ᐅమంచిని పెంచు



మంచిని పెంచు 

ప్రతిమనిషిలోను మంచి, చెడు స్వభావాలు రెండూ ఉంటాయి. మంచి దైవస్వభావమైతే, చెడు రాక్షస స్వభావం. మంచి బలపడితే బంధనాలనుంచి, బాధలనుంచి విముక్తి కలుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది. చెడు బలపడితే బంధనాలు మరింతగా పెరుగుతాయి. జీవితం దుఃఖభూయిష్ఠం, పరాధీనం అవుతుంది.
ఈ భావ (పాజిటివ్), అభావ (నెగెటివ్) ప్రకృతులు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. అన్నిచోట్లా ఉంటాయి. అన్నివేళలా ఉంటాయి. ఎటువంటి కఠిన భయంకర బాధాకర పరిస్థితుల్లోనైనా మంచి అన్నది కొంచెమైనా దాగి ఉంటుంది. భయంకరమైన భూకంపాలు, తుపానులు, ప్రమాదాలు సంభవించినప్పుడు మనకు సంబంధంలేనివారు, మనకేమీ కానివారు అక్కడికి హఠాత్తుగా వచ్చి తమ ఇబ్బందుల్ని లెక్కచేయకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగేది- ఆ మంచివల్లనే! అదే సమయంలో దుష్టప్రకృతి కలిగినవాళ్లు బాధితుల్ని దోచుకోవటమూ మనం వింటుంటాం. వీళ్లు దొంగచాటుగా చేస్తే, మంచి తలపెట్టినవారు బహిరంగంగా ధైర్యంగా చేస్తారు.

అంటే, ఒకే సమయంలో భావ అభావ ప్రకృతుల ప్రభావం ఉన్నప్పుడు- మనిషిలో దేవరాక్షస ప్రవృత్తులు కలగలిసి ఉండటం తప్పదు. పరిస్థితులు, వాతావరణం, స్నేహాలు మారితే వాటి ప్రభావం తప్పక మారుతుంది. ఈ విషయంలో మంచీ చెడూ ఒక్కలాగానే ప్రభావితమవుతాయి. చెడు సావాసాలతో సంఘవిద్రోహులుగా మారేవాళ్లున్న సమాజంలోనే, మంచి స్నేహాలతో సేవా కార్యక్రమాలు చేపట్టే వారుండటమూ జరుగుతోంది.

సాధుజనుల సంపర్కంవల్ల, సత్సాంగత్యంవల్ల ఆధ్యాత్మిక చింతన కలిగినవారికి అభావశక్తి క్రమంగా తగ్గి భావశక్తి పెరుగుతుంది. అందువల్లనే భావశక్తి భరితులు తమ శత్రువుల్లోనూ మంచి భావనకోసం వెతుకుతారేకాని, చెడును పట్టించుకోరు. క్రమంగా వారు అజాత శత్రువులవుతారు.

పొంగివచ్చే మంచిని చెడు భరించలేదేమోకాని... ఎంత చెడునైనా మంచి జీర్ణించుకోగలుగుతుంది. అందుకనే, ఆటంకవాదుల బీభత్సంతో కలతబారుతున్న వాతావరణంలో మరింతమంది హింసావాదులు తయారవటంకన్నా- బాధితుల్ని ప్రాణాలొడ్డి రక్షించేవారు, హింసా దృక్పథాన్ని మాన్పించాలని పాటుపడేవారు పదింతలు పెరుగుతున్నారు. సహనంతో వారిని సంస్కరించటానికే కృతకృత్యులవుతున్నారు. లేకపోతే, ఈ సమాజం, ప్రపంచం ఎప్పుడో అంతమై ఉండేవి.

కోపానికి మరింత కోప్పడటం విరుగుడు కాదు. కోపాన్ని విరచగలిగేది ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఏ వ్యక్తి సంపూర్తిగా దైవసేవలో నిమగ్నుడవుతాడో అతడిలో తేజస్సు ఉత్పన్నమవుతుంది. ఆ తేజస్సు అక్కడి వాతావరణాన్ని పునీతం చేస్తుంది. అక్కడికి అడుగుపెట్టిన ప్రతి మనిషిపైనా తన ప్రభావాన్ని చూపుతుంది. మిగిలివున్న చెడును కడిగేస్తుంది.

'ప్రపంచంలో ఎన్నో ఘోరాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. వాటికి మనం బాధ్యులం కానప్పుడు వాటితో మనకు ప్రమేయమేముంది' అని అనుకోవటం మంచి లక్షణం కాదు. దరిద్రుల్ని ఉద్ధరించేవాళ్లు, అనాథల్ని ఆదుకునేవాళ్లు, సమాజాన్ని సంస్కరించేవాళ్లు, వాతావరణాన్ని కాలుష్యంనుంచి రక్షించేవాళ్లు, తమ కష్టనష్టాలను పట్టించుకోకుండా న్యాయపోరాటం చేసేవారు మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు. వారిలా గొప్పగా అంకితభావంతో పాటుపడలేకపోయినా వారిని గుర్తించి గౌరవించటం, వీలైనచోట వారిలా మంచిని పెంచటం ప్రతి నాగరికుడి కర్తవ్యం!

- తటవర్తి రామచంద్రరావు