ᐅపవిత్రత
పవిత్రత మనిషి జీవన్ముక్తికి సాధనం. మానవులకు ఎటువంటి పవిత్రత అవసరం? అది ఎలా పొందగలం? మనిషి తాను ఆచరించే ప్రతి విషయంలోనూ అడుగడుగునా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. తనను తాను ప్రశ్నించుకొనే సామర్థ్యం కలిగిందంటే మంచి, చెడులను గుర్తించే శక్తి పొందినట్లే. ప్రతిరోజూ తాను చేస్తున్న పనులు ఎంతవరకు పవిత్రమైనవో బేరీజు వేసుకోవాలి. ప్రకృతి, ఆచరణ, మనోభావాలు మనిషిని ఎప్పుడూ అపవిత్రుణ్ని చేయడానికి యత్నిస్తూనే ఉంటాయి. భగవంతుని సేవ చేసినప్పుడే మనిషికి పవిత్రత చేకూరుతుంది. ప్రతిక్షణం చీకటినుంచి వెలుగు వైపు, అసత్యాన్నుంచి సత్యం వైపు, మృత్యువునుంచి అమృతం వైపు పయనిస్తూ ఉండాలి.
ఎన్నిసార్లు మనం స్నానం చేసినప్పటికీ మరునాడు సహజంగానే శరీరం మలినమై పోతుంది. మనం వేసుకొన్న దుస్తులు కొంతసేపటికే మురికిగా మారతాయి. మనం వాడే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోకపోతే నల్లగా తయారవుతాయి. ఇవన్నీ ఒక ఎత్త్తెతే, మనోమాలిన్యాన్ని కడిగేయడమన్నది మరొక ఎత్తు. బాహ్య ప్రపంచంలో పవిత్రత వేరు, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవటం వేరు. బయటికి తియ్యగా మాట్లాడుతూ, అందంగా కనిపిస్తూ- మనసులో మోసగించాలనే భావం ఉంటే... అది పవిత్రత కాదు.
ఏదైనా వస్తువు తిన్నప్పుడు, దానివల్ల మనకు అనారోగ్యం కలుగుతుందనిపిస్తే ఆ వస్తువును తినటం మానేస్తాం. అదెంత మంచి వస్తువైనా కావచ్చు. అలాగే మన అంతఃకరణను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏయే విషయాలను నియంత్రణలో పెట్టుకోవాలనేది ఆలోచించాలి. మనల్ని ప్రభావితం చేస్తున్న కోరికలను జయించాలి. జీవితాల్ని నియమబద్ధం చేసుకోవాలి. కోపాన్ని మన చెంతకు రానీయకుండా ప్రయత్నించాలి. వస్తువులపై వ్యామోహం, లోభత్వం పొందకుండా నడచుకోవాలి. సంసార జీవితంలో మనుగడ సాగిస్తూనే మన ధర్మాలను పాటించాలి.
పవిత్రతను సాధించడానికి సర్వ సంగ పరిత్యాగి కానవసరం లేదు. సర్వసంగ పరిత్యాగులకు సైతం ఒక్కోసారి కోర్కెలు పుడుతుంటాయి. నారదుడు అనుక్షణం నారాయణ నామస్మరణలో గడుపుతూనే ఓసారి సంసార జీవితాన్ని గడపాలనుకొని మహావిష్ణు మాయ వల్ల- పెళ్ళి, పిల్లలు కలిగి, కల్పన లోకంలో విహరించి తిరిగి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడని పురాణ కథ ప్రచారంలో ఉంది. శంకరాచార్యులు సంసారజీవనం గురించి వాదించే ముందు దాన్ని తెలుసుకొని, ఆ తరవాత వాదంలోకి దిగి గెలిచినట్లు చెబుతారు.
శివుడికి పరమభక్తుడైన రావణాసురుడు స్త్రీ వ్యామోహం వల్ల రాక్షసుడయ్యాడు. పవిత్రత కొరవడి తప్పటడుగులు వేయకుండా మనిషి జీవించాలి. తెలియక చేసిన తప్పును సరిదిద్దుకొని, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి. అలా తన జీవితాన్ని మలచుకొంటూ ఏది మంచి, ఏది చెడు అనే భేదాన్ని గమనించి నడచుకోవాలి. అలా పవిత్రత సాధించడానికి నిరంతరం ధర్మం, సత్యం తప్పక ఆచరించాలి. అందుకోసం అంతర్యామి అయిన భగవంతుని ఆరాధించాలి.
డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ