ᐅఆదిగురువు అమ్మ



ఆదిగురువు అమ్మ 

అక్షర అకారం ఓంకార మకారం కలిస్తే అమ్మ. అమ్మ ప్రత్యక్షదైవం. కుటుంబ వ్యవస్థలో తల్లికి ముఖ్యమైన స్థానముంది. ఇది ప్రకృతి నియమం. మాతృమూర్తిగా పిల్లల్ని పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం గురుతర బాధ్యత. అమ్మ ఒడిలోనే బిడ్డలు ఓనమాలు నేర్చుకుంటారు. అందుకే అమ్మను ఆది గురువు అని సంబోధిస్తారు.
ఈ ఆధునిక యుగంలో తల్లికి, పిల్లలకు మధ్య ఒక అగాధం ఏర్పడింది. భార్యాభర్తలిద్దరూ సంపాదించకపోతే సంసారపు బండి సాగని గడ్డుకాలం దాపురించింది. దీని ప్రభావం గృహిణి మీద ఎక్కువగా ఉంటోంది. తల్లులు చందమామను చూపుతూ పిల్లలకు గోరుముద్దలు తినిపించే పరిస్థితి లేదిప్పుడు. చదువుల పేరిట పిల్లలపై ఎడతెగని ఒత్తిడి తేవడానికే వారు పరిమితమవుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక పిల్లలు ఆరోగ్యం కోల్పోయి మానసిక వ్యాధుల పాలవుతున్నారు.

డబ్బే ప్రధానం అనుకుంటే జీవితంలో చాలా పోగొట్టుకోవాలి. పోటీ నానాటికి పెరుగుతున్న ఈ రోజుల్లో చివరికి నిరాశ, నిస్పృహల వాత పడాల్సి రావచ్చు. పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడవచ్చు. ఆత్మబలాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విద్యావిధానంలో మార్పు రావాలి. వినయం లేని విద్య, అర్హతలేని ఉద్యోగం, నీతి, న్యాయం, ధర్మం తప్పిన సంపాదన ప్రమాదకరం. చివరికి అవి దారుణమైన పరిస్థితులకు దారి తీస్తాయి. బట్టీయం చదువులకు స్వస్తిపలికి తల్లులు- సత్యం, అహింస, మానవత్వం, త్యాగం వంటి విలువలును పిల్లలకు నేర్పాలి. ప్రస్తుతం పాఠశాలల్లో నీతి నియమాలు నేర్పే పాఠాలు కరవైపోయాయి. ఆదిగురువు బాధ్యత అందుకే అంతకంతకూ పెరుగుతోంది.

ఆదర్శ మహిళ సతీ మదాలస ఒక మహారాణి. తన పిల్లల్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రాజులుగా తీర్చిదిద్దింది. సంతానానికి ఉగ్గుపాలతో తాత్వికతను నూరిపోసింది. ఆమె లాలిపాట వేదసారమై వారిని అలరించేది. ఆత్మవిజ్ఞానం అన్ని జ్ఞానాలకు మూలం. ఆధ్యాత్మిక విద్య అసలైన విద్య. కొడుకులిద్దరూ లేత వయసులోనే మహాజ్ఞానులై అడవి బాట పట్టారు. మూడో సంతానాన్ని సతీ మదాలస అలాగే తీర్చిదిద్దాలనుకున్నది. కాని, ఆమె భర్త రుతీధ్వజ మహారాజు తన రాజ్యానికి వారసుడు కావాలని పట్టుపడతాడు. భర్త కోరిక ప్రకారం మదాలస అలర్కుడికి రాజనీతి నేర్పిస్తుంది. పెరిగి పెద్దవాడు కాగానే, పట్టం కట్టి రాజ దంపతులు వానప్రస్థం స్వీకరించి అరణ్యాలకు బయలుదేరతారు.

ఆత్మవిద్య లోపించిన అలర్కుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మదాలస ముందుగానే వూహించింది. 'నీకు ఆపద కలిగినప్పుడు ఈ జాబు చూడు' అని ఒక రహస్య పత్రాన్ని అలర్కుడి చేతికిచ్చింది. కొంతకాలం అలర్కుడు బాగానే రాజ్యమేలాడు. క్రమేణా అతడిలో రాజ్యదాహం, విలాస జీవితంపైన మోజు పెచ్చుమీరాయి. నియంతృత్వ పరిపాలన రెచ్చిపోయింది. అలర్కుడిలో అహంకారం రెక్కలు విచ్చుకుంది. ఇది గమనించిన అన్నగారు సుబాహువు తమ్ముడికి తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాడు. కాశీరాజు సహాయంతో తమ్ముడి రాజ్యం మీదికి దండయాత్ర సాగించాడు. అప్పటికే అలర్కుడి సైన్యం నిర్వీర్యం అయిపోయింది. శత్రువును ఎదిరించి నిలిచి గెలిచే అవకాశం కనిపించలేదు అలర్కుడికి. అప్పుడు అమ్మ ఇచ్చిన కమ్మ విప్పి చూశాడు. దత్తగురువును ఆశ్రయించమని అమ్మ ఆదేశం.

వెంటనే అలర్కుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించి దత్త ప్రభువును వెతుక్కుంటూ బయలుదేరతాడు.

'మనోజయమే అన్ని విజయాలకు మూలం. రాజ్యాలు జయించటం ఒక జయం కాదు'- దత్తప్రభువు చెప్పినవన్నీ అలర్కుడు శ్రద్ధగా విన్నాడు. తిరిగి యుద్ధభూమికి వెళ్లి కాశీరాజుతో 'నాకు శత్రువులు ఎవరూ లేరు. నువ్వు వేరే శత్రువును వెతుక్కో. ఈ రాజ్యం కావాలంటే తీసుకో, ఏమైనా చేసుకో' అన్నాడు. ఈ మాటలు విన్న కాశీరాజు ఆశ్చర్యపోయాడు. అలర్కుడి అన్న సుబాహువును రాజ్యం తీసుకోమంటాడు. తమ్ముణ్ని సన్మార్గంలో పెట్టడమే సుబాహువు ఉద్దేశం. రాజ్యపాలన కాదు. కాశీరాజు అలర్కుడికి నమస్కరించి సుబాహువుతో తిరిగి వెళ్లిపోతాడు.

జ్ఞానోదయమైన అలర్కుడు తన కొడుక్కి రాజ్యాన్ని కట్టబెట్టి, అన్నల దారి వెతుక్కుంటూ అడవులకు వెళ్తాడు. ధనం వల్ల, రాజ్యం వల్ల జీవితంలో సుఖశాంతులు లభ్యం కావు. దత్తుడు చెప్పినట్టు 'ధ్వస్తి' (మనసును శుభ్రం చేయటం), 'ప్రాప్తి' (కోరికలు జయించటం), 'సంవిత్' (జ్ఞానసంపద), 'ప్రసాదం' (ప్రసన్నత)- ఈ నాలుగు క్రియల ద్వారా భోగి యోగిగా మారిపోవచ్చు. అమ్మ ఆదిగురువు. ఆ తరవాత ఆధ్యాత్మిక ప్రగతికి తగిన గురువును ఆశ్రయించటం మన వంతు. జనకుడిలా రాజ్యం ఏలనూ వచ్చు, రాముడిలా రాజ్య త్యాగం చేయనూవచ్చు!

- ఉప్పు రాఘవేంద్రరావు