ᐅమనసులో మహిషాసురుడు




మనసులో మహిషాసురుడు 

మహిషాసురుడు మూడు లోకాలను గడగడలాడిస్తూ దేవతలను భయకంపితుల్ని చేసేసరికి వారంతా శక్తిమాత కోసం ప్రార్థించారు. అప్పుడు జగన్మాత ఉద్భవించి మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. అప్పటికే అతడు శివునితో 'భూమ్యాకాశాల్లో ఎక్కడా మరణం సంభవించదు' అనే వరాన్ని పొంది ఉన్నాడు. ఆ వర ప్రభావం వల్ల మహిషాసురుని తల నేలకొరిగే సరికి అతడి రక్తపు బొట్టు నుంచి వేలకొద్దీ మహిషాసురులు జనించేవారు. అలా తొమ్మిది రోజుల హోరాహోరీ యుద్ధం తరవాత జగన్మాత సర్వశక్తులు ఏకాగ్రం చేసి శక్తిమయంగా రూపుదిద్దుకుంది. తన నాలుకను భూమిపై పరచి మహిషాసుర సంహారం కావించింది.
ఈ పురాణగాథను మనిషికి అన్వయించి చూస్తే- మనిషి మనసులోని మహిషాసురులు, వారి విన్యాసాలు అవగతమవుతాయి. మనిషి తనలోని ఒక బలహీనతను అర్థం చేసుకుని దాన్ని అధిగమించి బలాన్ని సమకూర్చుకునేసరికి వంద బలహీనతలు పుట్టుకొస్తుంటాయి. శరీరానికి ఒకటే ముఖం. మనసుకు మాత్రం ఎన్నో ముఖాలు. ఒక్కొక్కటీ ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతుంది. ఒకదాన్ని సంతృప్తిపరిస్తే మరొకటి అసంతృప్తి చెందుతుంది. అలా అన్నింటినీ సంతృప్తిపరచాలనే తాపత్రయంతో మనిషిలో శక్తి ఆవిరైపోతుంది. శరీరం కుంగిపోతుంది. అలా అస్థిరమైన మనసు శరీరంలో ఒత్తిడి కలిగించి కల్లుతాగిన కోతిలా పరుగెత్తిస్తుంది. అదే మనసు శరీరానికి, ఆత్మకు ఎంతో సహకారిగా నిలుస్తుంది. మంచీ చెబుతుంది, చెడూ చెబుతుంది. వాటికి వివేకం, విచక్షణ అని పేరుపెట్టి మనిషిని బుద్ధిజీవిగా ఉండమంటుంది.

కాసేపు అవునంటుంది, కాసేపు కాదంటుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటుంది. తీరా చేసిన తరవాత ఎందుకిలా చేశావు, అలా చేసి ఉంటే బాగుండేది అంటూ సందిగ్ధావస్థలో పడేస్తుంది. సంశయాల నడుమ దోషిగా నిలబెడుతుంది. అలా కంటికి కనిపించని మనసు లోపల నుంచి వాగుతూ, రొదపెడుతూ, రకరకాల అభిప్రాయాలూ అనుమానాలతో మనిషిని అతలాకుతలం చేస్తుంది.

సూర్యకిరణాల కంటే వేగవంతమైన ఈ మనసును పట్టుకోవాలంటే ఎంత శక్తి కావాలి? ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఒక సైనికుడిలా క్షణక్షణం పహరా కాస్తుండాలి. ఏ క్షణం ఎటు పరుగెడుతుందో, ఏ కోరికల్లో పడవేస్తుందో, ఎటువంటి సమ్మోహనాలకు గురిచేస్తుందో గమనించుకుంటూ ఉండాలి.

అలా జ్ఞానేంద్రియాలైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ద్వారా విషయాలను గ్రహిస్తుంది. ప్రతి విషయానికి విశ్లేషణనిచ్చి తీర్పు చెప్పి గందరగోళానికి గురిచేస్తుంది. మనసు చేసే ఈ మాయను తెలుసుకోవడం మాటలు కాదు. అలాంటి మనసు... ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చకుండా మౌనంగా ఉండగలిగితే, ఉండిపోతే కొంతకాలానికి ఆ మనసే శూన్యమైపోతుంది. ఆ శూన్యంలోనుంచే మనిషి అజేయమైన దాన్ని ఆవిష్కరించుకోగలడు. తానేమిటో, తనలోని శక్తియుక్తులేమిటో తెలుసుకోగలిగే జ్ఞానాన్ని పొందగలడు. కష్టనష్టాలను ఎదుర్కొనగలిగే ధైర్యసాహసాలు సాధించగలడు. చివరకు శక్తిమంతుడిగా రూపు దిద్దుకోనూగలడు.

ఇంతటి కార్యసిద్ధికి నిష్కామకర్మ అంటే ఫలితాన్ని ఆశించిన కర్మాచరణ, ఏకాగ్రత, ధ్యానం, జ్ఞానం వంటి ఆయుధాలు ఎంతో ఉపకరిస్తాయి. స్థితప్రజ్ఞులుగా నిలబెడతాయి. అలా మనసులో నాట్యం చేసే ఎంతమంది మహిషాసురులనైనా సంహరించగలుగుతాడు. అప్పుడిక జీవితంలో ప్రతిరోజూ విజయదశమే.

- డాక్టర్ డి.చంద్రకళ