ మాధుర్యాన్ని మరోసారి అనుభవించేందుకు అంతటి వేదనను మరోసారి ఆహ్వానించేందుకూ సిద్ధమే. అపురూపమైందేదీ అవలీలగా దొరకదు. మరి అపురూపతలకే అపురూపం అంతర్యామి. అద్భుతాలనే సృష్టించిన పరమాద్భుతం. మన సాధనలకెన్నడు అందాలి... ఆయన సంకల్పించుకుంటే తప్ప!

- చక్కిలం విజయలక్ష్మి