ᐅఅనుభూతి సాంద్రం




అనుభూతి సాంద్రం 

భగవత్ సాక్షాత్కారం ఒక అనుభవం కాదు. ఒక సంఘటన కాదు. పరిమితమైన వాటికే ఒక దృశ్యంగానో, ఒక అనుభవంగానో రూపుదిద్దుకునే అవకాశం ఉంది. భగవంతుడు అపరిచితుడు. అప్రమేయుడు. నిరాకార జ్యోతి స్వరూపుడు. తేజోరాసి. ఆయననో మూసలో పోసి ఓ ఆకారంలోకి కుదించడం కుదరదు. ఊహాతీతమైన భగవంతుడనే ఆ 'అద్భుతం' ఓ అనుభూతి సాంద్రం. అంతే. ఇంద్రియాలకు అందని ఆ రసస్వరూపం, ఆ తేజోమూర్తి ఆత్మకు మాత్రమే. అంటే, అందిన క్షణంలోనే తనలో లీనం చేసుకునే ఆత్మైక భావన. ఆ తేజో రాసిలోంచి ఒక కిరణంగా వెలుపలికి ప్రసరితమైన మనం మళ్లీ వెనక్కు, ఆ రాసిలోకే వెళ్లి లయం అయినప్పుడే మనం ఏమిటనేది అర్థం అవుతుంది. నిజానికి ఏమిటో అర్థం కానంత ఆనంద వారాసిలో మునిగిపోతాం. సముద్రం లోతు తెలుసుకునేందుకు వెళ్లి మునిగి, కరిగి, కలిసిపోయి సముద్రమే అయిపోయిన ఉప్పు బొమ్మ ఎవరికి ఏం చెప్పగలదు!?
అనుభవం బాహ్యమైంది. అనుభూతి ఆంతరికమైంది. అనుభవం బాహ్యం నుంచి వచ్చి మన శరీరాన్నో, మనసునో తాకాలి. అవి క్రియాశీలమైతేనే అనుభవం అందుబాటులోకి వస్తుంది. అనుభూతి అంతరంగంలోంచి ఉత్పన్నం కావాలి. పంచకోశాలను దాటి ఆత్మను, మేల్కొల్పగలిగింది అనుభూతి. అది రస ప్లావితం అయ్యుండాలి. భగవదున్మత్తం అయ్యుండాలి. బాహ్య వస్తుజాల పరిధిని దాటి అనంత ఆకాశావబింబితమై ఉండాలి. చుంబితమై ఉండాలి. అందుకే మహాత్ములు నిమీలిత నేత్రాంతరంగంలోంచే అమందానందాన్ని బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతారు. వారికి ఏ వస్తుజాలంతో, ఏ బాహ్య సంచయంతో పనిలేదు. లోనించి ఊటలా, ఉప్పెనలా, మధురాసవ ప్రళయంలా, ప్రభంజనంలా పొంగులువారి వచ్చే ఆనంద సంద్రం వారి అంతరదృష్టి, అంతర సృష్టి యావత్తును తేజోద్రవ రాసీభూతం చేస్తుంది. ఏకం చేస్తుంది. ఇది అంబర చుంబితం కూడా కాదు. అంబరార్ణవాలనూ ఏకరాసిగా సమ్మిశ్రితం చేసిన ఆనంద రసప్లావితం. రెండో వస్తువు లేని, రెండో పదార్థం లేని అది... అదే. అదేదో... ఔను. అదే 'ఇది కాదు ఇది కాదు' అని నిరాకరిస్తూ వెళ్లిన సాధకుణ్ని, శోధకుణ్ని, అతని వివేకాన్ని చివరకు మిగిలిందేదో చెప్పేందుక్కూడా మిగలనివ్వని, మిగలని...! ఏమది? అదే... సాధకుడు ఏ స్థాయికి, ఏ స్థానానికి వెళ్లాలని సాధన ప్రయాణం ప్రారంభించాడో, ఎందుకోసం ప్రపంచాన్నే తృణీకరించి, వీపు చూపించి వెళ్లిపోతున్నాడో, మనసెన్నుకున్న మరో ప్రపంచం కోసం అర్రులు చాస్తున్నాడో అదే... ఆ అనన్యత. ఆ ఏకాత్మానుభూతి. ఆత్మానుసంధానం. ఇది అనుభవంతో రానిది. అనుభవం కానిది. అనుభవానికి సంబంధం లేనిది. అందుకే అష్టావక్రమహర్షి గుర్రం రెండో రికాబులో రెండో కాలు పెట్టేంత సమయంలోనే శిష్యుడికి దైవానుభూతి కలిగిస్తానన్నాడు. కలిగించాడు కూడా. అనుభవంతో పొందలేనిదాని కోసం అనుభవ పరంపర అయిన పూజాదికాలు, యజ్ఞయాగాదులు, జపధ్యానాదులు...! నిజమే. ధ్యానం కూడా ఒక కర్మ. ఒక అనుభవం. నిజమే. ఈ అన్నింటి ద్వారా పవిత్రతా క్రమంలో, సాధన తీవ్రతా క్రమంలో ఫలితాల పేర్పు మనసును అనుభూతికి ఆయత్తం చేస్తుంది. అనుమతిస్తుంది. పువ్వు వికసించి పరిమళించేది క్షణాల్లోనే. కానీ అందుకు జరిగే ప్రక్రియ... అనుకూల కాలంలో రక్షక పత్రంలో మొగ్గ పొటమరించినప్పటినించి మొగ్గ మల్లెగా విరిసి పరిమళాలు వెదజల్లే వరకు ఎన్ని రోజులని?! ఎన్ని నిరీక్షణా క్షణాలని! ఎన్ని చూపుల శశికిరణ బాణాలని! అష్టాంగ యోగంలోని యోగం ఒకటే. ఫలితం ఒకటే. కానీ అష్ట అంగాల క్రమం- సాధన, శోధన, సోపాన అధిరోహణ! సృష్టి యావత్తూ పరిణామ శీలం.

ఈ అన్నింటి అవసరం ఉన్నప్పుడు ఇక అనుభూతి గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. అనుభూతి పొందటమే. ఆనందించటమే. పాలలో తేనెలా ఫాలాక్షునిలో కలగలసిపోవటమే. వెదుక్కునేందుకైనా, వేరు చేసేందుకైనా... ఏమీ లేదు. ఉండదు. రాజ హంసయినా పాలూ నీళ్ల మిశ్రమంలోంచి పాలను విడదీయగలదుగానీ- పాలు తేనెలను వేరు చేయలేదు. ఆత్మనని గ్రహించి ఆ గ్రాహ్యత పూర్తి అయ్యేలోపలే, ఆ భావాన్ని గ్రహించేంత 'వేరు' భావం కూడా మిగలనంత మమేకం, ఆత్మైక్యం సంభవిస్తుంది!

- చక్కిలం విజయలక్ష్మి