ᐅఈ క్షణం... అమృతబిందువు



ఈ క్షణం... అమృతబిందువు 

ఈ మధ్య చాలామంది 'ఈ క్షణం' గురించి మాట్లాడుతున్నారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకునే ఉత్సాహంతో అందంగా అనుభవించేయాలనే ఆత్రుతతో ముందుకెళ్లిపోతున్నారు. అయితే... ముందుకా, వెనక్కా?
ఈ క్షణం! దీనికున్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. నిజమే, ఈ క్షణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని, దాని ప్రాధాన్యం గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగితే చాలా బావుంటుంది. మరి ఎలా వినియోగించుకోవాలి? ఎలా వినియోగించుకుంటున్నాం? కేవలం అనుభవించేందుకు మాత్రమే, మరి భవిష్యత్తే లేదనే భయంతో మాత్రమే ఈ క్షణాన్ని వినియోగించుకోవాలా? రుషుల అభిప్రాయం అదికాదు. విజ్ఞుల భావనా అదికాదు. వినియోగించుకుంటున్నది ఈ క్షణాన్నే అయినా దాని ప్రయోజనం భవిష్యత్తే. ఈ క్షణపు సద్వినియోగమే రేపటి సౌభాగ్యానికి పునాది వేస్తుంది. ఆధునిక జీవితం మితిమీరిన సౌకర్యాలకు ఆలవాలమై ఉంది. దాన్ని అనుభవించటమే ఈ క్షణాన్ని సద్వినియోగపరచుకోవటం అని సగటు ఆధునిక మానవుడు భావిస్తున్నాడు. పెద్దలనుబట్టి పిల్లలూ ఆ భావానికి అలవాటు పడుతున్నారు. బాగా గమనిస్తే మనం నిత్య జీవితంలో చేసే ప్రతిపనీ ఆ క్షణపు అనుభవానికి మాత్రం కాదు. రాబోయే క్షణాలకు, దినాలకు, సుదీర్ఘ భవిష్యత్ ప్రయోజనాలకు.

మితిమీరిన భోగభాగ్యాలతో అంతులేని అర్థంలేని సౌకర్యాలతో తులతూగే దేశాల్లో వ్యాధులు ప్రబలి ఎప్పుడు ఏ క్షణంలో మరణిస్తామోననే భయంతో ఎందరో ప్రతి క్షణాన్నీ భోగాలను అనుభవించేందుకే వినియోగిస్తుంటారు. ఇంత భయంతో కేవలం భోగలాలసల తోడిదే జీవితం అనేంత ఆబగా జీవించటం అవసరమా? అతిగా తిని అజీర్ణ వ్యాధి పాలుకావటం కంటే నియమిత సాత్వికాహారం, ఉపవాస వ్రతం... ఆరోగ్యానికి, ఆయుష్షుకు ఎంత భరోసా! ప్రతి విషయంలోనూ ఈ సూత్రమే వర్తిస్తుంది. ప్రతి క్షణాన్నీ ఆనందంగా జీవించాల్సిందే. కానీ, ఆనందానికి నిర్వచనమేమిటన్నది తెలుసుకోవాలి. కావాల్సింది తాత్కాలికానందమా శాశ్వతానందమా అన్నది నిశ్చయించుకోవాలి. భౌతిక సుఖాలు అత్యంత తాత్కాలిక సంతోషాన్నిస్తే ఆధ్యాత్మ సాధనలు భవిష్యత్ ప్రయోజనాలకు ప్రణాళికలుగా, పెట్టుబడిగా ఉపయోగపడతాయి. శాశ్వతానందానికి బాటలు వేస్తాయి. అందుకు ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలి. మనం చేసే ప్రతి పనీ నిరుపయోగంగాకాక లోక కల్యాణ కారకం కావాలి. లోకానికే ప్రేరకం కావాలి. అర్థం చేసుకుంటే లోక కల్యాణంలో వ్యక్తిగత కల్యాణమూ ఉంది. వ్యక్తి కల్యాణంలో లోక శ్రేయమూ ఉంది. అందుకే వ్యక్తి వ్యక్తిగతంగా ఎదగటం, ప్రపంచ ప్రాయోజిత కార్యాలకు సేవలందించటమూ ఏక కాలంలో జరగాలి.

కాలం- నడుస్తున్న అమృత కలశం. ప్రతిక్షణం ఒక అమృత బిందువు. దాన్ని పదుగురి ప్రయోజనంకోసం, అందులో ఇమిడివున్న వ్యక్తి స్వప్రయోజనం కోసమే... వినియోగించాలి. భగవంతుడు మనకొసగిన ఏదీ...మన వ్యక్తిగత కాలంతో సహా... మన ఒక్కరికోసం కాదు. ఈ విశ్వ కుటుంబానికి తండ్రి ఆయన. ఒకరిని అందరికోసం, అందరిని ఒకరికోసం సృజించాడు. మన ప్రతి క్షణాన్ని, మన 'ఈ క్షణాన్ని' అందరి శ్రేయోదాయక కార్యంలో గడపాలి... మనం చేసే ఆధ్యాత్మిక సాధనలతో సహా. అందరి కోసం మనం ఒక్క చేయందిస్తే మనకు అందించేందుకు మనవైపు పదిమంది చేతులు చాస్తారు! ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచం వైపు చాచటానికి మనకు వెయ్యి చేతులు కావాలనిపిస్తుంది. 'ఈ క్షణాన్ని' ఎలా వినియోగించుకోవాలో తెలిసి వస్తుంది!

- చక్కిలం విజయలక్ష్మి