ᐅసర్వసమ భావన
'ఎల్లలోకము ఒక్క ఇల్లు' అనేది సనాతన భారతీయ భావన. మన పూర్వులు వ్యధ, ఘర్షణ లేని సర్వమానవ సమైక్య జీవనం ప్రసాదించమని భగవంతుణ్ని ప్రార్థించేవారు. సర్వులూ సుఖంగా ఉందురుగాక అని కోరుకునేవారు. అధికుల బాటలో మిగతావారు నడవాలనే నిబంధన ఆధునికం కాగా, అందరూ ఒకే మార్గంలో నడవాలనేది ప్రాచీన సంప్రదాయం. 'సమస్త జీవులూ సుఖంగా బతకాలి' అనే ఉపనిషత్ వాక్యం సర్వమానవ సమానత్వాన్ని చాటుతున్నది.
కులాలవారీగా చీలిపోయి సంఘశక్తి కూలిపోకుండా రక్షించే ప్రయత్నాన్ని మహాత్ములెందరో చేశారు. పురాణ పురుషులెందరో మనకు ఆదర్శంగా నిలిచారు. శ్రీరాముడు సీతాదేవి జాడను అన్వేషిస్తూ, మార్గమధ్యంలో కబంధుని సంహరించి, అతని ద్వారా సుగ్రీవుడి గురించి విని, కిష్కింధకు వెళుతూ, దారిలో మతంగ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి శబరిని చూస్తాడు. ఒక ఆటవిక జాతికి చెందిన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో భుజించి ఆదరిస్తాడు. చారిత్రక పురుషుల్లో మహారాణా ప్రతాప్ చెప్పదగ్గవాడు. ఆయన తన రాజచిహ్నంలో సూర్యుడికి ఒకవైపు తన బొమ్మ, ఇంకోవైపు భిల్లుడి బొమ్మా చిత్రింపజేశాడు. భిల్లులు ఆటవికులు. ఉత్తమ రసపుత్ర వంశ సంజాతుడైన ప్రతాప్ తన సరసన ఒక భిల్లుని బొమ్మను ప్రదర్శించి సర్వమానవ సమానత్వాన్ని లోకానికి చాటాడు.
నన్ను సర్వభూతాల్లోను, సర్వభూతాల్ని నాలోను చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరుకాడు. నేనాతని నుంచి వేరుకాను- అని భగవద్గీత బోధిస్తున్నది. తనలాగే పక్కవాణ్నీ ఎందుకు ప్రేమించాలో భారతీయ వేదాంతం చక్కగా వివరించింది. తన ఆత్మే సర్వులకూ ఆత్మ. అందువల్లనే నీ పక్కవానిలోనూ, నీలోనూ ఒకే ఆత్మ ఉన్నదని గ్రహించాలి. నీ పక్కవాడు నీవే అని తెలిసినప్పుడు సహజంగా అతణ్ని నీలాగే ప్రేమిస్తావు. 'ఈ సృష్టిలో అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఆయన నీకై వదిలినదాన్ని ఆయనకే నైవేద్యం చేసి అనంతరం అనుభవించు. ఇతరుల సంపదను దోచుకోవద్దు' అని ఉపనిషత్తు బోధిస్తున్నది.
ఈ సంపదలు కేవలం భౌతికమైనవే కావు. ఆధ్యాత్మిక భావనలూ సంపదలే! ఒకరి భావనలను ఇంకొకరు కించపరచుకోవడం పరమాత్మకు అంగీకారం కాదు! జాతి కారణంచేగానీ, పూజా విధానం కారణంచే గానీ ఈశ్వరుడు పక్షపాతం చూపడు. మాంస ఖండాలు అందించిన కన్నప్పనూ, పూలతో పూజించే నిష్ఠాపరుడైన పూజారినీ శివుడు సమానంగా భావించాడు. నందుడు అనే భక్తుణ్ని జాతి కారణం వలన చిదంబర క్షేత్రంలోనికి రానివ్వకపోతే పరమేశ్వరుడు ఆగ్రహించాడు.
నేటి సమాజానికి సమభావనం అత్యంత ఆవశ్యకమని మన జాతీయ నాయకులు గుర్తించారు. ఆచరణలో ప్రదర్శించి చూపారు కూడా! రైల్లో ప్రయాణిస్తున్న ధనవంతుడు భోజనం చేద్దామని కేరియర్ తెరిచాడు. పక్కనున్న పెద్దమనిషిని చూస్తూ 'మీది ఏ కులం?' అన్నాడు నింపాదిగా. 'నాకు కులం లేదు!' అని జవాబిచ్చాడు పెద్దమనిషి. 'కులం లేదా?' ఆశ్చర్యపోయాడు ధనికుడు. 'అన్ని కులాలూ నావే!' అన్నాడు పెద్దమనిషి. అర్థం కాలేదు ధనికుడికి.
'అవును... ఉదయం ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకొనేటప్పుడు మీరు హీనంగా భావించే కులస్థుణ్ని. చెప్పులు శుభ్రం చేసుకొనేటప్పుడు చర్మకారుణ్ని. గడ్డం గీసుకునేటప్పుడు నాయీబ్రాహ్మణ్ని. బట్టలుతుక్కునేటప్పుడు రజకుణ్ని. డబ్బులు లెక్కచూసుకొనేటప్పుడు వైశ్యుణ్ని. పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు బ్రాహ్మణ్ని... ఇప్పుడు చెప్పండి నేనే కులస్థుణ్నో!'
రైలు ఆగింది. జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆ పెద్ద మనిషికి నమస్కరించి సగౌరవంగా తీసుకెళ్ళారు. అప్పుడుగానీ గుర్తించలేదు ఆ ధనికుడు- తాను అంతసేపూ మాట్లాడుతున్నది జేపీ కృపలానీతోనని! ఆనాడు నాయకుల్లో ఇటువంటి ఆదర్శ భావాలుండటంలో ఆశ్చర్యంలేదు.
నరుణ్ని నారాయణుడిగా భావించడం సమభానకు పరాకాష్ఠ. రామకృష్ణ పరమహంస స్త్రీలనూ పురుషులనూ సమానంగా భావించాడు. పేద ధనిక తారతమ్యాలను పాటించలేదు. ఒక వెండి నాణేన్నీ మట్టిబెడ్డనూ సమానంగా చూసి రెంటినీ అవతలకు విసిరిపారేసిన సమదృష్టి ఆయనది. ఆయన ప్రియశిష్యుడైన వివేకానందస్వామి దరిద్రంలో బాధపడే సాటి మనిషిని నారాయణుడిగా భావించాలని సందేశం ఇచ్చాడు. దరిద్ర నారాయణ సేవే పరమావధిగా రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. మానవుడికీ మాధవుడికీ అభేదాన్ని చాటే 'మానవ సేవే మాధవ సేవ' అనే సూక్తి సర్వులకూ శిరోధార్యం.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు