ᐅవర్తమానం
భవిష్యత్తు మనిషిపై ఓ రంగుల వల విసిరి హంగు, పొంగులున్న కలలతో కవ్విస్తుంది. అందమైన జీవితాన్ని అందుకోమంటుంది. ఆచరణలో అడ్డంకులెదురైతే అంతులేని నిరాశనూ మిగిలిస్తుంది. అందుకే భావిజీవితం కోసం మితిమీరిన ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. మన పరిధులు పరిమితుల చట్రంలో ఒదిగి స్వయంకృషి కొనసాగిస్తూ వెళ్తే ఆశయ సాధనకు మార్గం సుగమమవుతుంది. లక్ష్యాలను దాటి ఇంకా ముందుకు సాగడానికి వీలవుతుంది. తిరిగిరాని 'నిన్న'కోసం 'నేటి'ని దుర్వినియోగం చేసేవాడికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉండదు. వర్తమానంలో జీవిస్తూ శ్రమించేవాడే నిజమైన సాధకుడు, కార్యదక్షుడు!
గతంనుంచి గుణపాఠాలు నేర్చుకుని బంగారు భవిష్యత్తు కోసం వర్తమానం విలువ తెలుసుకున్నవారే జీవితంలో విజేతలవుతారు. మన పురాణ పురుషులెవ్వరూ గతం తలచుకుని దుఃఖించలేదు. భవిష్యత్తు ప్రణాళికపైనే దృష్టి సారించారు. హరిశ్చంద్రుడు కాటికాపరి అయినా ఆత్మస్త్థెర్యం కోల్పోలేదు. నలమహారాజు అష్టకష్టాలు అనుభవించి అంతిమ విజయం సాధించాడు. శ్రీరాముడు అడవులపాలైనా కించిత్ ఖేదంలేదు. సీతాన్వేషణలో అన్నివర్గాలవారినీ కలుపుకొని రావణ సంహారం చేసి అనుకున్న లక్ష్యం సాధించాడు. శ్రీకృష్ణుడు కురుపాండవుల మధ్య సంధి పొసగదని తెలిసీ రాయబారం నెరిపాడు. ఇవన్నీ వారు వర్తమానంలో జీవించాలన్న నిజం చాటిచెప్పడానికే చేశారు. ప్రయత్నలోపం ఉండకూడదన్న సందేశాన్ని లోకానికి అందించారు.
బుద్ధి, జ్ఞానం వికసించిన మనిషి ఒత్తిడికి లోనవుతాడు... ఆత్మ న్యూనతకు గురవుతాడు... కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇంకొందరు తమకోసం కాక ఇతరులను సంతృప్తిపరచడం కోసం మొత్తం జీవితాన్ని వృథా చేసుకుంటారు. ప్రపంచంలో ఇతర జీవులకు ఇలాంటి ఇబ్బందులు లేవు. ఆహార సంపాదన, ఆత్మరక్షణలే వాటికి ముఖ్యం. పాములకు గెద్దలంటే భయం... కప్పలు పాములను చూసి పారిపోతాయి. చిలుకలు పచ్చని ఆకుల మధ్యే ఉంటాయి. ఒంటినిండా మచ్చలున్న పులి వెలుగునీడలున్న చెట్లకిందే పడుకుంటుంది. సింహం ఎండిపోయిన చెట్టుకింద తల దాచుకుంటుంది. ఆస్ట్రేలియా ప్రాంతంలో నత్రజని లోపించిన నేలలో మొలిచే ఓ చెట్టు (నెపంథిస్) తన ఊడలనే కబంధ హస్తాలుగా మార్చుకుని పక్కనుంచి వెళ్తున్న జీవులను పట్టుకుని చంపుతుంది. ఇవన్నీ ఆహార సంపాదన, ఆత్మరక్షణల కోసమే. మనిషి తప్ప ఇతర జీవులన్నీ వర్తమానంలోనే జీవిస్తాయి. వర్తమాన జీవన సాఫల్యమే ప్రకృతి మనిషికిచ్చిన నిజమైన 'వర్తమానం'!
- కిల్లాన మోహన్‌బాబు