ᐅస్నేహితుల రోజు
ఒక రాజు తన పొరుగు రాజులతో నిరంతరం యుద్ధం చేసేవాడు. ఆ రాజు సైన్యంలో ఇద్దరు స్నేహితులుండేవారు. రాజు యుద్ధకాంక్ష ఇద్దరికీ నచ్చేది కాదు. ఆ ఇద్దరిలో ఒకరు అశ్వ దళాధిపతి, మరొకరు ఆయుధ సేనాధిపతి. ఒకరోజు రాజు అశ్వ దళాధిపతిని పిలిచి, పొరుగు రాజ్యంతో యుద్ధానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అందుకు అతడు 'రాజా... ప్రస్తుతం రాజ్య ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఇటువంటప్పుడు శాంతి ఒప్పందం ఉత్తమం' అన్నాడు. అశ్వ దళాధిపతి అలా సలహా ఇవ్వడం రాజుకు నచ్చలేదు. 'ఈ రాజద్రోహిని బంధించి చెరసాలలో వేసి రేపు సూర్యోదయం లోపు ఉరితీయండి' అని ఆజ్ఞాపించాడు. ఆ నగరానికి చాలా దూరంలో ఉన్న తన ముసలి తల్లిదండ్రుల్ని చూసి తిరిగి వచ్చేస్తానని, ఆ తరవాతే ఉరిశిక్ష అమలు చెయ్యమని అశ్వ దళాధిపతి రాజును ప్రార్థించాడు. అతడికి బదులు వేరెవరినైనా చెరసాలలో ఉంచితే, అనుమతి ఇస్తానని రాజు చెప్పాడు. అశ్వ దళాధిపతి బదులుగా అతని మిత్రుడైన ఆయుధ సేనాధిపతి చెరసాలలో ఉండేందుకు అంగీకరించాడు. సూర్యోదయమయ్యేలోగా అశ్వ దళాధిపతి రాలేదు. రాజాజ్ఞ ప్రకారం- మిత్రుడి బదులు చెరసాలలో ఉన్న ఆయుధ సేనాధిపతిని ఉరితీశారు. మార్గమధ్యంలో దోపిడి దొంగలను ఎదుర్కోవడంతో అశ్వ దళాధిపతికి ఆలస్యం అయింది. తిరిగి వచ్చేసరికి జరగరానిది జరిగిపోయింది. తనకోసం ప్రాణత్యాగం చేసిన మిత్రుడి పార్థివ దేహం చూసి, ఖడ్గంతో తల నరుక్కుని మిత్రుడి పక్కనే నిర్జీవంగా నేలకు ఒరిగాడు. ఆ మిత్రులు ఒకరికోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకోవడం ఆ రాజు హృదయాన్ని కదిలించింది. అప్పటినుంచీ యుద్ధాలుమాని తన పొరుగు రాజులతో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
ఈ కథలోని అపురూప స్నేహితుల విషాదస్మృతికి నివాళిగా స్నేహితుల రోజు మొదలైందని చెబుతారు. 1935వ సంవత్సరంలో అమెరికాలో ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని స్నేహితుల రోజుగా జరుపుకొన్నారు. అది నేటికీ కొనసాగుతోంది.
గుహుడు శ్రీరాముణ్ని 'ఓరీ రామా!' అని పిలిచాడు. 'నన్ను ప్రేమగా పిలిచిన నా స్నేహితుడు ఏ జాతివాడైతేనేం...' అంటూ రాముడు గుహుణ్ని అక్కున చేర్చుకున్నాడు. విభీషణుడు శత్రుకూటమిలోని వాడైనా, శరణుకోరి వచ్చాడని స్నేహితుడిగా స్వీకరించాడు రాముడు. అలాగే సుగ్రీవుడికీ స్నేహహస్తం అందించాడు. స్నేహానికి ఉత్తమ అర్థాన్ని కల్పించిన శ్రీరాముణ్ని మనం ఆదర్శ పురుషుడిగా, ఉత్తమ చరితుడిగా కొలుస్తున్నాం. శ్రీకృష్ణుడూ తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ని గుర్తుంచుకొని ఆపత్కాలంలో సహాయం అందించాడు. ఈ దృష్టాంతాలు స్నేహం చాటున దాగిన ఆధ్యాత్మికతను తేటతెల్లం చేస్తాయి.
ఈ విశాల విశ్వంలో ప్రకృతి మనకిచ్చిన వరాల్లో స్నేహమే అన్నిటికన్నా విలువైనది, అందమైనది, ఆనందకరమైనది.
అందరం స్నేహాన్ని పంచుకొంటూ, పెంచుకున్ననాడే జీవితానికో అర్థం! అదే స్నేహితుల రోజు ప్రాముఖ్యాన్ని తెలిపే పరమార్థం.
- డాక్టర్ ఎమ్.సుగుణరావు