ᐅనిదానమే ప్రధానం



నిదానమే ప్రధానం 

ఒక పని చేయాలని అనుకొన్న వెంటనే గబగబా దాన్ని ప్రారంభించేయడం సరైన పద్ధతి కాదు. నిదానంగా చేయాలి. అంటే, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా తాపీగా చేయాలని దాని అర్థం. అందుకే పని ప్రారంభించేటప్పుడు అది చేయతగినదా కాదా అని ముందుగా ఆలోచించాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించాలి. తొందరపాటు తగదు. తొందరపడితే మనోనిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రమాదం రావచ్చు. ఆపద కలగవచ్చు. ఆలోచించి చేస్తే ఆపదలు రావడానికి అవకాశం ఉండదు. నిదానమే ప్రధానమని పెద్దలందుకే అంటారు.
పచ్చికాయలను తెచ్చి మగ్గబెడితే అవి పళ్లుకావు, సరికదా- తినడానికి వీల్లేకుండా కుళ్ళిపోతాయి. అందుచేత ఏ పనినైనా తొందరపడి చేసినా, తొందరగా ఫలితం చేతికి అందాలనే ఆత్రంతో చేసినా- ఫలం దక్కదని చెప్పే వేమన వాక్కు సర్వులకూ శిరోధార్యం.

అలనాడు కౌరవపాండవులు సమీప భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర పోరాటానికి ఒకవైపు సంధి ప్రయత్నాలకు రాయబారాలు నడుపుతూనే మరోవైపు సైన్య సమీకరణ చేసుకోసాగారు. ఆ సందర్భంగా మద్ర దేశాధీశుడు, నకుల సహదేవుల మేనమామ అయిన శల్యుడు ధర్మరాజు కోరగా తన అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని ఉపప్లావ్యంలో ఉన్న పాండవులను చేరేందుకు బయలుదేరాడు. ఈ సంగతి తెలుసుకొన్న దుర్యోధనుడు శల్యుణ్ని తనవైపు తిప్పుకోవాలన్న దురూహతో మార్గమధ్యంలో అతనికి సకల మర్యాదలూ చేశాడు. దుర్యోధనుడి ఔదార్యానికి సంబరపడిన శల్యుడు వరం కోరుకొమ్మన్నాడు. అదనుకోసం ఎదురుచూస్తున్న దుర్యోధనుడు వెంటనే కౌరవ సైన్యానికి సర్వాధిపత్యం వహించమని శల్యుణ్ని కోరుకున్నాడు. అప్పటికిగాని తాను చేసిన తప్పు ఏమిటో తెలిసిరాలేదు శల్యుడికి. తాను సైన్యంతో ఎక్కడికి, ఎందుకు బయలుదేరి వెళ్తున్నాడు అనే విషయాన్ని ఒక్కక్షణం నిదానంగా ఆలోచించలేకపోయాడు. నిగ్రహం కోల్పోయాడు. తొందరపడి వరం కోరుకొమ్మన్నాడు. ఫలితంగా కౌరవపక్షంలో చేరాల్సివచ్చినందుకు ఎంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. బాధపడ్డాడు.

మొక్క నాటిన కొద్దిరోజుల్లోనే అది పెద్దమానుగా ఎదిగిపోయి పండ్లను ఇవ్వాలన్న తొందరపాటు కోరికతో కడవలకొద్దీ నీళ్ళు గుమ్మరిస్తూ పోతే- ఆ మొక్క చెట్టుగా ఎదగదు. ఫలాలనుఇవ్వడం మాట అటుంచి కొద్దిరోజుల్లోనే వాడిపోయి చచ్చిపోతుందని హెచ్చరించిన కబీరుదాసు హితవచనాన్ని మరిచిపోలేం.

తొందరపాటుతో చేసిన పని మనల్ని చిక్కుల్లో పడదోసి ఫలితం దక్కకుండా చేస్తుంది. దుఃఖంలో ముంచేస్తుంది. అందుచేత ఒక కార్యాన్ని చేయాలని సంకల్పించినప్పుడు దాని పూర్వాపరాలను తెలుసుకొని బాగా ఆలోచించి ఆ తరవాతనే ఆ కార్యానికి శ్రీకారం చుట్టాలని పెద్దలంటారు. అప్పుడే కోరుకున్న ఫలం చేతికి చిక్కి మనకు ఆనందం దక్కుతుంది.

కాలిపు వీరభద్రుడు