ᐅనీతిమార్గం



నీతిమార్గం 

వివేకంతో కూడిన ధర్మమే నీతి. ఇందుకు విద్య ఎంతగానో తోడ్పడుతుంది. నీతిమంతుల్ని అందరూ గౌరవిస్తారు. వేనోళ్ల ప్రశంసిస్తారు. అవినీతిపరుడికి సమాజంలో ఏమాత్రం విలువ ఉండదు. వారిని పైకి ఎవరూ ఏమీ అనలేకపోయినా లోలోన తిట్టుకుంటారు. ఈ సందర్భంగా పురాణాల్లోని కొన్ని పాత్రల్ని పరిశీలిద్దాం. హరిశ్చంద్రుని భార్య చంద్రమతిని పరమ పతివ్రత అని శ్లాఘిస్తూ, కలహకంఠిని గయ్యాళి అని తిడుతుంటారు. రామాయణంలో దశరథ మహారాజు భార్యలైన కౌసల్యా సుమిత్రలను కొనియాడుతూ కైకను మాత్రం నిందిస్తారు. అలాగే శ్రీరామచంద్రుణ్ని సకల గుణాభిరాముడని కీర్తిస్తూ రావణుని దూషించడం మనందరికీ తెలిసిందే.
నీతిగా సంచరించేవారికి మొదట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తక తప్పవు. అంతమాత్రాన నీతిని విడనాడాలనుకోవడం అవివేకమే అవుతుంది. సమాజంలో నీతిమంతులకు ఎప్పుడూ గౌరవముంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.

దుష్టుణ్ని దుష్టుడన్నా, దొంగను దొంగన్నా, కుటిల స్వభావం కలిగినవాడిని కుటిలుడన్నా- అతడికి కోపం రావడం సహజం. తాను స్వతహాగా ఎటువంటివాడైనా లోకం దృష్టిలో మంచివాడిగా చలామణీ కావాలనుకుంటాడు. దీన్నిబట్టి సుగుణం సర్వజన ప్రీతికరమని, దుర్గుణం సర్వహేయమని తెలుసుకోవాలి. అందరికీ ప్రీతిపాత్రమైన సుగుణాన్ని అలవరచుకోవడం ఎంతో శ్రేయస్కరం. పాండవులు నీతిగా ఉండబట్టే ఆదిలో కష్టాలు అనుభవించినా అంతిమ విజయం వారినే వరించింది. భగవంతుడెప్పుడూ నీతిమార్గాన నడిచేవారి పక్షానే ఉంటాడని, ఆపదలొచ్చినప్పుడు ఆదుకుంటాడన్నది పెద్దల మాట. భారతంలో పాండవులు నీతిగా ఉండబట్టే శ్రీకృష్ణుడు వారికి అండగా ఉండి యుద్ధంలో వారి విజయానికి సహకరించాడు.

నీతికి ప్రతీక విదురుడు. అందరూ అతడిని ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయతీ గలవారికి ఇహంలో సుఖసంతోషాలు లభిస్తాయి. పరంలో దైవసాన్నిధ్యం నమ్మకాన్నిబట్టి! అవినీతిపరులు తాము నాశనం కావడమే కాదు- ఇతరుల్ని సైతం కష్టాలకు గురిచేస్తారు. ఏ వ్యక్తి అయినా అభ్యాసంవల్ల నీతిమంతుడు కాగలుగుతాడు. అందుచేత తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నతనం నుంచే గుణవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అందుకు మన పురాణ ఇతిహాసాలెంతగానో తోడ్పడతాయి. వాటిని చదివి అందులో మంచిని గ్రహించాలంటే విద్య ఎంతో అవసరం. సమాజంలో కొందరైనా నీతిమంతులుంటే వారు దుష్టుల దుశ్చర్యలకు కళ్ళెం వేయగలుగుతారు. ఫలితంగా లోకంలో సంభవించే అరాచకాలు అదుపులో ఉంటాయి. భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిలో మొదటిదే నీతిశతకం. అది జగత్‌ప్రసిద్ధం.

- దూరి వెంకటరావు