ᐅమాటే మంత్రం
ᐅమాటే మంత్రం
దేవుడు మనిషికి మనసునిచ్చాడు. మనిషి భాషను పెంపొందించుకున్నాడు. తన భావాల్ని వ్యక్తం చేయటానికి ఆ భాష చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, భావాలు బాగుండనప్పుడు మాటలూ బాగుండవు. మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించేవి ఆ మాటలే!
ఎవరికీ నచ్చనివి...
నీకేమీ చేతకాదు
నీవల్ల ఎవరికీ ప్రయోజనం లేదు.
నువ్వెవరి గురించీ ఒక్క మంచిమాటా అనవు.
నీలాంటి అహంకారి ఎక్కడా ఉండడు.
నువ్వెవరి మాటా వినిపించుకోవు.
నీకెవరి మీదా గౌరవంలేదు.
నువ్వొస్తే నీ వెంటనే ఉంటుంది అశాంతి.
ఎవరి కష్టనష్టాలూ నీకు పట్టవు.
నీమాటే కయ్యానికి కాలు దువ్వినట్టుంటుంది.
నీకు మాట తీరు తెలీదు.
నీకింత అసహనం పనికిరాదు.
నువ్వెవరి మంచినీ గుర్తించవు.
నీముందు నోరు విప్పాలంటే భయం.
నీకెవ్వరి పొడా గిట్టదు.
నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు.
(ఇలా అనేవారి మాటలు విషతుల్యమైతే... ఆ మాటలు వినేవారి మనసు చేదెక్కిపోదా!)
దేవుడు కూడా మెచ్చేవి...
నువ్వెంత మంచివాడివి!
నీ మాటంటే అందరికీ గురి.
నువ్వేం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది.
నువ్వొస్తే చాలు ఆనందాన్ని వెంట తెస్తావు.
నీచెంత గంటలైనా క్షణాలే.
పట్టువిడుపులే నీ తత్వం; నీ అంత ఓర్పు నాకు లేదు.
నాదే తప్పు. నిన్ను అపార్థం చేసుకున్నా.
నిన్ను నొప్పించానేమో- నన్ను క్షమించు.
నీకు నేను ఉపయోగపడటం నా అదృష్టం.
నీ ప్రేమ ఎన్నటికీ తరగనిది.
ఒకరిని ప్రేమించటం నిన్ను చూసే నేర్చుకున్నా.
ఒకరికి సాయపడటంలో ఎంత ఆనందముంది!
నీలాంటి మిత్రుడుండటం నిజంగా ఒక వరం!
ఆ దేవుడు నీలాంటి వాడిలోనే ఉన్నాడు!
(ఇలా అనేవాడి మాటలు అమృతమైనప్పుడు ఆ మాటలు వినేవాడి మనసు రాగధారలొలికించదా!)
- తటవర్తి రామచంద్రరావు