ᐅధన త్రయోదశి



ధన త్రయోదశి 

శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమిలాగే విష్ణుమూర్తి అవతారంగా భావించే ధన్వంతరి జన్మించిన కార్తీక బహుళ త్రయోదశిని ధన్వంతరీ త్రయోదశి (ధన త్రయోదశి) అంటారు. మానవాళి ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదాన్ని అందించిన దైవం ధన్వంతరి. ఉత్తర భారతదేశంతోపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ధన త్రయోదశిరోజున ధన్వంతరిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది.
ధన్వంతరి మానవాళికిచ్చిన ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని అధర్వణ వేదానికి ఉపవేదమని అంటారు. ప్రకృతిలోని ప్రతి మొక్కా ఏదో ఒక రోగ చికిత్సకు ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. పసుపు సూక్ష్మక్రిమి నాశని అని మొట్టమొదట చెప్పింది ధన్వంతరే. లవణాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానివల్ల మానవ జాతికి కలిగే లాభ నష్టాల గురించి ప్రథమంగా ధన్వంతరే ప్రస్తావించాడు. లవణం లేకపోతే జీవనం లేదని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు అంటారు. ధన్వంతరి శస్త్రచికిత్స సందర్భంలో అవసరమైన దేహ సుషుప్తి (అనస్తీషియా) ఎలా ఉపయోగించాలో తెలిపాడని అంటారు. ఆ మెలకువలు ఉపయోగించి- మహాభారత యుద్ధంలో క్షతగాత్రులైన యోధులకు నకులుడు శస్త్రచికిత్సలు చేశాడంటారు. పోనుపోను ధన్వంతరి ప్రసాదించిన ఆయుర్వేదంలో కొంతభాగం లభించకుండా పోయింది. ధన్వంతరి చికిత్సా విధానంలో మరణాలు అతి తక్కువగా సంభవించేవంటారు.

ధన్వంతరి సుశ్రుతుడనే మహర్షికి ఆయుర్వేదం బోధించాడు. సుశ్రుతుని కారణంగానే శిష్యప్రశిష్యుల ద్వారా ఆయుర్వేదం నేటికీ సాధనలో ఉంది. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి (సర్పాన్ని) రజ్జువుగా చేసుకొని పాల సముద్రాన్ని సురాసురులు మథించినప్పుడు ధన్వంతరి అవతరించాడని చెబుతారు. శ్రీమహావిష్ణువుకు ఉన్నట్లే ధన్వంతరికి నాలుగు హస్తాలు. కుడి భాగంలోని కింది చేతిలో ఒక కలశం (అమృత భాండం), పై చేతిలో మరో కలశం (రస ఓషధుల సారం) కలిగి ఉంటాడు. ఎడమవైపున ఒకచేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో ఔషధ మొక్కలుంటాయి. ధన్వంతరి తెచ్చిన అమృత భాండం కోసమే దేవదానవులు కలహించారు. అందుకే ధన్వంతరికి సుధాపాణి అని మరో పేరు ఉంది.

మానవుడు స్వర్ణాభరణాలు ధరించడం వల్ల చర్మం రోగరహితం కాగలదని ధన్వంతరి వెల్లడించాడు. పుటం పెట్టిన స్వర్ణ భస్మాన్ని మూలికా వైద్యంలో వినియోగించడంవల్ల అన్ని వ్యాధులను నయం చేయవచ్చని ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నాడు. సప్త ధాతువుల్లో బంగారానికున్న వైద్యపరమైన శ్రేష్ఠత మరింకే ధాతువుకూ లేదని ఆయన చెప్పిందే. ఇంకే ధాతువుతో మిళితంకాని స్వర్ణభస్మం మనిషి జీవిత కాలాన్ని అధికం చేస్తుందని మానవాళికి తెలిపింది ధన్వంతరే. అందుకే ఆయన జన్మించిన త్రయోదశికీ బంగారానికీ అవినాభావ సంబంధం ఏర్పడింది. ధన త్రయోదశి రోజు బంగారం ధరించడం, కొనడం శుభసూచకంగా భావిస్తారు.

వారణాశిలో ధన్వంతరి ఆలయం ఉంది. తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి మూర్తికి ఎదురుగా ధన్వంతరి ఆలయం ఉంది. ఇక్కడ నిత్యపూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో పూజాదికాల తరవాత భక్తులకు ఇచ్చే తీర్థంలో తులసితోపాటు వివిధ ఔషధీయుక్త మొక్కల దళాలు ఉంటాయి. కేరళ రాష్ట్రంలో ధన్వంతరికి ఎనిమిది దేవాలయాలున్నాయి. అలయత్తూర్, కన్నూర్, కుట్టంచెరి, వెల్లోడ్, తయక్కడ్, వయస్కారం, వొలస్స పట్టణాల్లో ధన్వంతరి దేవాలయాలు ఉన్నాయి. కొట్టక్కల్ నగరంలోని ఆలయం ధూప దీప నైవేద్యాలతో పవిత్రంగా వెలుగొందుతోంది. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రం అగ్ని పురాణంలో నిక్షిప్తమై ఉందని అంటారు. మానవాళి తమ ఆరోగ్య సౌభాగ్యాల కోసం ధన త్రయోదశి రోజున ధన్వంతరిని ఎందరో పూజిస్తారు.

- అప్పరుసు రమాకాంతరావు