ᐅజయహో జననీ దుర్గా




జయహో జననీ దుర్గా! 

సృష్టిలోని ప్రత్యణువులో ప్రచ్ఛన్నంగా ప్రజ్వరిల్లే శక్తి పరమేశ్వరి. ఆ శక్తిని ధరించినవాడే పరమేశ్వరుడు. వారిరువురికీ భేదం లేదు. ఆమె దుర్గ, లలిత, గాయత్రి, పార్వతి. ఏ పేరుతో పిలిచినా పరాశక్తి ఆదిశక్తి, మూలశక్తి ఒకే చిచ్ఛక్తి. ఈ ప్రపంచమంతా ఆ దివ్యశక్తి అనంతలీలా వైభవం.
ఆ శక్తిని వేదాలు గాయత్రి అని గానం చేశాయి. ఉపనిషత్తులు ఉమాదేవి అని కీర్తించాయి. పురాణాలు లలిత, కాళి అని నామకరణం చేశాయి. ఆగమాలు మహా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మహాకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి అని స్తుతించాయి. ఆమె దుర్జ్ఞేయ (మనసు తెలుసుకోలేనిది) అందుకే ఆమె దుర్గ అయింది. ఆమె నిత్య. అఖిల విశ్వరూపిణి. ప్రపంచమంతా ఆమెతోనే నిండి, నిబిడీకృతమై నడుస్తుంటుంది. విశ్వాన్ని సృష్టించి, పాలించి, చివరకు లయంచేసే మహామాయ.

సృష్టికి ముందు ఆమె తల్లి. తొలిదైవం. సృష్టికోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పురుషరూపం దాల్చుతుంది. ప్రపంచాలను, జీవకోటిని పరిరక్షించే ఏకైక మహాశక్తి దుర్గ. గుడ్డి విధి ఖేలనానికి, అసురశక్తుల విశృంఖల అరాచకాలకు అతీతంగా మెరిసే సుస్థిరమైన మహాసంకల్పం ఆమెది. పరిభ్రమించే శతకోటి సూర్యగోళాల ప్రస్థానానికి పరమావధి ఆమె. వేద స్వరూపిణిగా వెలిగే ఆమెను వేదవేత్తలైనా పూర్తిగా గ్రహించలేరు. ఆ వేదాలన్నీ ఆమెనుంచే ప్రాదుర్భవించాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర దేవతలు, రుషులు ఎవ్వరూ ఆమె సముజ్జ్వలమైన మహిమను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆమె ఒకేసారి మూడు భూమికల్లో భాసిస్తుందంటారు. సకల ప్రపంచాలకు అతీతంగా నిలబడి ఈ సృష్టిని పరాత్పరుని అవ్యక్త మహస్సుతో అనుసంధానిస్తుందని విశ్వసిస్తారు. విశ్వ జనీనమైన నిఖిల మహాశక్తిగా సర్వ జీవరాశిని సృష్టించి, లక్షలాది ప్రాకృతిక ప్రక్రియలను నడుపుతుందంటారు. వ్యష్టిరూపంగా ఆ శక్తుల్ని తనలో రాశీభూతం చేసి, మానవ వ్యక్తిత్వానికి, దైవత్వానికి నడుమ సంధానకర్తగా పని చేసే ఆమె సర్వోన్నత దైవాన్ని ధరించి ఉంటుందని చెబుతారు. భగవంతుడు ఆమెలో నిరంతర సచ్చిదానందంగా అభివ్యక్తమై ఉంటాడన్నది నమ్మకం.

త్రేతాయుగంలో రావణుణ్ని జయించడానికి బ్రహ్మదేవుని సూచన మేరకు శ్రీరాముడు దుర్గాదేవిని స్తుతించాడు. హిమవంతుడికి సర్వాలంకార భూషణాలతో చతుర్భుజాలతో శ్యామలవర్ణంతో దర్శనమిచ్చిందట ఆమె. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో 'దుర్గాదేవిని స్తుతించు' అని ప్రబోధించగా, అర్జునుడు ఆమెను సభక్తికంగా ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు దుర్గాభవానీ కవచం మార్కండేయునికి ఉపదేశించాడు. దుర్గతుల్ని హరింపజేసే ఈ మంత్రమాల రక్షణ కవచం వంటిదని చెబుతారు.

ఆమె ప్రణవాక్షరం. మన జీవన నిశీధినులను ప్రదీప్తంచేసే సూర్యదీప్తి ఆమె. ఆమె పాదాల అమృత స్పర్శతో జీవన బాధాగ్ని స్పందన మటుమాయం అవుతుంది. సృష్టి అంతటా ఆమె మాధుర్యం పొంగి ప్రవహిస్తుంది. అన్ని వైరుధ్యాలూ సమసిపోతాయి. భువన జీవనం తన దివ్య సామరస్య మంత్రగీతంగా మారుతుంది. ఆమె వైపే మన జ్ఞానం అధిరోహిస్తుంది. ఆమె కోసమే మన ఆకాంక్ష వెదుకుతుంది. యుగయుగాలుగా, జన్మ జన్మలనుంచి మనం అన్వేషించే ఆనందం, వెలుగు, అమృతత్వం... ఆమే!

- కె. యజ్ఞన్న