ᐅపరమేశ్వరుడెవ్వడు



పరమేశ్వరుడెవ్వడు? 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆశ్రితవత్సలుడు, అచ్యుతుడు, అనంతుడు అయిన అంతర్యామి పరమేశ్వరుడే! అయితే ఆ పరమేశ్వరుడెవ్వడు? ఎలా ఉంటాడు? ఎప్పుడవతరిస్తాడు? ఎటువంటివారిని తరింపజేస్తాడు? ఆయన దేనికి వశుడు? ఎవరికి ఆప్తుడు?- ఇలాంటి ప్రశ్నలకు విభిన్న దృక్పథాలనుంచి, వివిధ రకాల సమాధానాలు వస్తుంటాయి. ఒక పువ్వును శాస్త్రజ్ఞుడు, వేదాంతి, కవి, కళాకారుడు, వేర్వేరు పార్శ్వాలతో అధ్యయనంచేసి వారివారి దృక్కోణాల్లో విశ్లేషిస్తుంటారు, వర్ణిస్తుంటారు. అలాగే పరమేశ్వరుణ్నీ భక్తులు, యోగులు, మహర్షులు, పౌరాణికులు, ఆర్తులు, విరాగులు తమ తమ ఆలోచనల పరిధినిబట్టి వర్ణిస్తుంటారు.
ఒకటి మాత్రం వాస్తవం. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు. వర్ణనాతీతుడు. అందుకే దైవజ్ఞులు 'నేతినేతి' (న+ఇతి) అని చెబుతారు. ఇది కాదు, ఇదే కాదు, ఇంకా ఏదోఉంది, ఎక్కడోఉంది, ఎలాగోఉంది- అదే భగవతత్వం. ఆ అవ్యక్తతత్వాన్ని వర్ణించయత్నించి, కీర్తించ ప్రయత్నించి అలసిపోయారు అందరూ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థులు, జ్ఞానులు అందరూ అలసిపోయారు. అలసిపోయినా వారి ప్రయత్నం, అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అదే ఇష్టం పరమాత్మకు. ఆ కౌతుకత, ఆతురత, తపన కలిగిన భక్తులనే ప్రేమిస్తాడు పరమాత్మ. సాధకుడు గమ్యం చేరకపోయినా, లక్ష్యం సాధించలేకపోయినా, సత్యాన్వేషణ చేస్తూ పోతుంటేచాలు- ఆ కృషిలో అలసటను ఏ మాత్రం గుర్తించలేకపోతే చాలు, అటువంటి సాధకుడంటే పరమేశ్వరుడికెంతో ప్రీతి. ఎందుకంటే- కృషి, దీక్ష, ఆత్మవిశ్వాసం కలిగిన సాధకుడికి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.

ప్రతి అవతారానికీ వేదాల్లో ఒక వర్ణన ఉంది. 'ఈ అవతార పురుషుడు ఫలానా స్థలంలో, ఫలానా రూపంలో అవతరిస్తాడు, ఇలా వ్యవహరిస్తాడు' అని. ఇది వేదం అభివర్ణించే పద్ధతి. భగవంతుడు సర్వత్రా పరివ్యాప్తమై ఉన్నాడు. అణువణువులోనూ నిక్షిప్తమై ఉన్నాడు. అటువంటప్పుడు ప్రతిమనిషి అంతరాత్మలో పరమాత్మ ఉన్నాడనేగా అర్థం!

మనం మన తృప్తికోసం, నిత్యమూ చలించే ఏకాగ్రత కోసం వేదనను, ఆవేదనను చల్లార్చుకొని, కొంతసేపు వూరట చెందటం కోసం, 'కలడు కలండనెడివాడు కలడో లేడో' అన్న సంకుచితమైన సందేహాన్ని దూరంగా ఉంచటంకోసం కాసేపు ఏ బొమ్మనో, చిత్రాన్నో చూసుకుంటాం. వ్రతమో చేసుకుంటాం. దర్శనమో, యాత్రో సంకల్పించుకుంటాం. పద్యమో, పురాణమో పఠించుకుంటాం. పరమేశ్వరుడెవడంటే మనమెలా చెప్పగలం? మహామహులకే సమాధానం చెప్పడం సాధ్యంకాలేదు. కాకపోతే, సామాన్యులకు అందుబాటయిన స్థాయిలో విశ్లేషించుకోవాలంటే- మంచితనానికి మరోపేరే పరమేశ్వరుడు. సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, నిస్వార్థం, నైర్మల్యం, సేవాభావం వంటి సద్గుణాలే పరమేశ్వరుడికి ప్రతీకలు. ఈ సుగుణాలను మన హృదయంలోకి, మన జీవితంలోకి ఆహ్వానించి, ఆచరణలో పెడితే పరమేశ్వరుణ్ని తెలుసుకోవడంలో కొంత సాఫల్యం లభించినట్లే. మంచికీ చెడుకూ తేడా తెలీని పశువులు చేసే తప్పులను, అన్నీ తెలిసిన మానవులు మానవీయ విలువల్ని మరచి చేస్తూ కావాలని పశుత్వానికి వశులైపోవడం ఎంత శోచనీయం! ఎదుటివాడిమీద ఆక్రమణచేసి దోచుకుని దాచుకునే బుద్ధి నేటికీ అలాగే కనబడుతోందంటే- వేల ఏళ్లనాటి ఆటవికత ప్రత్యక్షంగా పునరావృతం అవుతున్నట్లేకదా! ఇది వాంఛనీయమా? అనుసరణీయమా?

ఈ జగత్తంతా ఈశావాస్యం. మానవులంతా భగవత్ స్వరూపులే. మానవుడి శరీరంలోని జీవుడు, ఈశ్వరుడు వేర్వేరు కాదు. ఆత్మ, పరమాత్మలు అవిభాజ్యాలు. ఈ వాస్తవాన్ని ఉపనిషత్తులోని వాక్యాలెన్నో నిరూపిస్తున్నాయి. మన్ను ఒకటే, భాండాలెన్నో. సువర్ణం ఒక్కటే, ఆభరణాలెన్నెన్నో! అలాగే దేవుడొక్కడే, లీలలు మాత్రం అనంతం! మనిషిలోని మంచితనమే మానవత్వం. ఆ మానవత్వమే దైవత్వానికి ప్రతిరూపం. అంటే పరమేశ్వరతత్వం మనిషి మనిషిలోనూ ఉందని భావం. ఈ యథార్థాన్ని గ్రహించి ఎదుటి మనిషిలో ఈశ్వరుణ్ని దర్శించే సంస్కారం పెంచుకుంటే విశ్వమంతా సుఖశాంతులతో విరాజిల్లుతుంది. అప్పుడు 'పరమేశ్వరుడెవ్వడు?' అన్న ప్రశ్నే ఉదయించదు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి