ᐅనేను-నాది
ఈ జగం మాయామేయం. కానీ, ఇదే నిత్యమని సంభావిస్తాం. నా ఇల్లాలని, నా కుమారుడని ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఎంతో అల్లాడతాం! ఉసురు కాస్తాపోయిన తరవాత, శరీరం కట్టెల్లో కాలుతూ ఉంటే ఆ ఇల్లాలుకానీ, కుమారుడుగానీ రక్షించడానికి తోడైరారు! -హరిశ్చంద్ర చక్రవర్తి విధివిలాసంవల్ల బికారియై, కాటికాపరిగా జీవనం గడుపుతూ తనలో తాను నైరాశ్యంతో ఇలా వాపోతాడు.
'నాది' అనే భావనే ఇహలోక కష్టసుఖాలకు మూలం. 'నాది' ఎక్కువయ్యే కొలదీ ఈ శరీరం మరింత కోరుకుంటుంది. కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధ భగవానుడు ప్రవచించాడు. కోరికలను త్యజించమని చెప్పడం సులభం; ఆచరించడం కష్టం. 'నాది' అనేది అనాదినుంచి మనల్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉంది. దాన్ని వదిలించడం కష్టసాధ్యం.
'గురువుగారు! ఇందాకటినుంచి వింటున్నా! మీ ప్రసంగంలో నాలో ఇంకొకరున్నారంటున్నారేమిటి! నేనే కదా లోపలా బయటా!' అని తన సందేహాన్ని వ్యక్తపరచాడు శిష్యుడు. గురువు ఇతడికి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలా అని ఆలోచించి చిన్నచిన్న ప్రశ్నలు వేశాడు.
'నాయనా! ఆ పుస్తకం ఎవరిది?'
'నాది!' శిష్యుడు ఠక్కున జవాబిచ్చాడు.
'నాయనా! ఆ మస్తకం ఎవరిది?'
'నాది'
'నాది అంటే ఎవరిది?'
'నాదే'
'శరీర భాగమైన మస్తకమూ నీదే, విడిగా ఉన్న పుస్తకమూ నీదే, అంటే... ఆ రెండింటికీ యజమాని ఎవరో వేరే ఉన్నారన్నమాట! ఆ యజమానే నీ నోటివెంట పలుకుతున్నాడు...'
శరీరంతో సంబంధంలేని 'నేను' ఒకరున్నారని శిష్యుడు గ్రహించాడు. మరి ఈ 'నేను'కు మోక్షం ఎప్పుడు? అని సందేహం కలిగింది శిష్యుడికి.
'గురువుగారూ! నేను మోక్షం పొందాలనుకుంటున్నా!'
'మంచిది నాయనా! 'నేను' నశిస్తే మోక్షం కలుగుతుంది! 'నేను' నీలో ఉన్నంతకాలం అహంకారం ఉంటుంది!'
'అహం నశిస్తే నేను మోక్షానికి పోవాలని మాత్రం ఎలా కోరుకోగలను? 'నేను' అనే భావన ఉంటేగదా మోక్షంపై కాంక్ష కలిగేది?'
'అహంకారమే లోకంలో పెక్కు కష్టాలకు కారణభూతం. దాన్ని తగ్గించుకోవాలి. నా సంపద, నా ఇల్లు, నా ఇల్లాలు, నా పిల్లలు... ఈ ఆలోచనలు స్వార్థానికి దారి తీస్తాయి. వీటిమీద మమకారాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది!' అని గురువు ప్రబోధం చేశాడు.
సంఘవ్యతిరేక శక్తులైన దుష్టుల నోట వెలువడే మాటలు 'నాతో పెట్టుకోవద్దు. మన సంగతి తెలీదు కాబోలు, నా సంగతే వేరు...!' -ఇవన్నీ అహంకార మమకారాలకు గుర్తులు. సమాజంలో అశాంతికి కారణభూతమైన మాటలు. తమ లాభం చూసుకొనే స్వార్థశక్తుల ఊతపదాలు అవి. పరార్థ పరాయణుల నోటివెంట ఈ మాటలు రావు. అహంకారం ఎంత తక్కువ ఉంటే సుఖం అంత ఎక్కువ ఉంటుంది. సమాజంలో ఇతరులకు ఉపకారంచేసే సేవాభావంగల వ్యక్తులు స్వార్థరహితులుగా ప్రఖ్యాతి చెందుతారు. సర్వప్రాణులకూ ఒక చైతన్య పదార్థమే ఆధారం అనీ, అదే శాశ్వతమైనదనీ, దానికి మృత్యువులేదనీ ఎవరు గ్రహిస్తారో వారు 'నేను-నాది' అనే మాటలను తక్కువగా ప్రయోగిస్తారు. అందరూ ఆఖరికి శ్మశానం చేరవలసిందే అనే సత్యాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని ప్రవర్తిసారు.
భాగవతం ప్రకారం మనదేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారకుడైన మహాపురుషుడు జడభరతుడు! పుట్టుకతోనే అహంకార మమకారాలను వదిలివేసిన మహాజ్ఞాని అతడు. సదా భగవంతునే ధ్యానిస్తూ గడిపేవాడు. ఇతరులకు బుద్ధిహీనుడు, గుడ్డివాడు, చెవిటివాడు లాగా కనిపించేవాడు. రహూగణుడు అనే రాజు కపిల మునివద్ద జ్ఞానభిక్ష పొందాలని, పల్లకిలో ప్రయాణం చేస్తున్నాడు. మోసే బోయివాడు ఒకడు అలసిపోయి, దారిపక్కన ఉన్న భరతుణ్ని పిలిచి, పల్లకి దండాన్ని అతడి భుజంపై పెట్టి మోయమన్నాడు. జడభరతుడు పల్లకి మోస్తున్నాడుగాని, అలవాటులేని పని కావడంవల్ల ఎగుడుదిగుడుగా అడుగులు వేశాడు. రాజు పల్లకిని మోస్తున్న జడభరతుణ్ని తిట్టసాగాడు. అహంకార మమకారాలను వీడిన జడభరతుడు సౌమ్యంగా సమాధానమిచ్చాడు.
'ఓ రాజా! నీ శరీరపు బరువు నా శరీరానికేగాని, నాకు కాదు. నువ్వు తిట్టే తిట్లు నా శరీరాన్నా, నన్నా? స్వామిభృత్య సంబంధాలు శరీరానికేగాని, జీవులకు కాదు!' -ఈ సమాధానం విన్న రాజు పల్లకి దిగి జడభరతుడికి నమస్కరించి నిలిచాడు. జడభరతుని వద్ద ఉపదేశం పొందిన రాజు అహంకార మమకారాలను వదిలేశాడు.
'దుఃఖంలో ఉన్నాను. శాంతి లభించేదెట్లా?' అని రమణ మహర్షిని అడిగాడు ఒక భక్తుడు. భగవాన్ రమణ మహర్షి ఇలా చెప్పారు- 'నిద్రలో లేని దుఃఖం మెలకువలో ఉంటున్నది. కారణం? నిద్రలో 'నేను' అనే తలంపు లేదు. అంతా సుఖమే. మెలకువ రాగానే ఈ 'నేను' తలంపు పడుతున్నది. దీన్ని ఆధారం చేసుకొని దుఃఖం, ప్రపంచం, సర్వం బయలుదేరుతున్నాయి. అందుకే ఈ 'నేను' తాలూకు పుట్టుక స్థానాన్ని వెదకమంటున్నాను. ఈ 'నేను' పోతే అంతా సుఖమే. అంతా శాంతే!'
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు