ᐅప్రేమతోనే పూజ




ప్రేమతోనే పూజ 

పూజంటే పవిత్రంగా చెయ్యాలని అందరూ భావిస్తారు.
శరీరశుద్ధి, పట్టు పీతాంబరాలు, ఘనమైన పూజాద్రవ్యాలు, కమ్మని ఫల, నైవేద్యాలు, సదాచార పూజావిధానం... పాటిస్తారు. కానీ, అసలైంది మరిచిపోతారు. అదే... ప్రేమాస్పద పూజ.

అన్నీ ఉన్నా, భగవంతునిపట్ల ప్రేమ చూపకపోతే ఆ పూజ వ్యర్థమే.

పూజ చేస్తున్నా మనసు చంచలంగా ఉండటం, అప్పుడే అవీ, ఇవీ మాట్లాడటం, పొరపాట్లకు విసుక్కోవడం, కోపగించుకోవడం, ఎలాగోలా పూజ అయిందనిపించి, హాయిగా భోజనాలు ఆరగించడం... ఇదా పూజ?!

కానే కాదు.

పూజ ఒక ప్రేమాస్పద నివేదన కావాలి. మిగతా చర్యలన్నీ కేవలం ప్రేమకు వ్యక్తీకరణలు కావాలి తప్ప, వాటికి అధిక ప్రాధాన్యమిచ్చి, ప్రేమను మరిచిపోకూడదు.

కొందరు పూజను చాలా హడావిడిగా ముగించేస్తారు!

వాళ్లకా సమయంలో ఇతర పనులు మనసులో మెదలుతుంటాయి. చెయ్యాలి గనక పూజ చేస్తారు. చెయ్యకపోతే భగవంతుడికి ఆగ్రహం కలుగుతుందేమో... తనకేమన్నా ఇబ్బందురవుతాయేమో... అనుకున్న పనులు కావేమో... ఇలాంటి భయాలవల్ల చేస్తారు తప్ప- భక్తితో కాదు!

ప్రేమ చూపటమే చాలామందికి తెలియదు. ప్రేమకు పరాకాష్ఠ అయిన భక్తిని వారెలా చూపగలరు?

భక్తిలేనిదే భగవంతునితో బంధం ముడివడదు.

అందుకే- లోకంలో ఎన్నో పూజలు చేస్తున్నా, ఎలాంటి ఫలితాలూ దక్కటంలేదని వాపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. భక్తికి మొదటిమెట్టు ప్రేమే! ప్రపంచ సంబంధీకులతో మన వ్యవహారాలన్నీ పరస్పర ప్రయోజనాలతోనే ముడివడి ఉంటాయి. సాధారణంగా ప్రేమ పరిమళాలు ఎక్కడా గుబాళించవు. అందువల్లనే మనిషి ప్రేమకోసం అల్లారుస్తాడు. కానీ, ప్రేమ చూపించాల్సిన బాధ్యత తనకీ ఉందని తెలుసుకోడు. అదేదో ఎదుటివారు తనకివ్వాల్సిన బాకీగా భావిస్తాడు.

'మనం ప్రేమించనిదే, మనల్ని ఎవరూ ప్రేమించరు' అనేది స్థిర సత్యం, నిష్ఠుర వాస్తవం కూడా. ఇది అర్థం చేసుకోనంతకాలం మనం ప్రేమలోటును అనుభవిస్తూనే ఉంటాం.

శ్రీకృష్ణతత్వమంతా ప్రేమామృతవాహినులే! అందుకే అవి అమృతసిద్ధుల్ని అనుగ్రహిస్తాయి. రసానందడోలికల్లో వూగిస్తాయి. ఈ అనృతప్రపంచానికి ఆ అమృతస్థితి అందుబాటులో ఉండకపోవడానికి ప్రేమరాహిత్యమే అసలు కారణం!

పూజను మానసికంగానూ చేయవచ్చు. అలా చేసేందుకు ఎలాంటి పూజాద్రవ్యాలతో పనిలేదు. కేవలం నిర్మల అంతఃకరణతో పరిమళించే ప్రేమను అంతరంగంలో నింపుకొని, 'భగవంతుడు నావాడు. నాకత్యంత ప్రియతముడు. సర్వబంధుజనసమానుడు. నేను ఆయనకు నా సంపూర్ణ ప్రేమను పాదపుష్పంగా సమర్పిస్తున్నాను' వంటి భావనలతో, పరమాత్మపట్ల అంకిత హృదయంతో ఉండటమే సత్ఫలితాలనిచ్చే పూజ. అది అంతర్యామిని ఆనందపరుస్తుంది. అనుగ్రహాన్ని వర్షిస్తుంది.

ప్రేమకు మించిన పూజాపుష్పం మరోటి లేదు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్