ᐅధనధర్మాల పండుగ




ధనధర్మాల పండుగ 

దీపావళి పర్వంతో అనేక సంప్రదాయాలు, పురాణగాథలు, చరిత్ర ముడివడి ఉన్నాయి. దేశం యావత్తూ మహాపర్వంగా ఆచరించే పవిత్ర వేడుకలో దాగిన కథలు నిరంతరం ధర్మసందేశాలను అందిస్తూనే ఉన్నాయి.
లోకకంటకుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించిన ఘట్టం ఈ పర్వంతో అనుసంధానితమై ప్రసిద్ధి చెందింది.

నిజానికి నరకాసురునితో యుద్ధాన్ని నేటి పరిభాషలో 'అంతరిక్ష సమరం'గా అభివర్ణించవచ్చు. నరకుడు భూదేవికి పుత్రుడు. అంటే ఒక గ్రహశకలాన్ని ఆధారంచేసుకొని, భూవాసులను క్షోభపెట్టిన అసురశక్తిగా భావించవచ్చు. అతడి స్నేహితుడు, రక్షకుడు 'ముర' అనే మరో రాక్షసుడు. ఆనాడు జరిగిన యుద్ధాన్ని పురాణాలు వర్ణించిన ప్రకారం చూస్తే- అది భూమికి చెందిన సామాన్య రణం కాదు.

అందుకే ఆ యుద్ధానికి శ్రీకృష్ణుడు గరుత్మంతుని వాహనంగా తీసుకొని వెళ్లాడు. లోకాంతరమైన స్వర్గానికి కూడా పీడ కలిగించినవాడు నరకుడు. 'నరులను బాధించేవాడు' అని ఈ పేరుకు అర్థం. అతడి కృత్యాలనుబట్టి ఈ పేరు ప్రసిద్ధిచెందింది. మానవుడిగా అవతరించినప్పటికీ, పరిపూర్ణ నారాయణ తత్వం కలిగిన భగవానుడు శ్రీకృష్ణుడు. కనుకనే- విశ్వనియమ రక్షణ చేసే విష్ణు ధర్మ ప్రకారంగా ఈ అసురశక్తుల్ని నియంత్రించడానికి సన్నద్ధుడయ్యాడు.

ప్రజాహితానికి ప్రమాదం కలిగించే రాక్షసుని సంహరించడానికి భూదేవి కూడా అనుమతించింది. పుత్రుడైనాసరే, విశ్వహితానికి విఘాతకారకుడైనందుకు ఆ తల్లి మాతృప్రేమను సైతం త్యజించి, నరకనాశనానికి ఆమోదించింది. ఆ ఆమోదానికి సూచనగానే భూదేవి అంశతో జనించిన సత్యభామాదేవి, వాసుదేవునితోపాటు రణరంగానికి వెళ్లింది. పరమాత్మ చేసిన అసుర సంహారానికి తానే సాక్షిగా, సహకారంగా నిలబడింది.

భూమిపై ప్రాగ్జ్యోతిషపురాన్ని కేంద్రంగా చేసుకొని, దుష్కృత్యాలను సాగించాడు నరకుడు. ఎందరినో సంహరించాడు, బంధించాడు, మానప్రాణ ధన భంగాలను చేశాడు.

జగద్రక్షణకై అవతరించిన జగన్నాథుడు- ఆ విద్రోహ స్వరూపాన్ని విధ్వంసం చేశాడు. ముందుగా అడ్డుకున్న మురాసురుని సంహరించి, 'మురారి'గా కీర్తిపొందాడు.

దేవతలు, భూదేవి మాధవుని ప్రస్తుతించారు. నరకుడిచే బంధితులైన పదహారు వేల రాచకన్యలను విడిపించి, వారికి క్షేమంకరమైన సుస్థితిని కల్పించదలచాడు శ్రీకృష్ణుడు. వారంతా పరమాత్ముని సన్నిధే తమకు రక్షణ స్థానమని ప్రార్థించారు. భూదేవి మాట మేరకు, మాధవుడు తన యోగశక్తితో, వారందరికీ తానే దిక్కై భద్రమైన వ్యవస్థను కల్పించి ఆదుకున్నాడని భాగవత కథ.

ఈ విశ్వరక్షణ లీల ఈ దీప పర్వంతో అనుబంధంగా ఉంది. మరొకవైపు- శ్రీకృష్ణుడికి పూర్వంనుంచే ఈ పర్వం ఆచారంలో ఉన్నట్లుగా ధార్మిక గ్రంథాల ప్రమాణం ఉంది. మానవులకు మృత్యుబాధలు లేకుండా అనుగ్రహించే శుభవేళగానూ దీన్ని వ్యవహరిస్తారు. ధర్మాధర్మాలకు ఫలప్రదాత అయిన యముని ఈ సందర్భంలో తర్పణల ద్వారా, ప్రార్థనల ద్వారా తృప్తిపరచి- బాధా నివారణ చేసుకొనే పద్ధతులు దీనిలో ఉన్నాయి. తమ పూర్వీకులు సద్గతులు పొందాలని జ్యోతిర్మయ లోకాలకు దారిచూపే ఉల్కాదానం, దీపదానం కూడా ఆచారాలు.

ఇంకొక ఆనవాయితీగా- దీపజ్యోతిని, ధనలక్ష్మిని పూజిస్తారు. ధనాధిపతి అయిన కుబేరుని, అతడిని ఆ స్థానంలో ఉంచి అనుగ్రహించిన మహాలక్ష్మీ మాతను ఆరాధించడం ముఖ్యాచారం. 'ధనలక్ష్మి' అనడంలోనే అద్భుత భావం ఇమిడి ఉంది. సుఖాన్నిచ్చే సాధనంగా మాత్రమేకాక, అనుగ్రహ స్వరూపంగా, పవిత్రరూపంగా ధనాన్ని చూడాలి... అని పెద్దల ఉద్దేశం.

'పవిత్ర'త అనగానే- ధనాన్ని సంపాదించడంలోనూ, వినియోగించడంలోనూ కూడా ధర్మం, న్యాయం ఉండాలి... అనే అంతరార్థం ప్రస్ఫుటంగా ఉంది. అలా సంపాదించిన ధనమే 'ధనలక్ష్మీదేవి'గా మనల్ని సుఖశుభమయ జీవన మార్గాల్లో పయనింపజేస్తుంది. లేనిపక్షంలో శిక్షారూపంగా నరకానికి (బాధకు) గురిచేస్తుంది. ధర్మనిర్ణేత అయిన యమధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు. ధన ప్రదాత అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. ఈ ఉత్తర దక్షిణ దిక్పాలకులకు జన్మ అనుబంధం- ధనానికీ, ధర్మానికీ ఉన్న సమన్వయం. ధర్మం ధనాన్ని నియంత్రించాలి- ఆర్జనలోనూ, వ్యయంలోనూ. వీరిరువురికీ ఆ శక్తినిచ్చిన పరాశక్తి- నరకచతుర్దశినాడు మహాకాళీ దేవిగా, అమావాస్యనాడు లక్ష్మీరూపంగా పూజలందుకుంటోంది. కాలశక్తి మన ధర్మాధర్మాలను గమనిస్తున్న దేవి. మన అవసరాలకు తగిన ఐశ్వర్యాన్ని ప్రసాదించే, ఆ తల్లి మరోరూపమే మహాలక్ష్మి. సరైన కాలంలో సరైన ఐశ్వర్యం, ధర్మమయంగా సంప్రాప్తించాలనే ఆకాంక్ష, సాధన... దీపావళి గాథల్లో, వేడుకల్లో మానవజాతికి అందిస్తున్న సంకేతాలు.

- సామవేదం షణ్ముఖశర్మ