ᐅహరి చూపిన హరతత్వం



హరి చూపిన హరతత్వం 

శ్రీకృష్ణుడు గీతలో తన వైభవాన్ని చెబుతూ 'నేను రుద్రుల్లో శంకరుణ్ని' అంటాడు. యుద్ధరంగంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం చూసి 'ఇంత భయంకరమైన రూపం ఎందుకు? ఈ నీ ప్రవర్తనకు అర్థం ఏమిటి? నీ ప్రళయోన్ముఖం అయిన వృత్తాంతానికి ఆదికారణం ఏమిటో తెలపా'లని అర్జునుడు వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు 'ఇది నా కాలస్వరూపం. ప్రస్తుతం లోకాలను క్షీణింపజేయడానికే ఈ రూపంలో వర్ధిల్లుతున్నాను' అంటాడు. ఈ సందర్భంలో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపింది తనలోని హరుని తత్వాన్నే.
అభిమన్యుని వధానంతరం అర్జునుడు శోకనిద్రావివశుడై ఉండగా శ్రీకృష్ణుడు స్వప్నంలోనే అర్జునుని కైలాసానికి తీసుకువెళతాడు. సైంధవుని సంహరించడానికి శూలపాణికే పరమసాధనమైన పాశుపతం నీకు చాలా అవసరమని పలికి అర్జునునిచే పరమశివుని ప్రార్థింపజేస్తాడు. ఆ సందర్భంలో తనకు ప్రత్యక్షమైన పరమేశ్వరుని చూసి ఆనాటి రాత్రి తాను శ్రీకృష్ణుడికి సమర్పించుకున్న నిశాసమయ పూజాద్రవ్యాలైన మాల్యానులేపనాదులు శంకరుడి దేహంమీద చూసి ఆశ్చర్యపోతాడు. మురహర పురహరుల ఏకత్వానికి మురిసిపోతాడు. దివ్యాస్త్రాన్ని ప్రసాదించమని అర్జునుడు ప్రార్థించగా శంకరుడు ఒక సరస్సులో తన ధనుర్బాణాలు ఉన్నాయంటాడు. కృష్ణార్జునులు ఆ సరస్సును చేరుకుంటారు. అక్కడ అస్త్రాలకు బదులుగా రెండు భయంకర సర్పాలు విషం కక్కుతూ కనిపిస్తాయి. నరనారాయణులిద్దరూ శతరుద్రీయం పఠిస్తూ అభవుని మనసులో నిలుపుకోగానే ఆ సర్పాల స్థానంలో విల్లమ్ములు గోచరిస్తాయి. అవి తీసుకువచ్చి శంభుని ముందుపెట్టగా అతడు మాతృ స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు.

అర్జునుడు తాను యుద్ధం చేస్తున్నప్పుడు తనముందు ఒక దివ్యాకృతి త్రిశూలాన్ని ధరించి ఉండటం, ఆ త్రిశూలంనుంచి వ్యక్తమైన శూలపరంపరలు శత్రువుల్ని తెగటార్చడం, శత్రువులను తాకిన బాణాలు వారిని చంపిన కీర్తిని తనకు లభింపజేస్తూ ఉండటం దర్శించి- ఆ దివ్యాకృతి ఎవరని వ్యాసుని అడిగి శివుడని తెలుసుకుంటాడు.

ఉప పాండవుల్ని సంహరించడానికి సన్నద్ధమైన అశ్వత్థామకు పాండవ శిబిరాలను భూతరూపంలో రక్షిస్తున్న శంకరుడు ప్రసన్నుడవుతాడు. కృష్ణుడు తనకు అనురక్తుడని, అతడికి సహకరించడానికే భూతరూపంలో ఇక్కడ కావలి ఉంటున్నానని చెబుతాడు. ఉప పాండవులకు కాలం తీరిందని చెప్పి, అశ్వత్థామ చేతికి ఖడ్గం అందిస్తాడు. ఈ సత్యాన్ని ఎరిగిన కృష్ణుడు పాండవులను అక్కడినుంచి తప్పించి జరగవలసిన దాన్ని జరగనిస్తాడు.

ఈ విధంగా ఒకే తత్వం శ్రీకృష్ణశంకరులుగా వ్యక్తమై కర్తవ్యాన్ని నిర్వహించినట్లు మహాభారతం విశదం చేస్తోంది. శ్రీకృష్ణుడు విష్ణుతత్వం తాలూకు ఆవిష్కారమే గదా.

దక్షయజ్ఞం తరవాత విష్ణువుకు, శంకరుడికి యుద్ధం వంటిది ఏర్పడింది. అర్జునుడికి ఆ సన్నివేశాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఘర్షణ పడుతున్న హరిహరులవద్దకు బ్రహ్మాది దేవతలు, మునులు వచ్చి వారిని ప్రార్థించి వారి తత్వం ద్వంద్వం కాదని మూర్తిభేదంతో లోకంలో రెండుగా కనిపిస్తున్నారని చెబుతారు. అప్పుడు విష్ణువు శివునితో 'నిన్ను తెలుసుకున్నవాడు నన్ను ఎరిగినవాడే... నిన్ను నమ్మకంతో సేవిస్తే, నన్ను కొలిచినట్లే... మనకు భేదం లేదు. శ్రీవత్సం శూలాంకితమై వెలయుగాక' అని పలుకుతాడు. విష్ణువైన తనకూ హరుడికీగల అభేదాన్ని వివరిస్తూ కృష్ణుడు అర్జునుని ఎల్లప్పుడూ శివుని కొలువమని చెబుతాడు.

ఒకే పరమపురుషుడు హరి హరులనే రెండు తత్వాలుగా వ్యక్తం అవుతున్నారు తప్ప వేరు కాదని దీనివల్ల అవగతమవుతుంది. ఇదే వేద దర్శనం- హరిహరనాథ దర్శనం.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు