ᐅఆత్మానుభూతి



ఆత్మానుభూతి 

కైలాస పర్వతంపైన తపస్సు చేస్తున్నాడు పరమశివుడు. మంచుకొండల మీదుగా తుళ్లింతలాడుతూ మందాకిని కిందికి దూకుతోంది- శివుడి పక్కనే. ఆ చల్లని నీటి తుంపరలు ఉడుతాభక్తిగా సేవలు అందిస్తూ ఆయన పాదాల చెంతనే రాలిపోతున్నాయి. శివుడికి తపోభంగం కలగకుండా పార్వతీదేవి పూలను సేకరించి పూజకు సిద్ధం చేస్తున్నది. దోసిట నిండిన పూలతో శివుడి సన్నిధి చేరింది పార్వతీదేవి. అరమోడ్పు కంటికొసలో ఆమె రూపం ప్రతిబింబించగానే శివుడు కళ్లు తెరిచాడు. పూలతో నిండిన దోసిలిని ముందుకు చాచి మన్మథుని చాపంలా వంగింది పార్వతీదేవి. పక్కనే పొదరింట మాటువేసిన కామదేవుడు వెంటనే విల్లు వంచి బాణం సంధించాడు. పూలందుకోవటానికి అదే క్షణంలో ముక్కంటి కూడా కాస్త వంగాడు. పూలబాణం పరమశివుడి ఎదను తాకింది. పార్వతీదేవి పూల దోసిలిని శివదేవుడు తన దోసిట్లో చేర్చుకున్నాడు. ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి అందంతో నిటలాక్షుడి కన్ను చెదిరింది. మనసు చంచలించింది. ఒక్క క్షణం ఆలోచించాడు. విక్షేపానికి కారణం? పొదచాటున నవ్వుతూ కనిపించాడు మన్మథుడు. త్రినేత్రుడి మూడో కన్ను తెరుచుకున్నది. సిగ్గుతో తలవంచుకున్న పార్వతీదేవి దిగ్గున లేచింది. శివుడి కోపాగ్నికి కాముడు కాలి బూడిదయ్యాడు. తపోభంగం కాగానే శివుడు వెళ్లిపోయాడు. వెండికొండ వెలవెలపోయింది. పార్వతీదేవి కంట దుఃఖాశ్రువులు జలజల రాలాయి. కామదహనం ఒక పౌరాణిక గాథ. పామరులకోసం అల్లిన ఒక కథ.
పురాణాలు వేదార్థ ప్రతిపాదకాలు. కథారూపంలో ఏదో ఒక గూఢార్థం చెప్పటమే వాటి ధ్యేయం. జీవిత గమ్యం తెలుసుకుని ముందుకు సాగాలంటే కొన్ని ప్రతిబంధకాలు తప్పవు. అవి తొలగించుకోవటం ఎలాగో శివుడే నేర్పాడు. కామం అంటే కోరిక. కాముడు అంటే మన్మథుడు. కోరికకు ప్రతిరూపం మాటువేసి కాటు వేసే మనస్తత్వం. వూరించి వూబిలోకి లాగే నేర్పరితనం ఉన్న వ్యక్తిని ప్రియమైన శత్రువు అంటారు. కోరికలే మనిషి పాలిట ప్రియమైన శత్రువు అంటే తప్పు కాదు. అంతులేని జననమరణ కాలచక్రం నుంచి బయటపడటానికి జీవాత్మకు ఉన్నదల్లా ఒకేఒక మార్గం. కామరూపుడైన ప్రియశత్రువును (కోరికను) జయించటం.

శత్రు విజయం సాధించటానికి ముందుగా శత్రుస్థావరాలు కనిపెట్టాలి. కోరిక లీరికలెత్తి మనిషిని పతనంవైపు తరలించే పద్నాలుగు శత్రుస్థావరాలు మనిషి చుట్టూ, బయట లోపల ఉన్నాయి. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు- వెరసి పద్నాలుగు. స్థూలంగా వీటిని శరీరం, ఇంద్రియాలు, మనసు (త్రికరణాలు) అని మూడు భాగాలుగా విడదీయవచ్చు. కరణం అంటే ఉపకరణం లేక పరికరం. ఈ మూడు పనిముట్లను తెలివిగా వాడుకోగలిగితే ప్రియమైన శత్రువును జయించటం అసాధ్యం కాదు. శరీర, ఇంద్రియ, మనోనియతి ద్వారా శత్రుస్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. నియతి అంటే నియంత్రణ. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును అదుపుచేయటం. పావన రూపాలను దర్శించటంవల్ల, మంచిమాటలు వినటంవల్ల, సువాసనలు ఆఘ్రాణించటంవల్ల, సురుచులు ఆస్వాదించటంవల్ల, సద్వస్తు స్పర్శనంవల్ల ఇంద్రియ నియతి సాధించవచ్చు. పాదాలను పవిత్రస్థలాల్లో సంచరింపజేస్తూ, చేతులను పుణ్యకార్యాలకు ఉపయోగిస్తూ, నోట మంచిమాటలు వల్లిస్తూ, శరీరాన్ని నియంత్రించవచ్చు.

సాధన చేయటంవల్ల కొంతకాలానికి సద్వస్తు సద్భావ సంగమం శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు స్వాభావికం అవుతాయి. కోరికలకు దూరమవుతూ సత్యంవైపు మొగ్గుచూపుతాడు మానవుడు. శత్రు విజయం సాధించి, నిత్యానంద ఆత్మానుభూతి పొందటమే జీవుడి చరమగమ్యం. జీవన్ముక్తుడని, భాగవతుడని, అతివర్ణాశ్రముడని, స్థితప్రజ్ఞుడని మనం చెప్పుకొనేవాళ్లందరూ- పరిణతి చెందిన పరిపూర్ణ మానవోత్తములు. కామశత్రువును జయించిన ప్రతి జీవుడూ శివుడంతటివాడు అంటే, తప్పు కాదు.

- వి.రాఘవేంద్రరావు