ᐅనాగుల చవితి




నాగుల చవితి 

భారతీయ సంప్రదాయంలో, ప్రకృతిలోని ప్రతి అణువును దైవస్వరూపంగా భావించే లక్షణముంది. అలాంటి ఆరాధనల్లో నాగులపూజ ఒకటి. దేశ వివిధ ప్రాంతాల్లో వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా, సంవత్సరంలో మూడుసార్లు నాగులను వైభవోపేతంగా పూజిస్తారు. అవి- శ్రావణ శుక్ల పంచమినాడు 'నాగ పంచమి'. కార్తీక శుద్ధ చవితినాడు 'నాగుల చవితి'. మార్గశిర శుక్ల షష్ఠినాడు 'సుబ్రహ్మణ్యషష్ఠి'. వీటిలో నాగ పంచమిని ఉత్తర హిందూస్థానంలోను, సుబ్రహ్మణ్యషష్ఠిని దక్షిణ భారతదేశంలోను వైభవంగా జరుపుతారు. మనరాష్ట్రంలో ఆ రెండు రోజులతోపాటు, ఆ రెండింటికి నడుమవచ్చే 'కార్తీక శుద్ధ చవితి' (నాగుల చవితి) దినాన్ని గొప్పగా జరుపుతారు.
జాతి, కుల భేదాలు, స్థితిలో ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలూ చేసేది నాగారాధన. ఇందులో కృతజ్ఞత, అభిమానంవంటి భావాలు ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన భారతావనిలో పగలనక, రేయనక ఆరుబయట వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉన్నప్పుడు తెలిసో, తెలియకో (ఇతర జీవరాశులతో పాటు) నాగజాతి హింస జరిగే అవకాశం ఉంది. మిగిలిన ప్రాణుల వలన అంతగా హాని లేకపోవడంవల్ల, నాగులు విష ప్రాణులని పేరున్నందువల్ల వాటికి భయపడి పూజించడం ఈ పూజల వెనక ప్రధాన ఉద్దేశం. వ్యవసాయానికి హానిచేసే ఎలుకల్లాంటి కొన్ని ప్రాణుల బారినుంచి తమ పంటల్ని రక్షిస్తున్నందుకు కృతజ్ఞతతో కొందరు పూజిస్తుంటారు. భూభారాన్ని వహించే ఆదిశేషుడుగా, శివుని కంఠాభరణంగా, వినాయకుని జందెంగా, క్షీరసాగరమథన సమయంలో తాడుగా, విష్ణువుకు శయ్యగా, సూర్యుని రథానికి పగ్గాలుగా... ఇలా దేవుళ్ల సేవలో అనేక రకాలుగా పాల్గొన్నందుకు, వాటినీ దేవతా సాన్నిహిత్యం వల్ల భక్తితో పూజిస్తారు.

నాగారాధన మూడు రకాలుగా ఆచరిస్తారు. వల్మీక (పుట్ట) పూజ మొదటిది. రెండోది నాగ ప్రతిమారాధన. మూడోది నాగ విగ్రహారాధన. పై మూడూ వేర్వేరు పద్ధతుల్లో జరుపుతారు. ఆరాధనలో, ఆచరణలో తేడాలుంటాయి. వీటిలో కార్తీక శుద్ధ చవితినాడు ఆచరించేది వల్మీక పూజ. పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవత ప్రీత్యర్థం వాటిని ఆరాధించడం ప్రధాన ప్రక్రియ. పంటలు పండించే చేలు కోతలకు సిద్ధంగా ఉంటాయి. నేల తడి ఆరి పొడిబారే సమయమది. అందువల్ల నాగులు పుట్టల్లో నివాసం ఉండటానికి అనుకూలంగా ఉండే సమయం. కాబట్టి పుట్టలకు పూజ చేస్తే, నాగులను ప్రత్యక్షంగా పూజించే ఫలితం వస్తుందని దీని ఆంతర్యం.

ఆరాధనా విధానాన్ని పరిశీలిస్తే- ఆధ్యాత్మికతతోపాటు, ఆరోగ్య భావనలెన్నో ఇమిడి ఉంటాయి. పుట్ట దగ్గరకు వెళ్లి పరిసరాలను శుభ్రపరచి, బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు. ఆపైన పసుపు, కుంకుమలు చల్లి పూలతో అలంకరిస్తారు. దీపాలను వెలిగిస్తారు. అనంతరం పాలను పుట్టలోకి ధారగా పోస్తారు. ఈ పాలను నాగులు తాగుతాయని భక్తుల విశ్వాసం. చలిమిడి, చిమ్మిలి అనే పదార్థాలను నివేదన చేస్తారు. ఆపైన ప్రదక్షిణలు చేసి (అవకాశం ఉంటే పుట్ట చుట్టూ, లేకపోతే ఆత్మ ప్రదక్షిణ) తమను, తమ వారిని రక్షించమని ప్రార్థిస్తూ పాటలు పాడతారు. పగలంతా ఉపవాసం చేసి, ఉదయం నివేదన చేసిన పదార్థాలనే సాయంత్రం ప్రసాదంగా స్వీకరిస్తారు. పై ఆచారాలన్నింటిలోను అంతర్గతంగా ఉన్నది ఆరోగ్య పరిరక్షణే. బియ్యపుపిండి, బెల్లం కలగలిపి చేసిన చలిమిడి (చలవ చేసే తత్వం కలది కాబట్టి చలిమిడి), బెల్లం నువ్వులు కలిపి తయారుచేసిన చిమ్మిలి, ఈ రెండూ- ప్రస్తుత వాతావరణానికి అనుకూలమైన పదార్థాలు. ధాతుపుష్టిని, శారీరకంగా శక్తిని, సమస్థితిని కలగజేసే గుణం ఈ పదార్థాలకు ఉంది. పుట్టవద్ద చేసే పూజలో కొందరు, పూజానంతరం ఎర్రరంగు మీద తెల్లగడులు ఉన్న వస్త్రాన్ని కప్పుతారు. పూజానంతరం దీన్ని ఇంటికి తెచ్చి ఇంటిలో సంతానం చేత ఉపయోగింపజేస్తారు. దీనివల్ల నాగరాజు ఆశీస్సులు తమ బిడ్డలకు లభించి వంశాభివృద్ధి కలుగుతుందని వారి భావన. ఉపవాసం వల్ల జఠర శక్తి ఇనుమడిస్తుంది.

ఈ రోజున పొలం దున్నడం, భూమిని తవ్వడం, మంటలు పెట్టడంలాంటి పనులు చేయరు. ఇలా చేయడం వల్ల పాములకు హాని కలుగుతుంది. కాబట్టి ఒక్క రోజైనా వాటిని ఆ బారిన పడకుండా చేయడమే దీని ఆంతర్యం.

- అయ్యగారి శ్రీనివాసరావు