ᐅమార్పు
వాడిన గులాబి, ముడతలు పడిన చర్మం, తెల్లజుట్టు- ఏమంటాయి? ఒకప్పుడు తాము అలాలేమని, ప్రారంభంలో తామూ నిగనిగలాడామని, కాంతులీని అందర్నీ ఆకర్షించామని; కాలక్రమేణా వన్నెలుతగ్గి తమలో మార్పు వచ్చిందని! ఎదుగుతున్న బాలుడు, పెరుగుతున్న మొక్క, పైకిలేచే ఉషఃకిరణాలు- ఏమని చెబుతాయి? తామలాగే లేతగా ఉండిపోమని, కాలక్రమేణా మిసమిసలాడతామని, తమలో మార్పు వస్తుందని, తాము కొత్తరూపం ధరిస్తామని! ఈ సృష్టిలో ఏ రూపమూ శాశ్వతం కాదు. ప్రతిదానికీ మార్పు సహజం. ఇది జీవిత సత్యం. ఇది గుర్తించగలిగిన ప్రతివాడూ బుద్ధిమంతుడే! అలాంటి జ్ఞానోదయమైన క్షణంలోనే అతనిలో స్థితప్రజ్ఞతకు అంకురారోపణ జరుగుతుంది. లేకపోతే, భవిష్యత్తుకు తలచుకుంటూ వర్తమానాన్ని అశాంతిమయం చేసుకుంటాడు.
చర్మం ముడతలు పడినంత మాత్రాన మన నిత్య నైమిత్తిక కర్మలు ఆగిపోవు కదా! ఆకలి, నిద్ర, చేయాల్సిన పనులు ఏవీ ఆగిపోవు. ఇప్పుడు ముప్ఫయ్యేళ్ల నాటి ఆకలి లేకపోవచ్చు. జీర్ణశక్తి తరిగిపోయి ఉండవచ్చు. గాఢనిద్ర కలగకపోవచ్చు. సత్తువ ఉండకపోవచ్చు. చేసే పనుల్లో చురుకుదనం తరిగిపోయి ఉండవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గిపోయి ఉండవచ్చు. మరెవరిమీదనో కొన్ని పనులకోసం ఆధారపడాల్సిన అవసరం కలగవచ్చు. మానవ జీవితంలో ఇలాంటి మార్పులన్నీ అతి సహజం. జీవితమిలా మారిపోయిందేమిటని వాపోయి ప్రయోజనమేముంది? ఈ మార్పును మనం ఎందుకు ప్రతిఘటించాలి? అయ్యో... గత జీవితంలో లభ్యమైన ప్రేమానుభూతులు, సుఖానుభవాలు మళ్ళీమళ్ళీ కలగకుండా పోయాయే అని ఎందుకు చింతించాలి? నిదానంగా ఆలోచిస్తే- అవి మనసులోని జ్ఞాపకాల పొరల్లో లేవా? వాటిని ఒత్తిగించగలిగితే ఆ పులకింతలు ఒకింత ఒలికి మనసు రసప్లావితం కాదా? జరిగేవాటిని జరగనివ్వాలి. వాటిని నిశ్చలంగా ఆహ్వానిస్తూ జీవితంలో కలిగే మార్పులన్నింటికీ ఆహ్వానం పలకాలి. ఎప్పుడైతే మార్పు సత్యమని, నిత్యమని మనసు గ్రహించగలుగుతుందో భవిష్యత్తులో కలిగే బాధలు, కోపతాపాలు, అవమానాలు, అసంతృప్తులూ... ఇవేవీ ఇబ్బందిపెట్టవు. మనల్ని ప్రభావితం చెయ్యలేవు. వాటిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలను జ్ఞానం ప్రసాదిస్తుంది! కష్టసుఖాల నడుమ అంతరం నశిస్తుంది. అన్నింటినీ సమదృష్టితో చూడగల స్థితప్రజ్ఞత కలుగుతుంది.
'ఇలా జరగాల్సి ఉంది. ఇలాకాక వేరొకలా జరగదు' అన్నది బుద్ధ భగవానుడు మానవాళికి ప్రబోధించిన సూత్రం. 2500 ఏళ్ల క్రితం గయలో రావిచెట్టుకింద తన తపోసాధనతో బుద్ధుడు గ్రహించిన జ్ఞానమిదే!
- తటవర్తి రామచంద్రరావు