ᐅసేవా పరిమళం
ఏ విధమైన ప్రతిఫలాన్నీ ఆశించకుండా చేసే పనిని 'సేవ' అంటారు. త్యాగబుద్ధితో కూడిన అటువంటి సేవాభావమే ధర్మమవుతుంది. ఇది వినటానికి తేలిగ్గా అనిపించినా ఆచరణలో అంత సులభ సాధ్యమేమీ కాదు! అసలు ఈ సేవ అనేది మాటలకు కాదు- చేతలకు సంబంధించింది. నిర్మలమైన మనసు ఉంటేనే సేవ చెయ్యగలుగుతారు.
మంచి మనసుతో సేవించడం వల్ల భగవంతుడికి ఆనందం కలుగుతుంది, కరుణ ప్రసరిస్తుంది. సేవ అనేది మానసికం, వాచికం, కాయికం అని మూడు విధాలుగా ఉంటుంది. అనుక్షణం భగవంతుని దివ్యమంగళరూపాన్ని తలచుకోవడమే 'మానసిక సేవ'. ఎల్లప్పుడూ తదేక దృష్టితో భగవంతుడి నామాన్ని జపించటం వాచికసేవ. ఇక మూడోది కాయిక సేవ. పరమాత్మ మనకు దొరకడు కదా! మరి... మాధవసేవను ఎలా చెయ్యాలి? మానవసేవ చేస్తే మాధవసేవ చేసిన ఫలం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
కష్టాల్లో ఉన్న తోటి మానవులకు సహాయం చేస్తూ, వారి కన్నీళ్లు తుడుస్తూ, వారి మనసుల్లో మంచి ముత్యాల వానలు కురిపించటం... రోగాలతో కునారిల్లుతున్న దీనులకు సపర్యలు చేస్తూ వారికి జీవితం మీద రోతపోయి కొత్త ఆశలు చిగురించేటట్లు చెయ్యటం- ఇవన్నీ కూడా మానవసేవ కిందకే వస్తాయి. ఈ లోకంలో సర్వతీర్థ స్వరూపిణి తల్లి... సమస్త దేవతా స్వరూపుడు తండ్రి. కాబట్టి వారిద్దరినీ నిత్యం భక్తితో సేవించినట్లయితే నూరు యాగాలు చేసిన ఫలం దక్కుతుందని, గంగానదీ స్నానం చేసినప్పుడు కలిగే మహాపుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ఉశీనరుడి కొడుకైన శిబిచక్రవర్తి శరణాగత రక్షణకు, సేవాధర్మానికీ పెట్టింది పేరు. ఒకరోజు తనను ఆహారంగా తినటానికి వెంటపడుతోందని డేగను చూసి భయపడిన పావురం శిబి చక్రవర్తి దగ్గరకొచ్చి తనను కాపాడమని వేడుకుంది. చక్రవర్తిగా ప్రజలకు సేవ చెయ్యటం, వాళ్లను కాపాడటం తన ధర్మం కనుక ఆ పావురం అభ్యర్థనను మన్నించి దానికి అభయమిచ్చాడు. మరుక్షణంలోనే డేగ కూడా ఎగురుకుంటూ వచ్చి చక్రవర్తి ముందు వాలింది.
'ప్రభూ! ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ పావురం నాకు ఆహారం. కాబట్టి దీన్ని నాకు ఇవ్వండి!' అని డేగ శిబిని ప్రార్థించింది.
వెంటనే శిబి 'పక్షిరాజా! నువ్వు చెప్పింది యథార్థమే... కాదనను. కానీ, ఇంతకుముందే నేను ఈ పావురానికి అభయమిచ్చాను. అందువల్ల దీన్ని నీకు అప్పగించలేను!' అని కరాఖండిగా చెప్పాడు.
'ప్రభూ! అయితే... ఈ పావురం మాంసానికి సరితూగే మాంసాన్ని నాకిచ్చినట్లయితే దీన్ని నేను వదిలేస్తాను' అంది డేగ. అప్పుడు శిబి ఒక త్రాసు తెప్పించి దానికి ఒకవైపు పావురాన్ని ఉంచి, మరోవైపు ఆయన తన మాంసాన్ని కోసి పెట్టాడు. కానీ... ఎంతకీ శిబి మాంసం పావురం బరువుకు సరితూగలేదు. చివరికి శిబి స్వయంగా తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణకు సిద్ధమయ్యాడు. ఇది ఆ చక్రవర్తి అమలిన సేవాభావానికి దర్పణం.
రావణుడు అపహరించిన సీతాదేవిని వెదుకుతూ తన కుటీరానికొచ్చిన శ్రీరాముడికి ఎంగిలిపళ్లు పెట్టేటప్పుడు వణికిన ముసలి శబరి చేతులు, సీతాపహరణ వార్తను అందించటానికి రెక్కలు తెగిపడిపోయి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జటాయువు ఎదురుచూపులు-అవ్యాజమైన సేవాధర్మానికి సురుచిర సంకేతాలు.
మానవసేవ మధుర పరిమళం లాంటిది. అది అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగిస్తుంది. అందుకే... నిష్కల్మషమైన ప్రేమతో చేసే మానవసేవ తప్పకుండా మాధవసేవ అవుతుందని గ్రహించాలి!
- డి. శ్రీనివాస దీక్షితులు