ᐅధీశాలి
ఈ లోకంలో ఏం సాధించాలన్నా, ఏమున్నా లేకున్నా మనిషికి ధైర్యం ఉండాలి. అది ఉంటేనే ముందడుగు వేయగలడు. వెనకడుగు వేసేవారు, లేదా ఉన్నచోటునుంచి అసలు అడుగు కదపలేనివారు ధనం, బలం, బలగంలాంటి ఎన్ని వనరులున్నా ఏమీ సాధించలేరు. లౌకిక కార్యాల్లోనే ధైర్యం ఇంత కీలక స్థానం వహిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పథంలో దాని అవసరం ఎంతుండాలి?!
ఆధ్యాత్మిక మార్గావలంబికి, సాధకుడికి, లేదా సన్యాసికి ధైర్యం అవసరం ఏముంది? ఎవరిని ఎదిరించాలని, ఎవరితో యుద్ధం చేయాలని? నిజమే. భౌతికమైన ఆశలకు విముఖంగా ముక్కు మూసుకుని జపధ్యానాలు చేసుకునే సాధకుడికి ధైర్యంతో పనేముంది? ఆశలుంటేనే ఆవేశాలు. ఆవేశాలుంటేనే పోరాటాలు. అప్పుడే ధైర్యం అవసరం. ప్రాపంచిక సుఖలాలసతో ఇతరులతో పోట్లాడ్డానికి, గిల్లికజ్జాలు ఆడటానికి, యుద్ధాలు చేయడానికి... వీరికుండేది నిజమైన ధైర్యం కాదు. నిజమైన ధైర్యం కలవాడు సాధకుడు, సాధువు, సన్యాసి. అతనిదీ అసలుసిసలైన ధైర్యం. అతడు మొక్కవోని ధీరుడు. పిరికివాడు పరమపదాన్ని చేరుకోలేడని ఉదాసీనంగానే అయినా కఠినంగా అంటున్నాయి ఉపనిషత్తులు. సింహమై గర్జించమని స్ఫూర్తి రగిలిస్తాడు వివేకానందస్వామి. 'అర్జునా, పిరికితనంతో నపుంసకుడివి కావద్దు' అని నిరసిస్తూ హెచ్చరిస్తాడు శ్రీకృష్ణుడు. పిరికితనం నపుంసకత్వంతో సమానం. వీరుడై, ధీరుడై రొమ్ము విరుచుకుని ముందుకు సాగవలసిన సాధకుడు పిరికివాడైతే జపమాలలోని పూసకూడా కదలదు.
ఏమిటీ ధైర్యం? ఎలాంటిదీ ధీరత్వం? దాని స్వరూప స్వభావాలేమిటి? ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్ముఖుడై ఉండే సాధకుడు ఎవరిని ఎదిరించాలి? ఎవరితో యుద్ధం చేయాలి? పరిస్థితులతో యుద్ధం చేయాలి. పరిసరాలతో యుద్ధం చేయాలి. ద్వంద్వాలతో, దమననీతితో యుద్ధం చేయాలి. ముఖ్యంగా అనారోగ్యంతో, అరిషడ్వర్గాలతో, ఇంద్రియాలతో, శబ్ద, స్పర్శ, రూప, రస గంధాది పంచ విషయ విషవలయంతో, ఆత్మ వరకూ సాగవలసిన సాధనలో దారి ఇవ్వని, ఛేదింప శక్యంకాని దుర్భేద్యమైన పంచకోశ సంచయంతో... భీకర యుద్ధం! ఎడతెగని నిరంతర యుద్ధం! ఉదాహరణకు ఒక సన్యాసినే తీసుకుంటే- ఇల్లు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు... వీరందర్నీ శాశ్వతంగా వదిలిపోవాలంటే ఎంతో మనోధైర్యం కావాలి. మమకారాలను చంపుకొనే ధీరత్వం కావాలి! డబ్బూదస్కం లేకుండా, మారువస్త్రం, శీతోష్ణాలను ఎదుర్కొనే వస్తు సంచయం సర్దుకోకుండా ఉన్నపాటున పక్షిలా లేచిపోవాలంటే ఎంత మనోస్త్థెర్యం కావాలి! రేపటి ఏర్పాటులేని రెప్పపాటు ప్రయాణం, ఉనికినే వదులుకుని వెళ్తున్న ఉన్నపాటు ప్రయాణం.... అరణ్యాలో, ఆశ్రమాలో, గుహలో, హిమాలయాలో... వర్షమో, ఎండో, హిమోత్పాతమో... దొంగలో, పాములో, క్రూరమృగాలో...! ఏది ఎదురవుతుందో, ఏమి అవసరమవుతుందో... ఆంతర్యంలో రగిలే యోగాగ్ని తప్ప, విమలమైన వైరాగ్యం తప్ప మరో ఉపకరణమేమీ లేని అర్ధనగ్న, కొండొకచో పూర్తి నగ్న సాధకుడు, సన్యాసి... అతణ్ని మించిన ధీశాలి ఎవరున్నారు? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ భారతదేశంలోని ఒక కౌపీనధారి ముందు ఓడిపోయాడు. ఆ రాజసం, ఆ ఠీవి, ఆ నిర్భయత్వం, ఆ వైరాగ్యం ముందు వెలాతెలాపోయాడు. అత్యంత ఆకర్షణీయమైన ప్రాపంచిక సుఖభోగాలను తృణప్రాయంగా తీసివేయాలంటే, ధూళిమాత్రంగా తోసిరాజనాలంటే, కౌపీన ధారణతో లేదా కాషాయధారణతో లేదా దిగంబరత్వంతో విరాజిల్లాలంటే- ఆ మనిషి ఎంత ధీరుడై ఉండాలి! గహనమైన గమ్యాన్ని, అందుతుందో లేదో అర్థంకాని, నిర్ధారణలేని గమ్యాన్ని ఎంచుకుని సుదీర్ఘ సాధనకు ఆయత్తమవుతున్నాడంటే- ఆ మనిషి ఎంత ధీరుడై ఉండాలి! అవని ఆవాసంగా, ఆసనంగా, ఆకాశం పైకప్పుగా, జీవితాన్నే హోమగుండంగా సత్యాన్ని తప్ప సర్వాన్నీ ఆహుతులుగా సమర్పించి భూనభోంతరాళాలు దద్దరిల్లేలా మంత్రోచ్ఛాటన చేస్తూ ఆత్మావలోకనంతోపాటు విశ్వశాంతికై నిర్విరామ యజ్ఞం చేసే ఆత్మజ్ఞాని ఎంత సమున్నత ధీశాలి! ఆయన ముందు, ఆ ఆధ్యాత్మిక సింహం ముందు- ఈ పిరికి ప్రపంచం ప్రణమిల్లుతుంది. జలం కూడా ఆధ్యాత్మికావేశంతో ప్రజ్వరిల్లుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి