ᐅపవిత్రమాసం కార్తీకం
శరదృతువులో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దైవ పూజకు అవసరమైన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ రుతువులో వచ్చే కార్తీకమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. శివకేశవులు ఇరువురికీ అత్యంత ప్రీతిపాత్రమైనది.
కార్తీకం స్నాన, దీప, దానాలకు ప్రసిద్ధి. సుందరమైన ఆహ్లాదకరమైన శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. కార్తీకంలో నదులు, చెరువులు, బావుల్లో నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారం వల్ల అపూర్వ తేజస్సును, బలాన్ని సంతరించుకుంటాయి. కార్తీకంలో పవిత్రజలాన్ని 'హంసోదకం' అంటారు. ఈ రుతువులో నదీ ప్రవాహాల్లో ఔషధులు సారవంతంగా ఉంటాయి. ఈ నీరు స్నానపానాదులకు అమృతతుల్యమని ఆయుర్వేద మహర్షుల భావన. కార్తీక దీపం ఉత్తమ ఫలాలనిస్తుందని విశ్వాసం. శివాలయం, విష్ణ్వాలయాల్లో దీపాలు వెలిగించడం పుణ్యప్రదంగా భావిస్తారు.
కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం. తన తనయుడు కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల శివునికి వారి పేరుతో ఉన్న కార్తీకమంటే ప్రీతి. గరళకంఠుడైన శివుని తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు గనుక ఈ మాసంలో సోమవారానికి విశిష్టత ఉంది. కార్తీక శుద్ధ పాడ్యమి నాటి గోపూజ పవిత్రమైనది. మర్నా డు విదియను 'యమద్వితీయ'అంటారు. భగినీ హస్తభోజనం నాటి ప్రత్యేకతను ఇప్పటికీ స్మరించకుంటారు. యముడు సోదరి యమున గృహంలో భోజనం చేశాడని పురాణగాథ. కార్తీకశుక్ల చవితి, పంచమి- నాగులను పూజించే తిథులు. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమినాడు ప్రారంభమైందంటారు. దిలీప మహారాజు భార్య కళింగభద్ర ఈ రోజు కార్తీక వ్రతం ఆచరించిందని పురాణోక్తి. కార్తీకంలో శ్రీమహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా సంభావిస్తారు. వివిధ నక్షత్రాలు విరాట్ పురుషుడికి వివిధ అంగాలు. నక్షత్ర పురుష పూజ అంటే విశాల విశ్వార్చనే.
కార్తీక శుక్ల ఏకాదశి- ప్రబోధినీ ఏకాదశి. నాలుగు నెలల పాటు నిద్రించిన విష్ణువు మేల్కోనేరోజని జన విశ్వాసం. ఈ ఏకాదశి నాడే భీష్ముడు అంపశయ్యపై పడిన కారణంచేత ఏకాదశినుంచి పూర్ణిమ వరకు అయిదురోజులు 'భీష్మ పంచకవ్రతం' ఆచరిస్తారు. ఈ రోజుల్లో గురువు వద్ద మంత్రదీక్ష స్వీకారం మోక్షదాయకంగా భావిస్తారు. ద్వాదశి నాటి తులసి పూజ ప్రశస్తమైనది.
తులసి మొక్కను, ఉసిరిక మొక్కను నాటి దీపారాధన చేస్తారు. దీన్ని 'క్షీరాబ్ధి ద్వాదశి' అంటారు.
కార్తీక పూర్ణిమ నాటి దీపదానం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. పార్వతీదేవి సాగరమధన వేళ హాలాహలం మింగమని శివుని ప్రార్థించిన సందర్భానికి సంకేతంగా ఈ ఉత్సవం చేస్తారు. కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి. శ్రీ మహావిష్ణువు దేహంనుంచి ఏకాదశీ దేవి ఉద్భవించి మురాసురుని సంహరించిందని అంటారు. స్నేహసౌభ్రాత్రాలను, కలిసి పంచుకోవడంలోని అమృతతుల్య భావనను ఈ నెల్లాళ్ల పొడుగునా పెంచిపోషించే కార్తీక వనభోజనాలు ప్రశస్తమైనవి.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు