ᐅఉపవాస వ్రత విశిష్టత
సమస్త మానవాళి పట్ల ప్రేమానురాగాలు పెంపొందింపజేసుకోవడం ఉత్తమ మానవత్వపు లక్షణం. ప్రతి మానవుణ్నీ నీతిమంతుడిగా, ఉన్నతుడిగా తీర్చిదిద్దడం మానవీయ సంస్కృతి. సృష్టికర్తను పవిత్రంగా ప్రేమిస్తున్నట్లే, సృష్టినీ ప్రేమించాలన్నది మరింత ఉత్కృష్టమైన భావం. ఈ గుణాలు భువిపై పరిఢవిల్లాలని వాటికోసం రమజాన్ నిరతం తలుపులు తెరిచే ఉంచుతుంది. విశ్వవిభుని ఆరాధనాభావాలపై ఆసక్తి, నిజాయతీ, సుహృద్భావం, క్షమాగుణం, క్రమశిక్షణల్ని రమజాన్ మాసం మానవుల్లో నిలుపుతుంది. ఇందుకు రోజా (ఉపవాస వ్రతం) దోహదం చేస్తుంది.
ఉపవాస వ్రతం అంటే పంచేంద్రియాలకు వర్తించే సంయమనం. పవిత్ర నియమాలకు లోబడి ఉండే మహోన్నత మహత్తర ఆరాధన. మనశ్శుద్ధి ప్రాప్తికి తోడ్పడే గొప్ప సాధనం. మహాప్రవక్త నిర్దేశానుసారం- ఈ దీక్ష నిర్వహణలో ఎన్నో కర్తవ్యాలు, నిషిద్ధాలు, నిబంధనలు ఉన్నాయి. త్రికరణశుద్ధితో ఉపవాసం ఉండటంవల్ల ఆత్మప్రక్షాళన జరుగుతుంది. మనిషి ఆలోచనలో పవిత్రత ఏర్పడుతుంది. ఆధ్యాత్మికశక్తి వృద్ధి చెందుతుంది. ఉత్తమ మానవతను, దైవభక్తిని మనిషిలో నిలిపే ఈ దృక్పథమంతా ప్రేమ, సేవ, దయ రూపాల్లో వ్యక్తమవుతుంది. సాటి మానవుల వ్యధాభరిత జీవితాల్ని ఎలా తెలుసుకోవాలో అవగతమవుతుంది. అహంభావం కుప్పకూలి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మృదువైన మాటతీరు అలవడుతుంది.
రమజాన్ నెల అంతా అత్యంత శ్రద్ధాసక్తులతో భయభక్తులతో సడలని నిష్ఠతో రోజా పాటిస్తారు. తీవ్రమైన రుగ్మత, శాస్త్రవిహితమైన మరో కారణం ఉంటేనే తప్ప- ఏ రోజూ ఉపవాస విరమణ జరగరాదు. ఉపవాసమున్నవారు తఖ్వా (దైవభీతి) అలవరచుకొంటారు. ఇలాంటివారికి ధార్మిక ప్రాపంచిక సంబంధమైన పనులన్నీ సులభసాధ్యమవుతాయని ఇస్లామ్ విశ్వాసం. తఖ్వా పరిధి సువిశాలమైంది. దీని శాఖలు అపారం. అన్నం పెట్టడం, రోగుల చికిత్స కోసం సౌకర్యం కలగజేయడం, అనాథలు, వితంతువులు, దీనుల మంచిచెడులు చూడటం, యాచకులు, బాటసారుల అవసరాలు తీర్చడం, అత్యంత అవసరార్థుల్ని ఆదుకోవడం- వంటివి ఈ పరిధిలోనివే. ఈ సేవకు అందరూ అర్హులే. మనసారా ఒకరు మరొకరి శ్రేయాన్ని కోరడం, ఒకరి మేలు తమ మేలని గ్రహించడం అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన అంశాలు. ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో ఖురాన్ పారాయణం చేస్తారు.
ఉపవాసంలో ప్రదర్శనాబుద్ధి పనికిరాదు. రణరంగంలో రక్షణకు ఉపయోగపడే డాలు వంటిది ఉపవాసవ్రతం అన్నారు మహాప్రవక్త. ఖడ్గంవేటు శరీరంపై పడకుండా రక్షణ కల్పిస్తుంది డాలు. మనిషి మనసును దురహంకార దుర్మార్గాల దూకుళ్లనుంచి, పాపకార్యాలనుంచి కాపాడుతుంది ఉపవాసవ్రతం. ఈ వ్రతనియమాల్ని ఉల్లంఘించడం- అల్లాహ్ దృష్టిలో క్షమించరాని నేరం. అసత్యం పలకడం, పరోక్షనింద చేయడం, వ్యర్థప్రేలాపనలు చేయడం, చెడును వీడకుండటం- వంటి అవగుణాలకు లోనై ప్రవర్తిస్తే వారికి ఆకలిదప్పుల బాధ తప్ప మరేమీ దక్కదని విశ్వసిస్తారు. ఉపవాసంలో ఉండగా ఎవరైనా దూషించినా, కయ్యానికి సిద్ధమై సహనశక్తిని కోల్పోరాదు. ఆవేశానికి ఆగ్రహానికి దూరంగా ఉండాలి. ఎదుటివారిలో హృదయ పరివర్తన కలిగేలా ప్రశాంత వదనంతో మృదువుగా మాటలాడాలి. ఉపవాసంలో ఉన్నాను, దురుసుతనం వాంఛనీయం కాదనే అర్థం స్ఫుర్తించేలా- మర్యాదపూర్వకంగా వివరించడం అవసరం. అశ్లీల దృశ్యాలు చూడటం, పరస్త్రీని కన్నెత్తి చూడటం, వినరాని మాటలు వినడం, పోరాని చోటికి పోవడం, అకృత్యాలకు పాల్పడటం- వంటి వక్రధోరణులన్నీ ఇస్లామ్‌లో నిషేధం. ఉత్తమ శీలం ప్రతి ఒక్కరికీ భూషణమై శోభిల్లాలన్నదే పరమాశయం. రమజాన్ మాసం చివరి పది తేదీల్లో ఒక రాత్రి- బేసి సంఖ్య దినాల్లో వస్తుంది. వెయ్యి మాసాలకన్నా విలువైందని భావించే ఈ రాత్రిని 'లైలతుల్ ఖద్ర్' అంటారు. అంటే, విలువైన రాత్రి. ఈ రాత్రే పవిత్ర ఖుర్ఆన్ అవతరించింది కనుక- రమజాన్ మాసానికి, ఈ రాత్రికి అనిర్వచనీయమైన గౌరవం. లైలతుల్ ఖద్ర్ 27వ రాత్రి ఉండటానికి ఎక్కువ అవకాశముందని మహాప్రవక్త సహచరుల బోధల్ని అనుసరించి తెలుస్తోంది.
ఉపవాసం నీతిపాఠాలు నేర్పించే ఉత్తమ గురువు లాంటిది. అది సర్వోత్కృష్ట సార్వజనీన విషయాల్ని వివరించి మానవుల్ని ఉత్తములుగా జీవించమని హితబోధ చేస్తుంది. హింసకు రవ్వంత తావులేని, సమైక్యతకు జీవంపోసే చిత్తశుద్ధి, ఉన్నతాదర్శం, త్యాగం, సహనశీలత, పరోపకారం- ప్రతి వ్యక్తి హృదయంలో ప్రవర్తనలో దర్శనమివ్వాలని రమజాన్ ఆకాంక్షిస్తుంది.
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా