ᐅమనిషిలోని దివ్యత్వం
దైవం అన్నింటికీ అతీతమైనంత మాత్రాన ఆ దివ్వెను అసాధ్యంగా భావించకూడదని ఒక సందర్భంలో నారదుడు నైమిశారణ్యంలోని మునులతో అంటాడు. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం అంతర్లీనంగా ఉందనీ ఆ త్రిలోక సంచారి తెలుపుతాడు. పురాణాలు ఉపనిషత్తులూ ఈ నిజాన్నే బోధిస్తున్నాయి. ప్రకృతిలోని ప్రలోభాలను ఆశించకుండా అంతర్గత దివ్యత్వాన్ని వ్యక్తీకరించడమే మానవ లక్ష్యం. మతాలు, తర్కాలు, సిద్ధాంతాలు, బాహ్యమూర్తులు- ఇవన్నీ అంత ప్రధానమైన అంశాలు కావు. మనలోని అంతర్గత దివ్యత్వాన్ని చైతన్యపరచి లక్ష్యంవైపు పయనింపజేయాలి. ఇందుకు అవసరమైన ఆధ్యాత్మిక అంశాలనే సాధనాంశాలుగా చేసుకోవాలి. విశ్వాతీతమైన శక్తి అంతా అఖండ దివ్యాగ్ని! అందులో నుంచి రాలిన నిప్పురవ్వలమే మానవులం. మనలోని ఆ దివ్యాగ్నిని ఆరనీయకూడదు. కొన్నిమార్లు అగ్నికణం చుట్టూ నివురు కప్పుకొని ఉండొచ్చు. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. మనిషిలోని ఆరణి తిరిగి దివ్యాగ్నిలో విలీనమయ్యేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. పూర్వకాలంలోని రుషి పుంగవులు ఈ సత్యాన్నే మార్గంగా చేసుకొన్నారు. శ్రీరమణులు, రామకృష్ణులు లాంటి యోగులు పూర్వాశ్రమంలో మనలాంటి మానవులే. సాధన చేశారు, సాఫల్యం పొందారు!
మనిషిలోని అంతర్గత శక్తికి పరిమితులు లేవు. 'పరమాత్మా! నీవేనా గొప్పవాడివి. నీ అంతటి వాళ్లం ఏదో ఒకనాడు మేమూ కాబోతున్నా'మని ఆ దైవాన్ని సవాలు చేయగల మహత్తు మనలోనూ ఉంది. ఆ మహత్తును వెలికి తీయాలంటే స్వశక్తిపై నమ్మకం ఉండాలి. ప్రయత్న లోపం ఉండకూడదు. నిప్పుపైని బూడిద తొలగిపోతే అదెంతటి శక్తినైనా సృష్టించగలదు. మనలోని ఆత్మ ఎప్పుడూ పరమాత్మను చేరాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఆ ఆరాటాన్ని జాగృతం చేసుకోగలిగితే మనిషి సునిశితుడై సమస్త దివ్యజ్ఞానాన్ని సంపాదించుకోగలడు. ఆ దిశగా ఒకసారి ప్రయాణం ప్రారంభించామంటే ఇహ అదొక నిరంతర గమనమే! ఆ దివ్యాత్మ రా... రమ్మంటూ చేరువ అవుతుంది. ఈ వైభవ మార్గం ఎలాంటిదనుకొన్నారు? ఆ మార్గం పైన మన పురోగమనాన్ని ఎవరూ ఆపలేరు. ప్రచండమైన గాలులు వీచినా మనం నిశ్చలంగా ఉండగలం. లక్ష్యంవైపు సాగుతున్న ఆత్మ అంతటి ఔన్నత్యాన్ని ఆపాదించుకొంటుంది.
ఆ దివ్యశక్తిని గురించిన పరిపూర్ణ జ్ఞానం సంపాదిస్తే తప్ప- మన పయనం సుగమం కాదు. పరీక్షలో ఉత్తీర్ణులం కావాలంటే గురువులు చెప్పింది విని, పుస్తకాలు చదవాలి. అలాగే దివ్యజ్ఞానం గురించీ తెలుసుకోవాలి. దైవస్థానమేమిటో గ్రహించి ఆ స్థానాన్ని చేరుకొనే ప్రయత్నానికి దివ్యజ్ఞానమే నాంది! అంతేకాని- ఆ దివ్యాత్మను కీర్తించడమొక్కటే సాధన కాదు. ఉత్తర రామాయణంలో శ్రీరామ-కుశలవుల యుద్ధ ప్రారంభంలో ఘట్టమిది. శ్రీరాముడు ప్రశ్నిస్తాడు- 'మీరు కీర్తించి గానం చేసిన రామాయణంలోని రాముణ్ని నేనే! నన్నే ఎందుకు అధిక్షేపిస్తున్నారు' అని. అందుకు కుశుడు బదులిస్తూ- 'రామాయణాన్ని పారాయణం చేసింది మీ గురించి తెలుసుకొని మీ అంతటి వాళ్లుగా ఎదగాలని మాత్రమే, మీకు దాసోహం చేయాలని కాదు!' అంటాడు. అలా దైవాన్ని తెలుసుకోవడం, తెలుసుకొని ఆ పరమాత్మను చేరుకోవడమే లక్ష్యంగా మానవుడు సాధన చేయాలి. తల్లిదండ్రుల్ని పూజిస్తూనే వారంతటి వాళ్లుగా ఎదిగినప్పుడే కన్నవారు సంతోషపడతారు. మనిషి సర్వజ్ఞుడు. సర్వశక్తిశాలి. తనలోని అంతర్గత శక్తిని గ్రహించి సాధన చేయగలిగితే బంధాల నుంచి విముక్తుడవుతాడు. అదే మానవుడి ధ్యేయం కావాలి.
- అప్పరుసు రమాకాంతరావు